YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రమాణ స్వీకారం నుంచే తొలి అడుగులు

ప్రమాణ స్వీకారం నుంచే తొలి అడుగులు

దేశంలో రాజ‌కీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. ప్రధానంగా బీజేపీ వ్యతిరేక‌, ప్రధాని న‌రేంద్ర మోడీ వ్యతిరేక కూటములు రెడీ అవుతున్నాయి. ప్రధానంగా క‌ర్ణాట‌కలో జేడీఎస్‌-కాంగ్రెస్ కూట‌మి ప్రభుత్వం కొలువుదీరుతున్న స‌మ‌యంలో మోడీ వ్యతిరేక పార్టీలు కూడా ఒకే వేదిక‌పై చేర‌నున్నాయి. ఏపీ నుంచి టీడీపీ, తెలంగాణ నుంచి టీఆర్ ఎస్‌, ప‌శ్చిమ బెంగాల్ నుంచి తృణ‌మూల్ కాంగ్రెస్‌, యూపీ నుంచి బీఎస్పీ ఎస్పీ, కుదిరితే ఒడిసా అధికార పార్టీ బీజేడీ కూడా ఈ నెల 23న క‌ర్ణాట‌క‌లో కొలువు దీర‌నున్న జేడీఎస్‌-కాంగ్రెస్ కూట‌మి ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి హాజ‌రై.. వారికి మ‌ద్దతు తెల‌పనున్నారు.ఈ నెల 23న బెంగ‌ళూరులో క‌ల‌వ‌నున్నారు. అక్కడ పైకి చెప్పుకొంటున్నట్టు.. జేడీఎస్‌-కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు వెళ్తున్నా.. అస‌లు తెర‌వెనుక రాజ‌కీయం అంతా బీజేపీకి వ్యతిరేకంగా వ్యూహాల‌ను సిద్ధం చేయ‌డ‌మే. నిజానికి మమత, మాయావతి లాంటి ఫైర్ బ్రాండ్ల‌ను పరోక్షంగా బీజేపీ-వ్యతిరేక, కాంగ్రెస్‌-సారథ్య ఫ్రంట్‌లోకి లాగాలన్నది కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యూహం. ఇక‌, ఈ క్రమంలోనే వారిని బెంగ‌ళూరు వేదిక‌గా ముగ్గులోకి దింపితే.. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇప్పటి నుంచి వ్యూహాన్ని అమలు చేసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని రాహుల్ భావిస్తున్నట్టు స‌మాచారం.ప్రస్తుతం క‌ర్ణాట‌క‌లో రాహ‌ల్ స‌హా గాంధీ కుటుంబం అనుస‌రించిన వ్యూహం నెగ్గడంతో ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీని బ‌ద్నాం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇక కొద్ది రోజుల క్రితం జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో యూపీలో ఎస్పీ + బీఎస్పీ ఫార్ములా ప‌ని చేయ‌డంతో ఇప్పుడు ఆ కూట‌మితో కాంగ్రెస్ కూడా క‌లిసేందుకు రెడీ అవుతోంది. ఇక ఎస్పీ, బీఎస్పీ కూట‌మిలో ఇప్పటికే ఆర్ఎల్డీ చేరింది. వీళ్లకు కాంగ్రెస్ కూడా తోడు అయితే యూపీలో బీజేపీకి క‌ష్టమ‌వుతుంది.ఎన్నిక‌ల్లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చేందుకు యూపీలో వ‌చ్చిన మెజార్టీయే కార‌ణం. అక్కడ బీజేపీ ఏకంగా 72 ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు యూపీలోనే కాకుండా కాంగ్రెస్ డీఎంకే, తృణ‌మూల్‌, ఎన్సీపీ, జేడీఎస్ లాంటి వాళ్లతో క‌లిసి బీజేపీని గ‌ద్దె దించేందుకు త‌న పోరాటాన్ని బెంగ‌ళూరు నుంచే స్టార్ట్ చేసే ప్రయ‌త్నాలు ప్రారంభించ‌నుంది. మ‌రో ప‌ది మాసాల్లోనే ప‌ట్టాలెక్కనున్న దేశ సార్వత్రిక ఎన్నిక‌ల అంశంపై ఈ నాయ‌కులు చ‌ర్చించే అవ‌కాశం క‌నిపిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఆధ్వర్యంలో ఇప్పటికే ఫెడ‌ర‌ల్ ఫ్రెంట్‌కు నాందీ ప్రస్తావ‌న జ‌రుగుతున్న నేప‌థ్యంలో.. ఈ సీఎంలు, మాజీ సీఎంల భేటీ .. ప్రాధాన్యం సంత‌రించుకుంది. అంతేకాదు…కాంగ్రెస్‌ నాయకత్వం వహించదల్చుకున్న జాతీయ కూటమికి కర్ణాటక నుంచే నాందీ ప్రస్తావన జరిగే అవకాశాలున్నాయి. బీజేపీ ని వ్యతిరేకించే పార్టీల ముఖ్యులందరూ ఒకే చోట చేరి.. భ‌విష్యత్ వ్యూహాన్ని ఖ‌రారు చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. వాస్తవానికి ఇప్పుడు జేడీఎస్‌-కాంగ్రెస్ కూట‌మి ప్రభుత్వ ఏర్పాటు విష‌యంలో.. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌త‌ల పాత్ర చాలానే ఉంది.

Related Posts