YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రాజగోపాలరెడ్డి వ్యవహారంలో కాంగ్రెస్ ఆచితూచి అడుగులు

రాజగోపాలరెడ్డి వ్యవహారంలో కాంగ్రెస్ ఆచితూచి అడుగులు

హైదరాబాద్, జూలై 28,
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారేందుకు సిద్ధమైన నేపథ్యంలో ముందుగానే ఆయనపై వేటు వేయాలని భావిస్తున్నారు. దీనిపై పార్టీ సీనియర్లకు అల్రెడీ సమాచారమిచ్చినట్లు సమాచారం. రాజగోపాల్ రెడ్డి సోదరుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కూడా ఈ విషయంపై ఏఐసీసీ నేతలు చర్చించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీని వీడేందుకు ముందే ఆయన్ను సస్పెండ్ చేస్తే ఇతర నేతల్లో భయం ఉంటుందని భావిస్తున్నారు.రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ లో చర్చగా మారిన విషయం తెలిసిందే. గతంలోనూ ఆయన పార్టీని వీడుతారని ప్రచారం జరిగినా.. ఇటీవల పరిణామాలు మాత్రం సీరియస్ గా మారాయి. ఏఐసీసీ అధినేత్రి సోనియాతో పాటుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపైనా ఆయన వ్యతిరేక విమర్శలు చేశారు. పార్టీని వీడేందుకు సిద్ధమని చెప్పారు. కాంగ్రెస్ లో ఉద్యమకారులు లేరంటూ ప్రకటించిన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ ను వీడుతారని స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సైతం రాయబారం చేశారు. కానీ, రాజగోపాల్ రెడ్డి ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయనపై పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఉమ్మడి నల్గొండ నేతలతో రాష్ట్ర కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. రాజగోపాల్ రెడ్డిపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటే పార్టీ నేతలు ఎలా స్పందింస్తారనే అంశాలపై కూపీ లాగుతున్నారు. దీంతో ఏ క్షణమైనా రాజగోపాల్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువరించే అవకాశం ఉందని హస్తం నేతల్లో టాక్. అయితే, ఇప్పటి వరకు ఆయనకు షోకాజ్ నోటీసు ఇస్తారని భావించారు. కానీ, వివాదం ముదిరి పాకానపడటంతో.. షోకాజ్ నోటీస్ లేకుండానే సస్పెన్షన్ వేటు వేయనున్నట్లు చెప్తున్నారు.రాజగోపాల్ రెడ్డి అంశంలో కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా చర్యలకు పావులు కదుపుతోంది. కాంగ్రెస్ లో ఉంటూనే బీజేపీకి మద్దతుగా నిలుస్తున్న రాజగోపాల్ రెడ్డి గతంలోనే పలుమార్లు వ్యతిరేకంగా మాట్లాడారు. కానీ, చిన్న చిన్న వ్యాఖ్యలు, సంఘటనలకే ఇతర నేతలకు నోటీసులిచ్చే ఏఐసీసీ, టీపీసీసీ.. ఆయన విషయంలో మాత్రం ఆలోచన చేస్తూనే ఉంది. గతంలో నల్గొండ రాజకీయాలపై మాట్లాడినందుకు అద్దంకి దయాకర్ కు నోటీసులిచ్చారు. జిల్లా నేతల మధ్య వివాదాల్లో కూడా నోటీసులిచ్చారు. కానీ, రాజగోపాల్ రెడ్డి విషయంలో మాత్రం ఇప్పటి వరకు సైలెంట్ గాఉన్నారు. కానీ, ఇప్పుడు వ్యాఖ్యలు తీవ్రతరం కావడం, ఆయన పార్టీ మారేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఆయనపై వేటు వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన వెంటనే రాజగోపాల్‌రెడ్డిపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి పిటిషన్‌ సమర్పించాలని టీపీసీసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.మరోవైపు ఎంపీ వెంకటరెడ్డి సైతం ఈ విషయంపై ఇంకా సెలైంట్ గా ఉంటున్నారు. గతంలో కూడా ఈ అంశంపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. తాజాగా పరిస్థితి చేయిదాటుతుండటంతో.. మౌనంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అటు ఏఐసీసీ నుంచి కూడా ముందస్తుగానే ఆయనకు సమాచారమిచ్చినట్లు చెప్తున్నారు.మరోవైపు నియోజకవర్గ నేతలతో రాజగోపాల్ రెడ్డి వరుస సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. పార్టీ మారడంతో పాటుగా తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని, దీనిపై అభిప్రాయం ఏమిటంటూ కాంగ్రెస్‌కు చెందిన కీలక నేతలను సైతం అడుగుతున్నారు. అయితే, ఇప్పటి వరకు కాంగ్రెస జెండా ఎత్తుకున్న వారిలో కొంతమంది విభేదిస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం సెగ్మెంట్ పరిధిలోని మర్రిగూడ, నాంపల్లి మండలాలకు చెందిన పలువురు నేతలతో ఆయన సమావేశమయ్యారు. అభివృద్ధి కోసం రాజీనామా చేయడాన్ని కొందరు సమర్థిస్తూ స్వాగతిస్తున్నా.. మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నట్లు చెప్తున్నారు.రాజగోపాల్ రెడ్డి వ్యవహారం సాగుతున్న నేపథ్యంలో టీపీసీసీకి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఉప ఎన్నికపై పార్టీ కొంతమేరకు దృష్టి సారించింది. రాజగోపాల్ పార్టీని వీడితే ఉత్పన్నమయ్యే పరిణామాలను టీపీసీసీ అంచనా వేస్తోంది. ప్రత్యామ్నాయ అభ్యర్థి కోసం చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న సీటు కావడంతో.. దాన్ని ఎలాగైనా దక్కించుకోవాల్సిన పరిస్థితి టీపీసీసీ ముందుంది. రాజగోపాల్‌ని తక్కువ అంచనా వేయలేని పరిస్థితి పార్టీ వర్గాల్లో ఉంది. ఆర్థిక, అంగబలాలలో కోమటిరెడ్డి కుటుంబానిది అత్యంత బలమైన పోజీషన్ కూడా. ఆయన పార్టీ మారితే సొంత బలానికి బీజేపీ బలం కూడా తోడైతే ఉప ఎన్నికలో ఆయన గట్టెక్కుతారన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ సీటు కాంగ్రెస్ దేనని, ఉప ఎన్నిక వచ్చినా తామే తిరిగి గెలుచుకోవాలని టీపీసీసీ భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఎత్తులకు సిద్దమవుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ధీటైన అభ్యర్థిని వెతకడం టీపీసీసీకి సవాల్ గానే మారింది. పార్టీ తరపున పాల్వాయి స్రవంతి, జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి పేర్లను పరిశీలిస్తోంది.

Related Posts