YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బళ్లారిలో బీజేపీని ఓడించింది వైసీపీనా..?

బళ్లారిలో బీజేపీని ఓడించింది వైసీపీనా..?

కర్ణాటక ఎన్నికల్లో కర్నూలు, బళ్లారి నేతలు అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి. బళ్లారి జిల్లాలో బీజేపీ గెలుపునకు గాలి జానార్దన్‌రెడ్డి చక్రంతిప్పిన సంగతి తెలిసిందే! అయితే ఆయన బలపరిచిన అభ్యర్ధులకు వ్యతిరేకంగా కర్నూలు జిల్లా ఆలూరు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ ప్రచారం నిర్వహించారు. జయరామ్ బంధువులు కాంగ్రెస్‌పార్టీ తరపున అక్కడ బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో గాలి జానార్దన్‌రెడ్డి అభ్యర్ధులను ఓడించేందుకు జయరామ్ వేసిన స్కెచ్‌లు వారిని ఉక్కిరిబిక్కిరి చేశాయట. ఈ తరుణంలో గాలి నేరుగా రంగంలోకి దిగడంతో ఇద్దరి మధ్య ఎన్నికల ప్రచారం పోటాపోటీగా సాగిందట.

వాస్తవానికి గాలి జనార్దన్‌రెడ్డి, గుమ్మనూరు జయరామ్ చాలా కాలంగా సన్నిహితులు. 2014 ఎన్నికల్లో జయరామ్‌కు ఆలూరు వైసీపీ టిక్కెట్ రావడంలో గాలి జానార్దన్‌రెడ్డి కీలకపాత్ర పోషించారు. ఒక్క మాటలో చెప్పాలంటే జయరామ్ రాజకీయ ఎదుగుదల వెనుక గాలి జనార్దన్‌రెడ్డి పాత్ర అత్యంత ప్రధానమైనది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్‌కి టీడీపీలోకి వెళ్లడానికి ఆఫర్ వచ్చిందట. విషయం తెలియగానే గాలి జనార్దన్‌రెడ్డి ఎంట్రీ ఇచ్చారట. దీంతో ఎమ్మెల్యే జయరామ్ టీడీపీలోకి వెళ్లే ప్రయత్నానికి బ్రేక్ పడిందట. ఇదీ వారి మధ్య ఉన్న రాజకీయ అనుబంధానికి ఒక నిదర్శనం!

ఇదిలా ఉంటే, ప్రస్తుత కర్ణాటక ఎన్నికలు గాలి జనార్దన్‌రెడ్డి, జయరామ్‌ మధ్య చిచ్చుపెట్టాయట. దీనికి బలమైన కారణమే ఉందట. ఎమ్మెల్యే జయరామ్ తమ్ముడైన నాగేంద్ర బళ్లారి రూరల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేశారు. శ్రీరాములు మామ అయిన పక్కిరప్పపై మూడు వేల ఓట్ల మెజారిటీతో నాగేంద్ర గెలుపొందారు. మరోవైపు ఎమ్మెల్యే జయరామ్ అల్లుడైన మురళీకృష్ణ సిరిగుప్ప అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేశారు. అక్కడ బీజేపీ అభ్యర్ధి సోమలింగప్ప చేతిలో ఆయన ఓటమి చవిచూశాడు. అయితే, ఎన్నికల ప్రచార సమయంలో.. సిరుగుప్ప కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌ బాధ్యతల్ని చేపట్టిన ఎమ్మెల్యే జయరామ్ బళ్లారి రూరల్, సిరుగుప్ప అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్ధులకు వ్యతిరేకంగా గట్టి ప్రచారాన్నే నిర్వహించారు. దీంతో గాలి జనార్దన్‌రెడ్డి బలపరిచిన బీజేపీ అభ్యర్థులు ఎమ్మెల్యే జయరామ్‌పై మండిపడ్డారట.

ఎమ్మెల్యే జయరామ్ దూకుడు గాలి జనార్దన్‌రెడ్డికి ఏమాత్రం మింగుడుపడలేదట. బళ్లారి జిల్లాలో బీజేపీ కార్యకర్తలతో రహస్య సమావేశం ఏర్పాటుచేసి జయరామ్‌పై గాలి ఫైర్ అయ్యారట. "జయరామ్‌కు రాజకీయబిక్ష పెడితే చివరకి నేను బలపరిచిన అభ్యర్ధులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు. 2019 ఎన్నికల్లో ఆలూరు వైసీపీ టిక్కెట్ ఎలా తెచ్చుకుంటాడో చూద్దాం'' అంటూ గాలి తన అనుచరుల ఎదుట వ్యాఖ్యానించినట్టు సమాచారం. ముఖ్యంగా బళ్లారి రూరల్ స్థానంలో గాలి జనార్దన్‌రెడ్డి మామ పక్కిరప్ప ఓటమిని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. మరోవైపు బళ్లారి అర్బన్‌లో కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధి అనిల్‌లాడ్ తరపున ప్రచారంచేశారు. అయితే అనిల్‌లాడ్‌పై గాలి జనార్దన్‌రెడ్డి సోదరుడు గాలి సోమశేఖర్‌రెడ్డి గెలిచాడు. దీంతో కోట్ల మార్క్ బళ్లారిలో ఏమాత్రం పనిచేయలేదన్న భావం వారిలో ఏర్పడింది.

తాజా పరిణామాల్లో మరికొన్ని వార్తలు కూడా హల్‌చల్‌ చేస్తున్నాయి. తనకు అడుగడుగునా చుక్కలు చూపించిన ఎమ్మెల్యే గుమ్మనూర్ జయరామ్, అతని తమ్ముడైన నాగేంద్రను బీజేపీ వైపునకు తిప్పేందుకు గాలి జనార్దన్‌రెడ్డి పావులు కదుపుతున్నట్లు వినికిడి. మొత్తానికి కర్నాటకలో చోటుచేసుకున్న పరిణామాలు గాలి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యే జయరామ్ మధ్య స్నేహబంధాన్ని ఏ మేరకు ప్రభావితం చేస్తాయో చూడాలి మరి!

Related Posts