YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రాజుకుంటున్న వేడి

రాజుకుంటున్న వేడి

హైదరాబాద్, జూన్ 30,
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పవర్‌లోకి రావాలనుకుంటున్న బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నది. జాతీయ ఎగ్జిక్యూటివ్ సమావేశానికి హైదరాబాద్‌ను వేదికగా చేసుకున్నది. జూలై 2, 3 తేదీల్లో జరిగే ఈ కార్యక్రమం కోసం అన్ని రాష్ట్రాల నుంచి బీజేపీ శ్రేణులు నగరానికి చేరుకుంటున్నాయి. దండయాత్రను తలపించే తీరులో ర్యాలీలు, బహిరంగసభలు, కాలనీల సందర్శనలు, దానికి తగిన పోలీసు బందోబస్తు.. ఇవన్నీ పొలిటికల్ హీట్‌ను పుట్టిస్తున్నాయి. ఈ ఈవెంట్‌తో ఇక తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పని అయిపోయినట్లేనని బీజేపీ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయి. 'బీజేపీకి అంత సీన్ లేదు' అని గంభీరంగా చెప్తున్న టీఆర్ఎస్ 'బై బై మోడీ..', 'సాలు మోడీ... సంపకు మోడీ..' లాంటి స్లోగన్లతో భారీ సంఖ్యలో ఫ్లెక్సీలను ఏర్పాటుచేసింది. ఈ రెండు పార్టీల మధ్యనే రానున్న ఎన్నికల్లో అసలైన పోటీ అని ప్రజల్లో చర్చ జరిగే వాతావరణం ఏర్పడింది.జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో బీజేపీ స్టేట్ యూనిట్ ప్రత్యేకంగా 'సాలు దొరా..' అనే వెబ్‌సైట్‌ను లాంచ్ చేసింది. దీనికి కొనసాగింపుగా రాష్ట్ర కార్యాలయం దగ్గర 'టీఆర్ఎస్ పాలనకు కౌంట్ డౌన్ షురూ' అనే మెసేజ్‌తో డిజిటల్ క్లాక్ డిస్‌ప్లే నెలకొల్పింది. దీంతో ఉలిక్కిపడిన టీఆర్ఎస్ వెంటనే స్పందించి తక్షణం దాన్ని తొలగించకపోతే రాష్ట్రవ్యాప్తంగా మోడీ ఫ్లెక్సీలను కట్టి చెప్పులదండ వేస్తామంటూ గులాబీ నేతలు ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. జీహెచ్ఎంసీ సైతం వెంటనే రంగంలోకి దిగి అనుమతి లేకుండా ఆఫీసు ముందు భారీ ఫ్లెక్సీ ఏర్పాటుచేశారన్న కారణంతో బీజేపీకి రూ. 50 వేల ఫైన్ వేసింది. వెబ్‌సైట్, డిజిటల్ కౌంట్ డౌన్ క్లాక్ యధావిధిగా పనిచేస్తుండడంతో టీఆర్ఎస్ కూడా కౌంటర్ చర్యలకు శ్రీకారం చుట్టింది.కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో జరిగే భారీ బహిరంగసభ సమీపంలో టీఆర్ఎస్ కూడా 'సాలు మోడీ... సంపకు మోడీ..' అంటూ ఓ ఫ్లెక్సీని ఏర్పాటుచేసింది. సోషల్ మీడియా వేదికగా 'బై బై మోడీ..' అంటూ షేర్ కార్డులను విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్ళింది. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెడుతూ దీనికి మోడీ ప్రభుత్వమే కారణమని బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ట్రైబల్ వర్శిటీ, ఐటీఐఆర్.. వీటన్నింటినీ ప్రస్తావించింది. గత నెల చివరి వారంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మోడీ బేగంపేట ఎయిర్ పోర్టులో పార్టీ కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కేసీఆర్ సర్కారును అవినీతిమయమైందని, కుటుంబ పాలన సాగిస్తున్నదని విమర్శించారు.నిజానికి హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక వరకూ బీజేపీని టీఆర్ఎస్ పెద్దగా లెక్కలోకే తీసుకోలేదు. అక్కడ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలవడంతో ప్రతిష్ఠగా తీసుకున్నది. బీజేపీకి తెలంగాణలో స్థానమే లేదు అనే ధీమాతో ఉన్నప్పటికీ హుజూరాబాద్ ఫలితం తర్వాత నుంచి అలెర్టయింది. రాష్ట్రంలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితర సిట్టింగ్‌లంతా ఓడిపోయారు. కేవలం రాజాసింగ్ మాత్రమే గెలిచారు. కానీ ఆరు నెలలు కూడా తిరగకముందే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు పెరగడంతో పాటు నలుగురు ఎంపీలు గెలిచారు. ఆ తర్వాత దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలిచింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ 47 డివిజిన్లలో గెలిచింది. బీజేపీ చాపకింద నీరులా విస్తరిస్తున్నదని భావించిన టీఆర్ఎస్ అప్రమత్తమైంది.బీజేపీకి అంత సీన్ లేదు..' అని టీఆర్ఎస్ నేతలు చెప్పేదే నిజమైతే 'బై బై మోడీ' అంటూ సోషల్ మీడియాలో గొంతెత్తి అరవడం ఎందుకని కమలనాధులు ప్రశ్నిస్తున్నారు. హుజూరాబాద్ ఫలితం తర్వాత నుంచే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. అది చివరకు వడ్ల కొనుగోళ్ళ విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచడం, సాగు చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు దగ్గర ధర్నా చేపట్టడం, ఢిల్లీ నిరసన దీక్షలో స్వయంగా కేసీఆర్ పాల్గొనడం, కేంద్ర బడ్జెట్‌ను తీవ్రంగా విమర్శించి జాతీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలను ఉధృతం చేయడం... ఇవన్నీ బీజేపీని చూసి టీఆర్ఎస్ ఉలిక్కిపడుతున్నదనే అభిప్రాయాలకు తావిచ్చింది. బీజేపీ ఎదుగుదల ఎసరు తెస్తుందేమోననే ఆందోళన క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ లీడర్లను కలవరానికి గురిచేస్తున్నది. కొన్ని వారాలుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, సంక్షేమ పథకాల చెక్కుల పంపిణీ, ప్రజలను కలవడం.. తీవ్రం చేశారు. పార్టీ నేతలకు కూడా ఊహకందని తీరులో ప్రశాంత్ కిషోర్‌ను వ్యూహకర్తగా పెట్టుకోవాల్సి వచ్చింది. సర్వేల కోసం ఐ-ప్యాక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది. మరోవైపు గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసుకోవాలన్న టార్గెట్‌తో బీజేపీ కూడా బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు, బాధ్యతల అప్పగింత లాంటి కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ రెండు విడతలుగా పలు జిల్లాల్లో పాదయాత్రలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల వరకూ విడతలవారీగా పాదయాత్రలను కొనసాగించాలనుకుంటున్నారు. టీఆర్ఎస్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా ప్రధాని, అమిత్ షా సైతం వ్యూహాత్మకంగానే స్టేట్ యూనిట్‌కు టాస్క్ అప్పగించారు.రాష్ట్రంలో ఎన్నికలు జరగడానికి ఇంకా ఏడాదిన్నరకు పైగా గడువు ఉన్నప్పటికీ పొలిటికల్ వాతావరణం మాత్రం టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ తరహాలో సాగుతున్నది. పదేళ్ళపాటు అధికారానికి దూరమైన కాంగ్రెస్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నది. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌ను నియమించడంతో పాటు వరంగల్ డిక్లరేషన్ పేరుతో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు చేసింది. ప్రజల్లోని అసంతృప్తిని దృష్టిలో పెట్టుకుని నిరుద్యోగ జంగ్ సైరన్, రైతు దీక్ష లాంటి అంశాలవారీ ఆందోళనలు నిర్వహించింది. తాజాగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం, స్ట్రీట్ ఫైట్ మొదలుకావడంతో కాంగ్రెస్ ప్రజల మధ్య చర్చలో కూడా లేకుండా పోయింది. కాంగ్రెస్‌ను వీలైనంతగా నిర్వీర్యం చేయాలన్నది బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల ఉమ్మడి లక్ష్యం ఈ రూపంలో వ్యక్తమవుతున్నది.రెండు రోజుల్లో ప్రారంభం కానున్న బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశాల్లో చర్చలు, పెరేడ్ గ్రౌండ్స్‌ బహిరంగసభలో ప్రధాని మోడీ, అమిత్ షా లాంటి నేతలు చేసే కామెంట్లు, వాటికి కౌంటర్‌గా టీఆర్ఎస్ నేతల ఘాటు వ్యాఖ్యలు ఈ పొలిటికల్ వాతావరణాన్ని మరింత వేడెక్కించనున్నాయి.

Related Posts