YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మంచి ముహూర్తం కోసం ఎదురు చూపులేనా

మంచి ముహూర్తం కోసం ఎదురు చూపులేనా

హైదరాబాద్, జూలై 28,
బీజేపీలో సెంటిమెంట్‌లు.. ముహూర్తాలపై గురి ఎక్కువే. చేరికల విషయంలోనూ అదే లెక్కలు వేస్తున్నారట. వచ్చేది శ్రావణ మాసం కావడంతో జాయినింగ్స్‌కు గేట్లు తెరవొచ్చనే అంచనాల్లో ఉన్నారట నేతలు. మరి.. సీక్రెట్ ఆపరేషన్‌ ఫలిస్తుందా? లేక ఎప్పటిలాగే మరో మూహూర్తం కాలగర్భంలో కలిసిపోతుందా?అవునన్నా కాదన్నా కాషాయ పార్టీలో అనుకున్నంత స్థాయిలో చేరికలు లేవన్నది బీజేపీలోనే వినిపించే మాట. పెద్దఎత్తున కాషాయ తీర్థం పుచ్చుకొనేందకు ఇతర పార్టీల నాయకులు సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవడమే తప్ప.. ఆచరణలో అంగుళం కూడా కదలడం లేదు. చాలా కాలం తర్వాత బీజేపీలో చేరింది మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరెడ్డి మాత్రమే. కమలనాథులు అనేక రహస్య చర్చలు నిర్వహిస్తే కానీ.. ప్రధాని మోడీ సభలో ఆయన బీజేపీ కండువా కప్పుకోలేదు. తాజాగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేరు చర్చల్లో నలుగుతున్నా.. ఇంకా స్పష్టత రాలేదు. ఇవి తప్ప తెలంగాణ బీజేపీలో చేరేది ఎవరో.. ఎంతమందో కాషాయ శిబిరంలోనే క్లారిటీ లేదు.తెలంగాణపై ఢిల్లీ బీజేపీ నాయకత్వం కూడా ఫోకస్‌ పెట్టింది. చేరికల వేగం పెంచాలని ఎప్పటి నుంచో చెబుతోంది కూడా. ఆ మధ్య ఇంద్రసేనారెడ్డితో ఒక కమిటీ వేశారు. జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత మరో చేరికల కమిటీ వచ్చింది. దానికి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కన్వీనర్‌. కొత్త కమిటీలో చాలా మంది ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వాళ్లే ఉన్నారు. పైగా ఈ కమిటీ కూర్పు మొత్తం కేంద్ర నాయకత్వం పర్యవేక్షణలో జరిగింది. ఇప్పటి వరకు జరిగింది చాలు.. ఇకపై చేరికల విషయంలో బీజేపీ నేతలు ఇగోలను పక్కన పెట్టాలని స్పష్టంగా చెప్పేశారు హస్తిన పెద్దలు. అయినప్పటికీ ఈ విషయంలో పురోగతి లేకపోవడం పార్టీ వర్గాలను విస్మయ పరుస్తోంది.కొత్త చేరికల కమిటీ వచ్చాక తెలంగాణ బీజేపీలో తలుపులు తెరిచే ఉంచాల్సి వస్తుందేమోనని అనుకున్నారు. కానీ.. తలుపు తడుతున్న నాయకులు ఒక్కరూ లేరు. ఈటల కమిటీ ఎవరితో మాట్లాడింది.. ఎవరెవరితో మాట్లాడటానికి ప్రయత్నిస్తుందో బయటకు తెలియడం లేదు. అంతా సీక్రెట్‌ ఆపరేషన్‌ అనేది బీజేపీ నేతలు చెప్పేమాట. ఈ కమిటీకి పార్టీ కేంద్ర నాయకత్వం ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఆషాఢ మాసం.. అందుకే ఎవరూ చేరడం లేదనే ప్రచారం మొదలు పెట్టారు. వచ్చేది శ్రావణ మాసం కావడంతో చేరికలు భారీగా ఉంటాయని సమాధానం పర్చుకుంటున్నారట. గతంలో కూడా ఆ ఎన్నికలు అయ్యాక జాయినింగ్స్‌ ఉంటాయి.. ఈ ఎన్నికలు అయ్యాక చేరికలు ఊపందుకుంటాయి అని చర్చ సాగింది. తాజా శ్రావణ మాసం ముహూర్తం కూడా అదేనా అనే అనుమానాలు పార్టీ వర్గాల్లోనే ఉన్నాయట.బీజేపీలో చేరేవారు ఎవరో.. ఏమో.. ఇదే సమయంలో పార్టీకి దూరం అవుతున్న కార్పొరేటర్లు.. కౌన్సిలర్ల సంఖ్య పెరుగుతోంది. అదే స్థాయిలో ఇతర పార్టీల నుంచి వస్తున్న కార్పొరేటర్లు, కౌన్సిలర్లు లేరు. ఈ మధ్య కాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా పది మంది వరకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బీజేపీకి గుడ్‌బై చెప్పేశారు. టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల్లో చేరిపోయారు. ఈ ప్రతికూల పరిస్థితి నుంచి బయట పడాలంటే పెద్ద నాయకుడినే బీజేపీకి తీసుకురావాలని పార్టీ నేతలు అభిప్రాయ పడుతున్నారట. లేదంటే బార్లా తెరిచిన తలుపుల నుంచి బయటకు వెళ్లేవారే తప్ప లోపలికి వచ్చేవారు ఉండబోరని ఆందోళన చెందుతున్నారట. అందుకే ఇంకెంతకాలం ఎదురు చూడాలని ప్రశ్నిస్తున్నారు.

Related Posts