YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రాజకీయ దుమారం ఎస్పీ భజనలు

రాజకీయ దుమారం ఎస్పీ భజనలు

నల్గొండ, సెప్టెంబర్ 20, 
పోలీస్‌ యూనిఫామ్‌లో ఈ స్థాయిలో వేదికపై మాట్లాడిన ఎస్పీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌. ఈయన ఎవరో కాదు. సూర్యాపేట జిల్లా ఎస్పీ. పేరు రాజేంద్ర ప్రసాద్‌. జిల్లాకు పోలీస్‌ బాస్‌ అయి ఉండి.. ప్రజాప్రతినిధులకు భజన చేయడంలో అన్ని హద్దులను చెరిపేశారనే చర్చ డిపార్ట్‌మెంట్‌లో ఎంత ఎక్కువగా ఉందో.. అంతకంటే ఎక్కువ చర్చ సామాన్య జనాల్లో., రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఇందులో అధికారిక హోదాలో మంత్రి జగదీష్‌రెడ్డి, ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు వచ్చారు. సభలో ఎస్పీ పాల్గొనడంపై అభ్యంతరాలు లేకపోయినా.. అదే సభకు హాజరైన మంత్రి జగదీష్‌రెడ్డిని ఓ రేంజ్‌లో SP కీర్తించడమే రచ్చ అవుతోంది. మంత్రిని బాహుబలితో పోల్చారు జిల్లా ఖాకీ బాస్‌. అక్కడితో ఆగితే బాగోదని అనుకున్నారో ఏమో.. పీఠాలు కదలాలి అని కామెంట్స్‌ పాస్‌ చేయడం.. జగదీష్‌రెడ్డి జయహో అని నినదించడం ఎస్పీకే చెల్లింది. జిల్లాకు పోలీస్‌ బాస్‌ అయ్యి ఉండి ఈ స్థాయిలో భజన చేయడం అవసరమా అని డిపార్ట్‌మెంట్‌ నుంచే ప్రశ్నలు వినిపిస్తున్నాయట. అంతేకాదు.. ఆయన తన పరిధిని దాటి అత్యుత్సాహం ప్రదర్శించారని.. స్వామి భక్తిని చాటుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మైకు అందుకున్నాక తాను ఎస్పీ అనే విషయాన్ని రాజేంద్ర ప్రసాద్‌ మర్చిపోయారేమో అని విపక్ష పార్టీలు విమర్శలకు పదును పెడుతున్నాయి. మైక్‌ అందుకోగానే మైకం ఆవహించిందనేవాళ్లూ ఉన్నారు. ఏర్పాటు చేసిన సభ ఎందుకు.. అక్కడ ఏం మాట్లాడాలి అనే సోయ కూడా లేకపోతే ఎలా అనేది విపక్షాల విమర్శ. ప్రభుత్వ అధికారి అంటే.. రాగద్వేషాలకు అతీతంగా.. రాజకీయాలకు అతీతంగా చట్ట పరిధిలో పనిచేస్తారని జనం విశ్వసిస్తారు. అధికార పార్టీకి లోపాయికారీగా మొగ్గు చూపుతారనే అభిప్రాయం ఉన్నా.. ఇలా బహిరంగంగా ఓపెన్‌ అయిన ఉదంతాలు చాలా అరుదు. కానీ.. ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ ఆ గీతను చెరిపేశారు. ఎవరేం అనుకుంటే తనకేంటి అనేలా.. వంటిపై ఖాకీ ఉందనే స్పృహ లేకుండా.. నోటికి పని చెప్పారని జనం ఆశ్చర్యపోతున్నారు.ఇప్పుడు ఎస్పీగా ఆయన నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారని భావించొచ్చా అనేది విపక్షాలు, జనాల ప్రశ్న. ఒక ఎస్పీ తీరే అనుమానాలకు తావిస్తే పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఇతర సిబ్బందిపైనా ఆ ప్రభావం పడుతుందని కొందరు ఖాకీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఈ ఎపిసోడ్‌పై పోలీస్‌ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఆ వేదికపై ఎస్పీ ఎందుకు అలా మాట్లాడారు? ఆయన ఏం ఆశించారు? అని నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయట. మరి ఎస్పీ చిడతల భజన రానున్న రోజుల్లో ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.

Related Posts