YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఇద్దరు ఎమ్మెల్యేలపై ఎన్ఐఏ టార్గెట్ ?

ఇద్దరు ఎమ్మెల్యేలపై ఎన్ఐఏ టార్గెట్ ?

నిజామాబాద్,  సెప్టెంబర్ 19, 
హైదరాబాద్ లో ఓ వైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై ఈడీ సోదాలు జరుపుతున్న క్రమంలో ఎన్ఐఏ  కూడా రంగంలోకి దిగింది. నిజామాబాద్ జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా 30 బృందాలు  సోదాలు నిర్వహించాయి. ఈ బృందాలు జీఎస్టీ అధికారుల సహకారం కూడా తీసుకుంటున్నాయి. రెయిడ్స్ కు సంబంధించిన వార్తలు ఇసుమంతైనా బయటికి పొక్కకుండా ఎన్ఐఏ జాగ్రత్త పడుతున్నది. సోదాలకు గల కారణాలను అటు జీఎస్టీ, ఇటు ఎన్ఐఏ సిబ్బంది అధికారికంగానూ, అనధికారికంగానూ వెల్లడించడంలేదు. ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన ఆర్థిక అంశాలపై ఎన్ఐఏ ఫోకస్ పెట్టినట్లు ప్రాథమిక సమాచారం. ఇందుకోసమే జీఎస్టీ విభాగంలోని సీనియర్ అధికారులను కూడా వెంట తీసుకెళ్లినట్లు తెలిసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించాలని నాలుగైదు రోజుల క్రితమే ఎన్ఐఏ వ్యూహం ఖరారు చేసుకున్నది. హైదరాబాద్ తో పాటు కొన్ని ఎంపికచేసిన జిల్లాల్లో శనివారం, ఆదివారం ఈ దాడులు నిర్వహించేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో శనివారం మధ్యాహ్నం నుంచి సోదాలు ప్రారంభించింది. ఆర్మూరు పట్టణానికి చెందిన ఇద్దరిని ప్రశ్నించి వదిలేసినట్లు తెలిసింది. ఈ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు విదేశాలతో వివిధ రకాల వ్యాపారాలు ఉన్నాయనే అంశానికి సంబంధించి ప్రత్యేకంగా నిఘా పెట్టినట్లు సమాచారం. రాష్ట్రంలో ఆర్థిక లావాదేవీలు భారీ స్థాయిలో జరుగుతుండడంతో చాలాకాలంగా ఐటీ అధికారులు దృష్టి సారించారు.గతంలో రియల్ ఎస్టేట్ సంస్థలపైనా, నిర్మాణ సంస్థలపైనా ఐటీ సోదాలు జరిగాయి. దాదాపు రెండేళ్ళ పాటు ఈ సోదాల్లో లెక్కల్లోకి రాని నగదు భారీ స్థాయిలోనే లభ్యమైంది. గత కొంతకాలంగా ఈడీ సైతం దృష్టి పెట్టింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చిన తర్వాత ఈడీ మరింత దూకుడు పెంచింది. రెండు రోజుల క్రితం ఏకకాలంలో సుమారు పాతిక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. అనుమానం ఉన్న 18 కంపెనీలకు, 12 మంది వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కూడా నోటీసులు ఇచ్చినట్లు వార్తలు వచ్చినా ఆమె మాత్రం ట్విట్టర్ ద్వారా తనకు అలాంటివి అందలేదంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ వేడి ఇలా కంటిన్యూ అవుతుండగానే గోప్యంగా ఎన్ఐఏ బృందాలు నిజామాబాద్ జిల్లాలో సోదాలు జరపడం ఆసక్తికరంగా మారింది.సోదాలు నిర్వహించాలనే నిర్ణయం ఇంతకుముందే జరిగినా యాక్షన్ ప్లాన్ మాత్రం రెండు రోజుల ముందే ఖరారు చేసినట్లు తెలిసింది. హైదరాబాద్‌లోని ఎన్ఐఏ పోలీసు సూపరింటెండెంట్ చీఫ్.. జీఎస్టీ చీఫ్ కమిషనర్ కార్యాలయానికి లేఖ రాసి కొందరు అధికారులను రెండు రోజుల పాటు సమకూర్చాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన జీఎస్టీ కార్యాలయం సుమారు ఇరవై మందిని రెండు రోజుల పాటు పంపడానికి సమ్మతి తెలిపింది. ఇందులో నలుగురు సూపరింటెండెంట్లు, పన్నెండు మందికి పైగా ఇన్‌స్పెక్టర్లు, కొందరు టాక్స్ అసిస్టెంట్లు కూడా ఉన్నారు. ఆర్థికపరమైన అంశాల్లో ఉండే లోతైన అవగాహన దర్యాప్తునకు దోహదపడుతుందనే ఉద్దేశంతో ఎన్ఐఏ ఈ ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిసింది.నిజామాబాద్ జిల్లాలోనే నిర్దిష్టంగా సోదాలు జరపడానికి ఉన్న కారణాలు మాత్రం వెలుగులోకి రాలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో ఎన్ఐఏకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఈ జిల్లాపై ఫోకస్ పెట్టడం మిస్టరీగా మిగిలిపోయింది. టెర్రర్ ఫండింగ్ విషయమా..? లేక విదేశాల నుంచి భారీ స్థాయిలో ఆర్థికపరమైన లావాదేవీలకు నేరాలతో లింకు ఉండడమా..? ఇలాంటి అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ జిల్లాలో జరిగిన సోదాల్లో భాగంగా ఎవరిని ప్రశ్నించారు..? ఏయే విషయాలపై ఆరా తీశారు..? ఎలాంటి ఆధారాలు లభించాయి..? ఈ దాడులకు కొనసాగింపుగా దర్యాప్తు ఎలా ఉండబోతున్నది? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ముందుగా రూపొందించుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ దాడులు ఆదివారం కూడా కొనసాగనున్నాయి.

Related Posts