YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పీకే నివేదిక... కిం కర్తవ్యం...

పీకే నివేదిక... కిం కర్తవ్యం...

విజయవాడ, సెప్టెంబర్ 20, 
పీకే నివేదిక తేల్చేసింది. ఫ్యాన్ తిరగడం ఇక అసాధ్యమని ఖరారు చేసేసింది. వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓటమి ఖాయమని ఖరారు చేసేసింది. 2024 అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ విజయం కల్లేనని, జగన్ సీఎం పదవి నుంచి దిగిపోవడం తథ్యమని ప్రశాంత్ కిషోర్ రైట్ హ్యాండ్ అయిన రిష్ రాజ్ సింగ్ తాజా నివేదిక పేర్కొంది. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలలోనూ విజయమే లక్ష్యం అంటూ క్యాడర్ ను దిశా నిర్దేశం చేస్తున్న జగన్ ఈ నివేదికతో కంగు తిన్నారని పార్టీ క్యాడరే చెబుతోంది. ఇదేం నివేదిక, ఇదేం కథ అంటూ పీకే రైట్ హ్యాండ్ రిషి రాజ్ సింగ్ పైనా ఆయన బృందంపైనా జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని క్యాడర్ అంటోంది. వచ్చే ఎన్నికల్లో మొత్తం 175కి 175 ఎమ్మెల్యే స్థానాలను కొల్లగొట్టాలనే లక్ష్యంతో సీఎం వైయస్ జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీతోపాటు ఏ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవకుండా ఉండేందుకు జగన్ అండ్ కో వ్యూహాలు రచిస్తున్నాయి.   తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో ఓడించాలన్న లక్ష్యంతో ఆ నియోజకవర్గ అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించేసి గెలిస్తే మంత్రి పదవి తాయిలంగా ఇస్తానని కూడా జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే తెలుగుదేశం నాయకులు పోటీ చేస్తారని భావిస్తున్న ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తే ఆయనకు మంత్రి పదవి ఖాయమంటూ జగన్ ఆశపెట్టిన సంగతి విదితమే. రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి, ప్రభుత్వ పనతీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న అంశాలపై ఒక నివేదిక ఇవ్వాల్సిందిగా జగన్ కోరిన మీదట.. ప్రశాంత్ కిషోర్ తరఫున జగన్ పార్టీ వ్యూహకర్తగా పని చేస్తున్న రిష్ రాజ్ సింగ్ తన బృందంతో జరిపిన సర్వేలో వెల్లడైన అంశాలు జగన్ కు దిమ్మతిరిగేలా ఉన్నాయని పార్టీ క్యాడరే చెబుతున్నారు. జగన్ పాలనపై ప్రజాభిప్రాయాన్ని ఉన్నదున్నట్లుగా పొందుపరుస్తూ రిష్ రాజ్ సింగ్ టీమ్ ఇన్చిన నివేదికతో జగన్ షాక్ అయ్యారని అంటున్నారు. ప్రజా సంక్షేమం  పేరిట ఈ మూడున్నరేళ్లలో  కోట్లాది రూపాయిలు  బటన్ నొక్కి పందేరం చేసినా అది బూడిదలో పోసిన పన్నీరు చందమే అయ్యిందని, ఇక మిగిలిన స్వల్ప కాలంలోనైనా అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలని...పార్టీ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందన్నది ఆ నివేదిక సారాంశంగా చెబుతున్నారు.  రాష్ట్రంలో ముఖ్యంగా ఉద్యోగులు, యువతతో పాటు తటస్టులంతా అభివృద్ధిని కాంక్షిస్తున్నారని నివేదికలో రిష్ రాజ్ సింగ్ టీమ్ విస్పష్టంగా పేర్కొందని అంటున్నారు. సంక్షేమ పథకాల పేరిట.. ప్రతి నెలా ఏదో ఒక పథకం పేర.. బటన్ నొక్కుతూ...నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తున్నా ఆ పథకాల లబ్ధి దారులు కూడా రాష్ట్రంలో అభివృద్ధి అడుగంటటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని నివేదిక తేల్చేసిందట. మూడు రాజధానులంటూ జనగ్ చేస్తున్న విన్యాసాల పట్ల కూడా ప్రజలలో అసంతృప్తి గూడుకట్టుకుందనీ, మెజారిటీ ప్రజలు అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారనీ నివేదిక వెల్లడించిందని చెబుతున్నారు. అలాగే  రాష్ట్రంలో రహదారుల దుస్థితికి సంబంధించి ప్రతి రోజు సోషల్ మీడియాలో లక్షలాది పోస్టులు దర్శనమిస్తున్నాయని.. రహదారులు బాగు చేసేందుకు కూడా వైయస్ జగన్ ప్రభుత్వం వద్ద డబ్బులు లేవా? అంటూ నెటిజన్లు చేస్తున్న ట్రోలింగ్ కూడా ప్రజలపై ప్రభావం చూపి జగన్ సర్కార్ పట్ల అసంతృప్తి పెరిగేందుకు దోహదం చేస్తున్నాయని నివేదిక వెల్లడించిందని చెబుతున్నారు. మరో వైపు పెట్టుబడులు లేక పారిశ్రామిక రంగం కుదేలై పోయిందని.. రాష్ట్రవ్యాప్తంగా యువత రోడ్డున పడిందనీ,   ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్న జగన్ హామీ నెరవేరకపోవడం పట్ల కూడా ప్రజలలో ముఖ్యంగా యువతలో అసమ్మతి గూడుకట్టుకుందని అంటున్నారు.  సీపీఎస్ రద్దు అంశంలో సీఎం జగన్ మాట తప్పారని, మడమ తిప్పారన్న ఆగ్రహం ఉద్యోగులలో వెల్లువెత్తుతోందని నివేదిక పేర్కొంది.  

Related Posts