
ఎన్నో అనూహ్య మలుపులు తిరిగిన కర్ణాటక రాజకీయాల్లో.. క్లైమాక్స్ అంతా ఊహించిందే జరిగింది. డిస్టింక్షన్‌లో పాసైన యడ్యూరప్ప సీఎం సీటు నిలబెట్టుకోలేకపోగా.. జస్ట్ పాస్ మార్కులతో గట్టెక్కిన కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఫలితాలు వెలువడిన నాటి నుంచి సీఎం పదవికి యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసేంత వరకూ జరిగిన పరిణామాలన్నింటిలో అత్యంత కీలమైన నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్! ఫలితాలు వెలువడిన తర్వాత.. తమకు స్పష్టమైన మెజారిటీ దక్కలేదని తెలిసిన తర్వాత.. జేడీఎస్‌కు మద్దతు ఉంటుందని, అంతేగాక కుమారస్వామి తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించి అందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తి.. బీజేపీకి గట్టి దెబ్బ కొట్టింది. 2014 ఎన్నికల నుంచి వరుస పరాజయాలు కాంగ్రెస్ పార్టీని కుంగదీస్తున్నాయి. యువనేత రాహుల్ సారథ్యంలో అపర చాణక్యులైన ప్రధాని మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాని ఢీకొని జవసత్వాలు నింపుకొనేందుకు మళ్లీ ప్రయత్నాలు కొనసాస్తూనే ఉంది. ఎన్ని చేసిన అదృష్టం కలసి రావట్లేదు. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల నుంచి కాంగ్రెస్ నిర్ణయాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఆ ఎన్నికల్లో మోడీని ఓడించేంత పని చేసింది కాంగ్రెస్.బీజేపీ విజయం సాధించినా నైతిక విజయం మాత్రం కాంగ్రెస్‌దేనని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.ప్రస్తుతం కర్ణాటకలో జరిగిన రాజకీయ పరిణామాల్లోనూ ఇటువంటి వ్యూహాన్నే కాంగ్రెస్ అమలు చేసింది. 104 సీట్లు వచ్చినా బీజేపీకి అధికారం దక్కకుండా చేయడంలో సక్సెస్ అయింది. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ఆ పార్టీకి పూర్వ వైభవాన్ని తెచ్చే భాగంలో తొలి అడుగు అని అంతా విశ్లేషిస్తున్నారు. కర్ణాటకలో ఇపుడున్న పరిస్థితుల్లో జేడీఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ మంత్రి పదవులు ఆఫర్ చేస్తుంది తప్ప ఏకంగా సీఎం పీఠం ఆఫర్ చేసే స్థితి ఉండదు. అందుకే ముందుగానే తమ మద్దతుతో పాటు సీఎం పదవి ఇస్తామంటే.. కుమారస్వామి కచ్చితంగా కాంగ్రెస్‌తోనే కలిసి నడుస్తాడు. ఇదే అత్యంత కీలకమైన నిర్ణయం.ఇక కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ.. ప్రచారం చేసిన ఒక్క రాష్ట్రంలోనూ పార్టీ అధికారంలోకి రాలేదు. ఒకపక్క మోడీ ఇమేజ్ డౌన్ అవుతుంటే.. రాహుల్ ఇమేజ్ అంతకంటే దిగజారిపోతోంది. కాంగ్రెస్‌కు మిగిలి ఉన్న ఒకే ఒక్క పెద్ద రాష్ట్రం కర్ణాటక. ఇక్కడ కూడా రాహుల్ మ్యాజిక్ పనిచేయకపోతే మరింత అవమానాల పాలు కావాల్సి ఉంటుంది. అందుకే సీఎం సీటా- రాహుల్ పరువా అని చూసినపుడు రెండో ఆప్షన్నే ఎంచుకుంది. మణిపూర్, గోవా, మేఘాలయలో ఇంత వేగంగా స్పందించకపోవడం వల్ల అవకాశం ఉండి అధికారం చేజార్చుకున్న గుణపాఠాలు కాంగ్రెస్‌ను వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే కర్ణాటకలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంది.ఇక దక్షిణాదిలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న పెద్ద రాష్ట్రం కర్ణాటక. బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతున్న ఈ పరిస్థితుల్లో నాలుగు దక్షిణాది రాష్ట్రాల సరిహద్దు కలిగిన కర్ణాటక చేజారితే వచ్చే ఎన్నికల్లో ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో మనీ మేనేజ్‌మెంట్ ఆ పార్టీకి తలకు మించిన భారం అవుతుంది. దేశంలో టాప్ 4 నగరాల్లో ఒకటైన బెంగుళూరును వదులుకోవడం ఇంకా పెద్ద నష్టం. అందుకే సీఎం కుమారస్వామి అయినా చెల్లుబాటు అయ్యేది కాంగ్రెస్ మాటే. కాబట్టి కచ్చితంగా ఈ రాష్ట్రం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాదిలో కాంగ్రెస్ తన ప్రభావం చూపడానికి ఇది చాలా కీలకం.ఇక కాంగ్రెస్ ఎన్నేళ్ల పాటు ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే అసంతృప్తి రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఆ పార్టీలో ఎప్పుడు ఏ అలజడి చెలరేగుతుందో గ్రహించడం కష్టం! వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకు మాత్రం కుమారస్వామికి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ప్రమాదం ఏమీ లేదంటున్నారు విశ్లేషకులు. మోడీ మీద జనానికి అసంతృప్తి పెరిగి వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే.. కూటమితో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.ఒకవేళ అదే కనుక జరిగితే కర్ణాటకలో కుమారస్వామి సీటు కిందకు నీళ్లొస్తాయి. అటు జేడీఎస్, బీజేపీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుందనడంలో సందేహం లేదు. లేదా ప్రభుత్వాన్ని కూల్చి మళ్లీ ఎన్నికలు తెచ్చే ప్రయత్నమూ చేస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రాకపోయినా కచ్చితంగా ఐదేళ్లు మద్దతిచ్చే అవకాశం కూడా లేకపోవచ్చు.