YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గులాబీలో గ్రూపులు మాములుగా లేవుగా

గులాబీలో గ్రూపులు మాములుగా లేవుగా

వరంగల్, జూన్ 23,
టీఆర్ఎస్‌లో గ్రూపు రాజకీయాలతో నష్టం జరుగుతుందని భావించిన అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మాజీలతో కేటీఆర్ మంతనాలు చేసి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ మంత్రం బెడిసికొడుతోంది. గ్రూప్ రాజకీయాలు కంటిన్యూ అవుతుండటంతో కొంతమంది నేతలు ఇప్పటికే పార్టీని వీడగా మరికొంతమంది సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే వారికి నచ్చజెప్పేందుకు రంగంలో కేటీఆర్ దిగినా అసంతృప్తికి చెక్ పెట్టలేకపోతున్నారు. అందుకు కొల్లాపూర్ నియోజకవర్గమే నిదర్శనం. పార్టీలోని గ్రూపుల నేతలు మాత్రం ఢీ అంటే ఢీ అంటున్నారు.బహుళ నాయకత్వం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని కీలక నేతల్లో అసంతృప్తి ఉంది. పార్టీ పదవులు లేకపోవడంతో కొంతప్రాధాన్యత తగ్గడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజా, మాజీ నేతల మధ్య గ్రూపులు సైతం తారాస్థాయికి చేరాయి. రాబోయే ఎన్నికల్లో గ్రూపులతో నష్టం జరుగుతుందని సర్వేల్లో తేలడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది పార్టీ అధిష్టానం. అందులో భాగంగానే నియోజకవర్గాల్లోని బలమైన నేతలతో సంప్రదింపులకు ప్రణాళికను రూపొందించింది అధిష్టానం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతలుగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పాలమూరు జిల్లాలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. వారు పార్టీలో అంటిముంటినట్టు ఉంటూ అనుచరులతో మాత్రం మంతనాలు చేస్తున్నారు. తమ ప్రాబల్యం తగ్గకుండా పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అయితే వారిలో అసంతృప్తిని పోగొట్టేందుకు కేటీఆర్ స్వయంగా భేటీ అయ్యారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ప్రజల్లో ఉండే నేతలకే టికెట్ ఇస్తామని స్పష్టం చేశారు. ఇక గ్రూప్‌లకు చెక్ పడినట్లేనని అందరూ భావించారు. అయితే రెండురోజుల్లోనే కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు సవాల్ విసిరారు. కేటీఆర్ జూపల్లితో చర్చలు జరపడంతో తమ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందని.. అనుచరులు సైతం డిఫెన్స్ లో పడతారని భావించే హర్షవర్దన్ రెడ్డి సవాల్ చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంటే కేటీఆర్ పాచిక పారలేదని స్పష్టంగా అర్ధమవుతోంది.గ్రూపులతో కీలకనేతలు పార్టీని వీడుతున్నారు. మొన్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, ఆయన భార్య మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మీ టీఆర్ఎస్‌ను వీడారు. తమ వర్గం నేతలపై బాల్క సుమన్ వేధింపులకు పాల్పడుతున్నారని, పార్టీలో గౌరవం లేని కారణంగానే తాను టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా ఓదేలు ప్రకటించారు. తాజాగా మాజీ మంత్రి పీజేఆర్ కుమార్తె, జీహెచ్ఎంసీ కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వైఖరీతోనే పార్టీని వీడుతున్నట్లు పేర్కొంది. ఆలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సునీతతో పాటు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ పార్టీని వీడారు.ఇదిలా ఉంటే నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోచారం శ్రీనివాస్ రెడ్డికి మంత్రి ప్రశాంత్ రెడికి, జడ్పీ చైర్మన్ విఠల్ రావు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మధ్య , కల్వకుర్తి నియోజకవరంలో ఎమ్మెల్యే జైపాల్- ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వర్గ పోరు, తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిలకు మధ్య వార్ నడుస్తోంది. నల్లగొండ జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయి. నాగార్జున సాగర్‌లో ఎమ్మెల్యే భగత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మెదక్‌లోనూ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెలీ శేరి సుబాష్ రెడ్డి మధ్య విభేదాలున్నాయి. మహేశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మధ్య, కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంక్రటావు మధ్య, ఇల్లందులో బానోత్ హరిప్రియ, మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య మధ్య వర్గపోరు సాగుతూనే ఉంది. కరీంనగర్‌లో ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, మంత్రి గంగుల కమలాకర్ మధ్య విభేదాలున్నాయి. వరంగల్‌లో ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ మధ్య విభేదాలు అధిష్టానం దృష్టికి వెళ్లాయి. అదే విధంగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్, టీఆర్ఎస్ నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇలా ప్రతి నియోజకవర్గంలో వర్గాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇలాంటి ఘటనలతో రాబోయే ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని సర్వేల్లో వెల్లడి కావడంతో పార్టీ సయోధ్యకు సంప్రదింపులు చేపట్టింది. అయినప్పటికీ మరో వైపు విభేదాలు బహిర్గతమవుతున్నాయి. ఇది ఇలాగా ఉంటే పార్టీకి గడ్డుకాలమే.పలువురు నేతలు టీఆర్ఎస్‌లోనే ఉంటూ సొంత నాయకత్వంపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సొంత పార్టీ నాయకత్వంపై మండిపడ్డారు. పార్టీ కోసం పాటుపడుతున్నా తనను కనీసం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు సీనియర్ నాయకులు తనను రాజకీయపరంగా అణగదొక్కేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనకంటే జూనియర్ అని పేర్కొన్నారు. మాజీ ఎంపీ, ఎమ్మెల్యే లను కలుపుకొని పోతేనే పార్టీకి మనుగడ అని చెప్పినప్పటికీ జిల్లా సీనియర్ నాయకులు కేటీఆర్ మాటలను కూడా పట్టించుకునే పరిస్థితిలో లేరన్నారు.

Related Posts