YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

54 ప్రాంతీయ పార్టీల్లో జేడీయూ....సూపర్

54 ప్రాంతీయ పార్టీల్లో జేడీయూ....సూపర్

పాట్నా, ఆగస్టు 1,
దేశవ్యాప్తంగా ఉన్న 54 ప్రాంతీయ రాజకీయ పార్టీల్లో నంబర్‌-1గా జనతాదళ్‌(యునైటెడ్‌) పార్టీ నిలిచింది. కరోనా వైరస్‌ విజృంభించిన కాలంలో కూడా అత్యధిక సంఖ్యలో విరాళాలను సొంతం చేసుకుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏలో భాగస్వామ్య పక్షంగా, బీహార్‌లో అధికార పార్టీగా ఉన్న జేడీయూకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పార్టీకి 2020-21 ఆర్థిక సంవత్సరంలో 60.15 కోట్ల రూపాయలు డొనేషన్ల రూపంలో వచ్చాయి. ఈ విషయాన్ని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) తన రిపోర్టులో వెల్లడించింది. జేడీయూ తర్వాతి స్థానంలో తమిళనాడులోని రూలింగ్‌ పార్టీ డీఎంకే, ఢిల్లీలోని అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నిలిచాయి. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ ఆధ్వర్యంలోని డీఎంకే పార్టీకి రూ.33.99 కోట్లు, ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌ సారథ్యంలోని ఆప్‌కి రూ.11.32 కోట్లు విరాళాలుగా వచ్చాయి. ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌(ఐయూఎంఎల్‌)కి నికరంగా రూ.4.16 కోట్ల డొనేషన్లు వచ్చాయి. తెలంగాణలోని రూలింగ్‌ పార్టీ టీఆర్‌ఎస్‌కి రూ.4.15 కోట్లు అందినట్లు ఏడీఆర్‌ పేర్కొంది. మొత్తం విరాళాల్లో సింహభాగాన్ని ఈ ఐదు రీజనల్‌ పార్టీలే సొంతం చేసుకోవటం విశేషం. ఈ ఐదు పార్టీల్లో ఒక్కటి (ఐయూఎంఎల్‌) మినహా మిగతా నాలుగూ అధికారంలోనే ఉండటం గమనార్హం. 95.45 కోట్ల రూపాయలు 207 డొనేషన్ల రూపంలో కార్పొరేట్‌/బిజినెస్‌ సెక్టార్‌ నుంచి అందాయి. మరో రూ.25.57 కోట్లను 2,569 మంది వ్యక్తిగత విరాళాల రూపంలో ఇచ్చారు. జేడీయూకి వచ్చిన 60.15 కోట్ల రూపాయల్లో రూ.59.24 కోట్లు 58 డొనేషన్ల రూపంలో, మిగతా రూ.90 లక్షలు 272 మంది నుంచి వ్యక్తిగత విరాళాలుగా అందాయి. ప్రతిపక్ష, ఇతర పార్టీలతో పోల్చితే అధికార పార్టీలకు ఎక్కువ విరాళాలు వచ్చాయంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.ఎందుకంటే రూలింగ్‌ పార్టీలతో, వాటి ప్రభావం కొద్దోగొప్పో ఉండే ప్రభుత్వ అధికారులతో ఆయా వ్యక్తులకు లేదా కార్పొరేట్‌/బిజినెస్‌ సెక్టార్‌కి చాలా పనులు ఉంటాయి. గవర్నమెంట్‌ కాంట్రాక్టులు, వివిధ ప్రాజెక్టులు, కొత్త వ్యాపారాలకు అనుమతులు.. ఇలా పలు సందర్భాల్లో ఇరు వర్గాల మధ్య కొంత అవగాహన ఉంటుంది. కాబట్టి ఇది అధికార పార్టీలకు కలిసొస్తుంది. దీన్నే గిట్టనివాళ్లు క్విడ్‌-ప్రొ-కొ (నీకిది-నాకది) అని విమర్శిస్తూ ఉంటారు. ఇక జాతీయ పార్టీల విషయానికొస్తే కేంద్రంలో గత ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి అత్యధికంగా డొనేషన్లు రావటం తెలిసిందే.

Related Posts