YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సెప్టెంబర్ 17తో సత్తా చాటేందుకు కిషన్ ప్లాన్

సెప్టెంబర్ 17తో సత్తా చాటేందుకు కిషన్ ప్లాన్

హైదరాబాద్, సెప్టెంబర్ 13, 
కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తొలిసారి నిర్వహిస్తున్న రాష్ట్ర విమోచన దినోత్సవ వేడుకలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్‌గా తీసుకున్నారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఈనెల 17న జరగనున్న ఈ ఉత్సవానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ సెగ్మెంట్‌లో ఇవి జరుగుతున్నందున సక్సెస్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే గ్రౌండ్‌లో గతంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపుగా విజయ సంకల్ప బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయిందని స్వయంగా ప్రధాని కితాబునిచ్చారు. వేదిక మీదనే బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌ను అభినందించారు. ఇప్పుడు విమోచన దినోత్సవ వేడుకలకు చీఫ్ గెస్ట్ గా వస్తున్న అమిత్ షా ప్రశంసించే విధంగా వీటిని నిర్వహించాలని కిషన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర మంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నందున ఆ శాఖ మంత్రిగా కిషన్‌రెడ్డి అన్నీ తానై చూసుకుంటున్నారు. అటు కేంద్ర ప్రభుత్వ వర్గాల, ఇటు పార్టీ శ్రేణుల సమన్వయంతో గ్రాండ్ సక్సెస్ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. రాష్ట్రంలో తొలిసారి విమోచన దినోత్సవాల వేడుకలు జరుగుతున్నందున విజయవంతం చేయడం కిషన్‌రెడ్డికి సవాల్‌గా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే వేడుకల షెడ్యూలును ఆయా కార్యక్రమాలకు అనుగుణంగా వేర్వేరు టీమ్‌లకు బాధ్యతలు అప్పగించారు. ఏ టీమ్ ఏం పనిచేయాలో వర్క్ డివిజన్ చేశారు. సుమారు 30 వేల మందిని ఈ కార్యక్రమానికి తరలించాలని టార్గెట్ పెట్టుకున్నారు.కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అధికారిక కార్యక్రమం కావడంతో ప్రొటోకాల్ నిబంధనలు అనివార్యమయ్యాయి. కేంద్ర సాయుధ దళాల కవాతుతో మొదలయ్యే ఈ కార్యక్రమం కేంద్ర హోం మంత్రి సాయంత్రం బహిరంగ సభలో చేసే ప్రసంగంతో ముగియనున్నది. స్వయంగా కేంద్ర హోం మంత్రి ముఖ్య అతిథిగా హాజరుకానుండడం, వివిధ కేంద్ర బలగాల కవాతు, కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ తరఫున అధికారుల హాజరు తదితరాలతో పెరేడ్ గ్రౌండ్స్ ఈవెంట్‌కు 30 వేల మందిని మాత్రమే పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. విమోచన వేడుకలు తొలిసారి తన స్వంత పార్లమెంటు నియోజకవర్గంలో జరుగుతున్నందున భారీ స్థాయిలో జనాన్ని తరలించాలనుకున్నప్పటికీ ప్రోటోకాల్ నిబంధనలు ఆంక్షలు విధించినట్లయింది. ఈ ఈవెంట్ ద్వారా స్వంత ఇలాకాలో తన బలాన్ని ప్రదర్శించుకోవాలని, హైకమాండ్ దృష్టిలో పడాలనుకున్న కిషన్‌రెడ్డికి పరిమితులు ఏర్పడినట్లయింది.
సంస్కృతి ప్రతిబింబించే విధంగా
విమోచన వేడుకలకు సంబంధించి  17న బతుకమ్మలను ఏర్పాటు చేయనున్నారు. 13వ తేదీన విమోచన దినోత్సవం కోసం పోరాడిన మహనీయుల విగ్రహాలను ఎస్సీ, ఎస్టీ మోర్చాల ఆధ్వర్యంలో శుద్ధి చేసి నివాళులర్పించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. 14న నియోజకవర్గాల్లో యువమోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు తీయనున్నారు. 15న మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆరెంజ్ బ్రిగేడ్ ర్యాలీ చేపట్టనున్నారు. 16న బసంత్ థియేటర్ వద్ద షోయబుల్లా ఖాన్ విగ్రహాన్ని శుద్ధి చేయనున్నారు. ఇక విమోచన దినోత్సవమై 17వ తేదీన ఉదయం 7:30 గంటలకు యువమోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీగా పరేడ్ గ్రౌండ్స్‌కు తరలివెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేశారు.కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఈ వేడుకలను సక్సెస్ చేసేందుకు ఒక్కొక్కరిని కలుస్తూ వస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో తెలంగాణ పోరాట యోధుల కుటుంబాలను కలిశారు. పోచారం సంస్కృతి టౌన్‌ షిప్‌లో నివాసముంటున్న తెలంగాణ కలం యోధుడు షోయబుల్లాఖాన్‌ కుటుంబ సభ్యులతో సైతం ఆయన మాట్లాడారు.రజాకార్లకు వ్యతిరేకంగా ఇమ్రోజ్‌ పత్రికలో వార్తలు ప్రచురించినందుకు కాచిగూడలో షోయబుల్లాఖాన్‌ రెండు చేతులు నరికి, అతి కిరాతకంగా హతమార్చిన విషయం తెలిసిందే. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ సైతం ఈ వేడుకలను సక్సెస్ చేయడంలో సామాన్యులను కూడా భాగస్వాములను చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 17న అన్ని బస్తీల్లో ఉదయం 7 గంటల నుంచే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని, నిజాం పాలనకు వ్యతిరేకంగా రచించిన గేయాలతో రాష్ట్ర ప్రజలను ఉత్తేజితులను చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

Related Posts