YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేసీఆర్ నోట కొత్త నినాదం

కేసీఆర్ నోట కొత్త నినాదం

హైదరాబాద్, సెప్టెంబర్ 20,
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆసక్తిని రేపుతున్నాయి. సీఎం ప్రకటనల వెనుక రాబోయే ఎన్నికలే టార్గెట్ అని విమర్శలు వినిపిస్తున్నా ఆయన మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో కేసీఆర్ నోట కొత్త నినాదం వినిపించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి నినాదం వినడానికి బాగానే ఉన్నా.. ఆచరణలో బెడిసికొడితే మొదటికే మోసం తప్పదనే టెన్షన్ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభలో సీఎం చేసిన నినాదంపై అందరి దృష్టి పడింది. దళిత బంధు మాదిరిగానే త్వరలో గిరిజన బంధు ఇస్తామని ముఖ్యమంత్రి సంచలన ప్రకటన చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ప్రజల ఆదాయం పెరిగిందని చెబుతూనే 'సంపదను పెంచు ప్రజలకు పంచు' అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని సీఎం చెప్పడం ఆసక్తిని రేపుతోంది.జాతీయ రాజకీయాలపై కన్నేసిన సీఎం కేసీఆర్ ఇటు స్టేట్.. అటు సెంట్రల్ లో బీజేపీకి చెక్ పెట్టాలని గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన గత హుజూరాబాద్ ఉపఎన్నిక సమయంలో దళిత బంధు ప్రకటించగా.. మునుగోడు ఉపఎన్నికకు ముంగిట్లో గిరిజన బంధు ఇస్తామని చెప్పడం చర్చకు దారి తీసింది. టీఆర్ఎస్ హాయంలో రాష్ట్ర సంపదను రెట్టింపు చేశాం.. ఆ డబ్బును ప్రజలకు పంచుతున్నాం అనే ధోరణిలో ముఖ్యమంత్రి మాట్లాడటం వెనుక ప్రధాని మోడీని టార్గెట్ చేశారా? అనే చర్చ జరుగుతోంది. ఇటీవల నరేంద్ర మోడీ ఉచితాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయ తాయిలాలతో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో కూరుకుపోతుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ తో సహా మరికొన్ని ప్రాంతీయ పార్టీలు విమర్శలు గుప్పించాయి. బీజేపీ నుండి ఉచితాల విషయంలో విమర్శలు వస్తున్న వేళ సంపదను పెంచు ప్రజలకు పంచు అనే కాన్సెప్ట్ ను కేసీఆర్ బిల్డ్ చేయాలనుకోవడం వెనుక బీజేపీకి చెక్ పెట్టే వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతోంది.ముఖ్యమంత్రి గిరిజన బంధు ప్రకటించడంతో అనూహ్యంగా తెరపైకి మరో డిమాండ్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సబ్సిడీ గొర్రెల పథకం కింద తమకు గొర్రెలు వద్దని, డబ్బులే ఇవ్వాలని తెలంగాణ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు జీఎంపీఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన చర్చావేదికలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. గొర్రెల స్థానంలో నగదు బదిలీ చేస్తే నచ్చిన చోట లబ్దిదారులు గొర్రెలు కొనుగోలు చేస్తారని, అనువు కాని ప్రాంతాల్లో ఇతర మార్గాలను ఎంచుకుంటారనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ సందర్భంగా బీసీ నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. గొర్రెలు, మేకల పెంపకం దారులకు రూ.1 లక్ష 75 వేల నుంచి 5 లక్షల రూపాయల వరకు పెంచాలని, అలాగే ఈ పథకం కింద నగదునే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. దళిత బంధు తర్వాత గిరిజన బంధు ప్రకటించిన నేపథ్యంలో అనూహ్యంగా ఈ డిమాండ్ వినిపిస్తూ ఉండటంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే ఉత్కంఠ ఏర్పడింది.గిరిజన బంధు తర్వాత మరికొన్ని సామాజిక వర్గాల నుండి ఈ తరహా డిమాండ్లు వ్యక్తం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీసీలతో పాటు అగ్రవర్ణాల్లోని అనేక మంది పేదలు ఉన్నారని, వారంతా ఆర్థికంగా చితికిపోయిన స్థితుల్లో బతుకీడుస్తున్నారని ఇలాంటి వారికి సైతం నగదు బదిలీ చేయాలనే డిమాండ్లు తెరపైకి వచ్చే సూచనలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల నాటికి కొన్ని సామాజిక వర్గానికి ఈ తరహా డబ్బుల పంపిణీ స్కీమ్ అమలు చేసి మరి కొన్ని వర్గాలను విస్మరిస్తే అది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోననే టెన్షన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఉందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా అధికంగా ఓట్లు శాతం కలిగిన బీసీ సామాజిక వర్గం కోసం ఈ తరహా పథకం అమలు చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అసలే అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అన్ని వర్గాలకు నగదు బదిలీ అమలు చేయాలంటే సాధ్యమేనా? ఒకవేళ అమలు కాకుంటే మొదటికే మోసం తప్పదా? అనే చర్చ జరుగుతోంది. బీజేపీని నిలువరించేలా కేసీఆర్ తీసుకు వస్తున్న ఒక్కో స్కీమ్ ఎలాంటి ఫలితాలు ఇస్తాయో కాలమే నిర్ణయించనుంది.

Related Posts