YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేంద్రానికి చేరని పంట నష్టం నివేదికలు అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపం

కేంద్రానికి చేరని పంట నష్టం నివేదికలు అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపం

నిజామాబాద్, జూలై 28,
భారీ వానలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు జరిగిన నష్టాన్ని అంచనా వేసి నివేదికను కేంద్రానికి సమర్పించాల్సిన రాష్ట్ర సర్కారు ఆ దిశగా ఎలాంటి చర్యలను తీసుకోలేదు. చర్యలు తీసుకోకపోగా కేంద్రం నుంచి నష్టం అంచనాకు వచ్చిన బృందానికి నష్టమేమీ జరగలేదని సమాధానం ఇవ్వడం గమనార్హం. పార్లమెంట్ సెషన్స్ లో భాగంగా దేశ వ్యాప్తంగా వానలు, ప్రకృతి విపత్తులకు 0.34 మిలియన్ హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లిందని కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ పార్లమెంట్ ప్రకటించారు. పార్లమెంటులో ఇతర రాష్ట్రాల నష్టాన్ని తెలిపిన కేంద్ర సహాయ మంత్రి తెలంగాణ నష్టం అంచనాను తెలపకపోవడంతో కేంద్రానికి రాష్ట్రంలో జరిగిన నష్టం అంచనా అందలేదన్నది స్పష్టమవుతున్నది. కాగా రాష్ట్రంలో కురిసిన వానలు, వచ్చిన వరదల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 11 నుంచి 15 లక్షల ఎకరాల్లో నష్టం జరుగగా రూ.1,500 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా తేలినప్పటికీ అధికారులు ఎలాంటి నష్టం లేదని కేంద్రానికి నివేదిక ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.జూన్, జులై మాసాల్లో కురిసిన వానలతో దేశవ్యాప్తంగా దాదాపు 0.34 మిలియన్ హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లిందని పార్లమెంట్ లో కేంద్రం ప్రకటించింది. ఇందులో భాగంగా ముఖ్యంగా మే నుంచి వానలు, వరదలతో ఇబ్బంది పడుతున్న అస్సాంలో అత్యధికంగా 0.24 మిలియన్ హెక్టార్ల నష్టం నమోదైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తెలిపారు. పంజాబ్ లో 81,420 హెక్టార్లలో నష్టం వాటిల్లిందని తెలిపిన కేంద్రం ఆంధ్రప్రదేశ్ లో 11,280 హెక్టార్లలో నష్టం వాటిల్లిందని.. ఈ వివరాలను ఆయా రాష్ట్రాలే ఇచ్చాయని తెలిపారు. మిగతా రాష్ట్రాలైన కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాల్లోనూ కొంత నష్టం జరిగిందని పేర్కొన్నారు. దేశంలో నష్టం జరిగిన వివరాలను ఆయా రాష్ట్రాలను కేంద్రానికి అందించినా..తెలంగాణ మాత్రం అందించకపోవడం గమనార్హం. సర్కారు నివేదికను అందించకపోవడంతోనే పార్లమెంటులో తెలంగాణ అంశం చర్చకు రాలేదు.భారీ వానలు, వరదలతో వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం నుంచి ఓ బృందం తెలంగాణకు వచ్చింది. ఈ బృందం భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పర్యటించింది. అయితే ఈ మూడు జిల్లాలతోపాటు ఇతర జిల్లాల్లోనూ నష్టం జరిగిన అత్యధికంగా ఈ జిల్లాల్లో నష్టం వాటిల్లినట్టు గుర్తించి పర్యటించారు. ఇందులో భాగంగా కేంద్రం నుంచి వచ్చిన బృందం భద్రాద్రి కొత్తగూడెంలో పర్యటించగా జిల్లా వ్యాప్తంగా 10,831 ఎకరాల్లో నష్టం జరిగిందని జిల్లా అధికారులు వివరాలు అందించారు. ఆ వివరాల ప్రకారం..సుమారు రూ.584.88 లక్షల నష్టం వాటిల్లిందని, దీంతో పాటు ఉద్యానవన పంటలకు 35 ఎకరాల్లో నష్టం జరగ్గా దీనికి రూ.40.50 లక్షల నష్టం వాటిల్లిందని తెలిపారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తం 14,106 హెక్టార్లలో (ఒక హెక్టారుకు 2.30 ఎకరాలు) నష్టం జరిగిందని జిల్లా అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా పంటలకు సుమారు రూ.2,115.90 లక్షలు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. నష్టం జరిగిన పంటల్లో పత్తి 13,043 హెక్టార్లు, ప్యాడి నర్సరీలు 416 హెక్టార్లు, ఇతర పంటలు 353 హెక్టార్లు, ఇసుక కోతకు గురైనవి 294 హెక్టార్లుగా ఉన్నట్టు నమోదు చేశారు. అనంతరం ములుగు జిల్లాలోని వివరాలను జిల్లా అధికారులు బృందానికి ఇచ్చామని చెబుతున్నప్పటికీ, ఎంత విస్తీర్ణంలో నష్టం జరిగిందన్న వివరాలను మాత్రం తెలపలేదు.రాష్ట్రంలో వరుసగా మూడేళ్ల నుంచి ప్రకృతి విపత్తులు సంభవించి పంటలకు, మూగజీవాలకు నష్టం ఏర్పడుతున్నా సర్కారు మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా అన్నదాతలు తీవ్ర నష్టాలను మూటగట్టుకుంటున్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి బయటకు వచ్చిన రాష్ట్రం ఇంతవరకూ బీమా పాలసీని ప్రకటించలేదు. నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వకపోవడం, ఇన్ పుట్ సబ్సిడీ కూడా ఇవ్వకపోవడంతో రైతులు నష్టాల్లో మునుగుతున్నారు. ఇదే అంశాలపై ఎవరైనా ప్రశ్నిస్తే రైతుబంధు ఇస్తున్నాం కదా..మళ్లీ ప్రత్యేకించి ఇన్ పుట్ సబ్సిడీలు, ఇవన్నీ ఎందుకు అన్నట్టు వ్యవసాయ శాఖ నుంచి సమాధానం వస్తుంది. ఏదైమైనా రైతు ప్రభుత్వంగా చెప్పుకునే సర్కారు అన్నదాతల గురించి పట్టించుకోకపోవడం బాధాకరమని రైతులు, రైతుసంఘాలు ఆరోపిస్తున్నాయి.

Related Posts