YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తగ్గినట్టే తగ్గి...మళ్లీ ... భారీగా పెరుగుతున్న మద్యం షాపులు

తగ్గినట్టే తగ్గి...మళ్లీ ... భారీగా పెరుగుతున్న  మద్యం షాపులు

విజయవాడ, సెప్టెంబర్ 23, 
మద్యపానం వల్ల చాలా కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని, అక్కాచెల్లమ్మల భవిష్యత్తు దెబ్బతింటుందని, తమ పార్టీ అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని వాగ్దానం చేసిన నాటి ప్రతిపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆచరణలో వెనక్కు తగ్గారు. సంక్షేమ పథకాల అమలు కోసం మద్యం ఆదాయం తప్పనిసరి అనే ధోరణితో మద్యం అమ్మకాలకు ప్రోత్సాహకాలు ఇస్తున్న తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం అసెంబ్లీలో మద్యపాన నిషేధం అమలుపై ప్రభుత్వం ఇచ్చిన హామీపై చర్చకు టిడిపి ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రశ్నకు సమాధానం కూడా చెప్పకుండా దాటవేయడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌ తప్ప అంతటా దశలవారీ మధ్యపాన నిషేధాన్ని పూర్తిగా అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న మద్యం షాపులను రద్దు చేసి ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేపట్టింది. ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికి రాష్ట్రంలో 4,380 మద్యం షాపులు, 840 బార్‌ అండ్‌ రెస్టారెంట్లు ఉండేవి. మద్యం షాపుల్లో మొదట 20 శాతం దుకాణాలను తగ్గించి 3,500కు పరిమితం చేసింది. ఆ తర్వాత 2020లో కేవలం 13 శాతంతో 535 షాపులను తగ్గించి 2,965 ఉంచింది. ప్రతిఏటా 20 శాతం చొప్పున ఐదేళ్లలో మద్యపాన నిషేధాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది. 2021, 2022లో మద్యం షాపులను తగ్గించే దిశగా చర్యలు తీసుకోకపోగా, ఆదాయం పెంచుకునే వనరుగా చూడటం పట్ల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 840 బార్‌లలో 40 శాతం 350 బార్లను రద్దు చేసింది. తమకు 2022 జూన్‌ వరకు బార్‌ లైసెన్స్‌ ఉందని యజమానులు కోర్టుకు వెళ్లడంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. బార్ల కాలపరిమితి ముగిశాక 2022 సెప్టెంబరు నుంచి అమలయ్యే కొత్తపాలసీలో ప్రభుత్వం 2025 వరకు కాలపరిమితిని పెడుతూ మొత్తం 840 బార్లకు టెండర్లు వేసి కట్టబెట్టింది. మద్యపాన నిషేధం హామీకి, ఇప్పుడు మద్యం అమ్మకాలపై నియంత్రణ పెడుతున్నామని సిఎం చెబుతున్న తీరు చర్చనీ యాంశమైంది. రాష్ట్రంలో మద్యం అమ్మకాల నుంచి గత ప్రభుత్వ హయాంలో చివరి ఆర్థిక సంవత్సరం 2018-19లో రూ.20,128 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ప్రభుత్వ హయాంలో 2021-22లో రూ.25,023 కోట్ల ఆదాయం సమకూరింది. మొదట్లో మద్యం షాపుల్లో అమ్మకాలను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తగ్గించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఉదయం 10:30 నుంచి రాత్రి 10 గంటల వరకు అమలు చేస్తోంది. టూరిజం ప్రాంతంలో 24 గంటలూ మద్యం షాపులను తెరిచి ఉంచేలా ఆలోచిస్తోంది.ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు చేసిన మద్యపాన నిషేధం హామీ నుంచి వెనక్కు తగ్గారు. దశలవారీగా మద్యం అమ్మకాలను తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు పెంచుకునేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ప్రభుత్వ హామీ ప్రకారం ఇప్పటికే 60 శాతం షాపులు తగ్గాలి. రాష్ట్రంలో ఇప్పుడు షాపులను తగ్గించకపోగా, అమ్మకాలకు సంబంధించి వేళలను పెంచారు. గ్రామాల్లో అక్రమ మద్యం, నాటుసారా అమ్మకాలు అధికార పార్టీ నాయకులకు ఆదాయ వనరుగా మారింది. ఎవరైనా అక్రమంగా మద్యం అమ్మకాలు చేస్తున్నారని ధైర్యంగా ఫిర్యాదు చేస్తే పోలీసులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అలాంటి వారిపై ఎదురు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.

Related Posts