YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాజకీయ అజ్ఞాతవాసి..రఘువీరా..

రాజకీయ అజ్ఞాతవాసి..రఘువీరా..

అనంతపురం, సెప్టెంబర్ 23, 
రఘువీరారెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు తెలిసిన వారికి..ఈ పేరు గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. ఎందుకంటే దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించిన నేత..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు సార్లు మంత్రిగా పని చేశారు. సుధీర్ఘకాలంగా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే రాష్ట్ర విభజన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ పై ఎంత ప్రభావం చూపాయో.. రఘువీరారెడ్డి రాజకీయ జీవితంపై అంతకు మించి చూపాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఓటములు వచ్చినా ఆయన మాత్రం పార్టీ వీడలేదు. విలువలు గల రాజకీయాలు చేస్తూ ముందుకు సాగారు. నెరిసిన తల, తెల్లటి గుబురు గడ్డం..నిలువెత్తు ధవళ వస్త్రధారణ.. ఎర్రటి బొట్టు.. తెలియనివారికి ఈయన్ను చూడగానే ఊరి పెద్ద అనుకుంటారు. తెలిసినవాళ్లు..ఆయన.. ఈయనేనా అని ఒక్కసారి ప్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తారు. ఆయనతో కాసేపు మాట్లాడితే.. పంట పొలాల గురించి.. దేవుళ్ల గురించి.. ఊరి బాగోగులు..వయసుడికిన జీవితం గురించే చెబుతారు. ఆయన నోట..ఇప్పుడు అస్సలు రాజకీయ మాట రానేరాదు.. కావాలంటే.. ఎడ్లబండి నడుపుతారు. పిల్లలను ఎక్కించుకుని సరదాగా పల్లె మొత్తం తిరుగుతారు. ఇంకా కావాలంటే..పంచె పైకి ఎగ్గట్టి.. పిల్లలతో పోటీ పడి బొంగరాలు ఆడుతారు. కానీ రాజకీయాల గురించి అడిగితే.. చిరునవ్వుతో దాటవేస్తారు. ఆయనే.. రాజకీయ అజ్ఞాతవాసి రఘువీరారెడ్డి..2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన దారుణమైన ఫలితాలు చూసి..రాజకీయాలకు దూరమయ్యారు..పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి..నగరం నుంచి పల్లె జీవితంలోకి అడుగు పెట్టారు. మడకశిర మండలం తన సొంతూరు నీలకంఠాపురం గ్రామానికి వెళ్లిపోయారు. అక్కడ శిథిలావస్థలో ఉన్న నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం జీర్ణోద్ధారణ పనులు చేపట్టారు. దాదాపు రెండేళ్లు శ్రమించి.. జిల్లాలోని ఎక్కడా లేని విధంగా అందరు దేవతలు కొలువుదీరిన పెద్ద ఆలయాన్ని నిర్మించారు.గ్రామంలో ఒక కంటి ఆసుపత్రిని కూడా ప్రారంభించారు. రాజకీయం మీద వైరాగ్యమో.. లేక మరేంటో కానీ.. ఆయన గ్రామంలో సాధారణ జీవితం గడుపుతున్నారు. ఒక రైతులా, కూలీలా, గ్రామ పెద్దలా, ఒక్కోసారి చిన్న పిల్లాడిలా జీవనం సాగిస్తున్నారు. ఈ మూడేళ్ల కాలంలో ఆయన రాజకీయాల్లోకి మళ్లీ వస్తున్నారని..ఈ సారి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అందుకుంటారని..ఇంకో సారి టీడీపీలోకి వెళ్తున్నారని.. మరోసారి వైసీపీలోకి వస్తున్నారని ప్రచారం సాగింది. దాదాపు అన్ని పార్టీల నాయకులు ఆయన్ని కలిశారు. ఒక్కోసారి ఒక్కో రూమర్ వచ్చినా ఆయన మాత్రం నోరు విప్పలేదు. తన పని తాను చేసుకుపోతున్నారు.కొన్ని రోజులుగా ఓ వార్త ప్రచారంలో ఉంది.. రఘువీరారెడ్డి ఇక రాజకీయాల్లోకి రారని.. ఆయన కూతురు అమృత రఘువీర్‌ పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తున్నారని సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. అమృత రఘువీర్‌ గురించి బయటి జనానికి తెలియకపోవచ్చు. కానీ..రఘువీరా నియోజకవర్గం మొత్తం ఆమెకు పరిచయమే..ఎలాగంటే..మూడు ఎన్నికల్లో అమృత రఘువీర్ తండ్రి రఘువీరా రెడ్డి కోసం పని చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో ఏ ఎన్నికలు జరిగినా ఆమె కాన్వాస్ కు వచ్చే వారు. ప్రజల్లో మేమకం కావడం.. వారితో మంచి పరిచయాలు పెంచుకోవడం..అంతా తండ్రి లాగే ఉండేది. అందుకే ఆమెకు రాజకీయాలపై గ్రిప్ ఉందని అంటున్నారు స్థానికులు. వచ్చే ఎన్నికల్లో ఆమె బరిలోకి దిగే అవకాశాలున్నాయనే టాక్‌.. ఊరిని రౌండప్‌ చేస్తోంది.. రఘువీరా కూతురు ఎంట్రీ ఇస్తారనే అనుకుందాం..మరి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు.. అంటే.. తెలుగుదేశం పార్టీతో మొదటి నుంచి రఘువీరాకు దూరమే..కానీ కాంగ్రెస్ పార్టీ నేతలతో రఘువీరాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం వారంతా వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే ఆమె వైసీపీలోకి వచ్చే అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు. ఇక ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటే.. తన సొంత నియోజకవర్గం మడకశిర ఎస్సీ రిజర్వ్ గా ఉంది. అక్కడ పోటీచేసే అవకాశం లేదు. కాబట్టి రఘువీరాకు బాగా అచ్చొచ్చిన కళ్యాణదుర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. అదే సమయంలో అక్కడున్న మంత్రి ఉషశ్రీ చరణ్ ఎంపీగా వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. మొత్తం ఈక్వేషన్స్ చూస్తే అమృత రఘువీర్ కళ్యాణదుర్గం నుంచి కచ్చితంగా పోటీ చేస్తారని చర్చించుకుంటున్నారు.కాసేపు అదే నిజమనుకుందాం..అయితే అమృత రఘువీర్ మాత్రం ఎనిమిదేళ్లుగా మడకశిర వైపు చూడనేలేదంటున్నారు. ఏదో ఒకరోజు రావడం..వెంటనే వెళ్లడం తప్ప.. అప్పటి మాదిరిగా ఇప్పుడు నియోజకవర్గంలో ఉండటం లేదని కూడా చెప్పుకుంటున్నారు. ఏదేమైనా..వీటన్నింటిపైనా ఓ క్లారిటీ రావాలంటే..పెద్దాయనే నోరు విప్పాలి.. ఆయన చెప్పరు. ఆమె ఎప్పుడొస్తారో తెలియదు.. అంతవరకు సోషల్‌ మీడియా స్టంట్‌ ఆగదు.. జనం మాత్రం రఘువీరా కూతురు రావడం ఖాయమంటున్నారు.

Related Posts