
కాకినాడ, జూలై 25,
రాజకీయ పార్టీల నేతలు తమ నియోజకవర్గాలను పదిలం చేసుకోవాలని ప్రయత్నిస్తారు. అయితే అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. పులివెందులలోవైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం, కుప్పంలో చంద్రబాబు, హిందూపురంలో నందమూరి కుటుంబం.. ఇలా నేతల ప్రత్యేక నియోజకవర్గాలు అంటూ ఉంటాయి. అయితే ఇప్పుడు సొంత నియోజకవర్గాల్లో పాతుకు పోవాలని చూస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్. కుప్పం, పులివెందుల మాదిరిగానే తమ నియోజకవర్గాలను కంచు కోటలుగా మార్చుకోవాలని చూస్తున్నారు. పెద్ద కోటను ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఆ నియోజకవర్గాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు ఆ ఇద్దరు నేతలు. ఒకవైపు రాష్ట్ర మంత్రులుగా ఉంటూనే తమ నియోజకవర్గాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి ప్రజల మనసు గెలవాలని చూస్తున్నారు.పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేశారు. గాజువాక తో పాటు భీమవరంలో పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే దారుణ పరాజయం చవిచూశారు. ఇది రాజకీయ ప్రత్యర్థులకు వరంగా మారింది. ప్రచార అస్త్రంగా మార్చుకున్నారు. అయితే అక్కడే గుణపాఠాలు నేర్చుకున్నారు పవన్ కళ్యాణ్. గెలుపు కోసం పరితపించారు. అందుకే ఎన్నికలకు ముందు వ్యూహాత్మకంగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. గాజువాక, తిరుపతి వంటి నియోజకవర్గాలు చర్చకు వచ్చాయి కానీ.. పిఠాపురం అయితే సేఫ్ జోన్ లో నిలవాలని భావించారు. అక్కడే గెలిచారు. ఇప్పుడు ఆ నియోజకవర్గాన్ని తనకు కంచుకోటగా మార్చుకోవాలని చూస్తున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలను అభివృద్ధి చేసి చూపిస్తున్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడుతున్నారు. అదే సమయంలో పిఠాపురం లో సొంత ఇంటిని నిర్మించుకున్నారు. మరోవైపు తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులు సైతం అక్కడ ఉండే విధంగా చర్యలు చేపడుతున్నారు. మొత్తానికి అయితే పిఠాపురం నియోజకవర్గాన్ని కంచుకోటల జాబితాలో చేర్చాలని గట్టి ప్రయత్నం లో ఉన్నారు పవన్ కళ్యాణ్.ఇంకోవైపు లోకేష్(సైతం మంగళగిరి నియోజకవర్గం పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దాదాపు 50 వేల ఇల్లు కట్టించేందుకు ప్రణాళిక రూపొందించారు. పెద్ద ఎత్తున పరిశ్రమలను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నియోజకవర్గంలో చేనేత కార్మికులు అధికం. అందుకే చేనేత హబ్ గా మార్చాలని ప్రణాళికల రూపొందించారు. అందుకు సంబంధించి ప్రోత్సాహకంగా చేనేత శాలను ఏర్పాటు చేశారు. ఐటీ, నాన్ ఐటి పరిశ్రమలను ఏర్పాటు చేసి స్థానికంగానే 50 వేల మంది పనిచేసే విధంగా వాటిని తీర్చిదిద్దనున్నారు. ఇంకోవైపు ప్రభుత్వ భూముల్లో ఇళ్లను నిర్మించుకున్న వేలాదిమందికి.. ఇళ్ల పట్టాలు అందించేందుకు కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి 2019 ఎన్నికల్లో మంత్రిగా ఉంటూ మంగళగిరిలో బరిలో దిగారు లోకేష్. అయితే ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఆపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ అభ్యర్థి గెలుస్తూ వస్తున్నారు. అటువంటి నియోజకవర్గాన్ని ఎంచుకొని సాహసం చేశారు. కానీ లోకేష్ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో 2024 ఎన్నికల్లో మరో నియోజకవర్గానికి మారాలని సీనియర్లు సూచించారు. కానీ మంగళగిరి నియోజకవర్గాన్ని గెలిచి టిడిపికి గిఫ్టుగా ఇస్తానని చెప్పుకొచ్చారు లోకేష్. అన్నట్టుగానే 90 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు ఆ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చుకోవాలని చూస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో కూటమిగా ముందుకు వెళ్లడం ఖాయం. అందుకే మూడు పార్టీలు తమకు పట్టున్న 100 నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాయి. ఆ నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్థితుల్లో పట్టు తప్పకూడదని భావిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అభివృద్ధిపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా కుప్పం, మంగళగిరి, హిందూపురం, పిఠాపురం వంటి నియోజకవర్గాల్లో ప్రత్యర్ధులు పోటీ చేయడానికి కూడా భయపడే విధంగా అభివృద్ధి చేసి చూపించాలని భావిస్తోంది. చూడాలి మరి ఎన్నికల ఫలితాల్లో ప్రభావం ఎలా ఉంటుందో..