
హైదరాబాద్, నవంబర్ 18,
పెండ్లి అనేది ఓ సాంస్కృతిక సార్వజనీన కార్యం. అందునా భారతీయ వివాహ వ్యవస్థకు ప్రత్యేక స్థానముంది. వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురానుభూతి. మూడు ముళ్ల బంధంతో ఏకమై తమ జీవితాన్ని పండించుకోవాలని పెండ్లి కాని ప్రతి యువతీ యువకుడు కోరుకుంటారు. అయితే కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా వివాహాలు హంగు ఆర్భాటం లేకుండా కొద్ది మంది బంధువుల సమక్షంలో పెండ్లిళ్లు జరిగాయి. కాగా, రెండు నెలల విరామం తర్వాత మార్గశిర మాసంలో శుభ ముహూర్తాలు రావడంతో పెండ్లి బాజాల జోరు హోరెత్తనుంది. ఈ ఒక్క మాసంలోనే హైదరాబాద్ నగర వ్యాప్తంగా వేల సంఖ్యలో పెండ్లిళ్లు జరగనున్నట్లు వెడ్డింగ్ ప్లానర్స్ చెబుతున్నారు. ఈ క్రమంలో ఫంక్షన్ హాల్స్, బ్యాండ్ మేళం, డెకరేషన్, పూలు పండ్లు, ఫుడ్, ఈవెంట్ ఆర్గనైజర్స్, ఫొటోగ్రాఫర్స్, పూజారులు, ట్రావెల్స్, టెంట్ హౌజ్, గోల్డ్, బట్టల దుకాణాలకు గిరాకీ పెరగనుంది. ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పట్టడం..నవంబర్ నెల చివరలో వచ్చే మార్గశిర మాసం నుంచి తిరిగి శుభ ముహూర్తాలు ప్రారంభం అవుతున్నాయి.ఈనెల 23తో కార్తిక మాసం ముగిసి మార్గశిర మాసం మొదలుకానుంది. ఈ మాసంలో 2, 3, 8, 12,16, 17, 18 తేదీలలో శుభ ముహూర్తాలు ఉండడంతో వేలాది పెండ్లిళ్లు జరగనున్నాయి. జనవరిలో ముహూర్తాలు లేని కారణంగా వేల జంటలు కల్యాణ తిలకం దిద్దుకునేందుకు రెడీ అవుతున్నారు. . డిసెంబర్ 2న ముహూర్త బలం ఎక్కువగా ఉండడంతో ఆ ఒక్క రోజులోనే వేల సంఖ్యలో పెండ్లిళ్లు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. నవంబర్, డిసెంబర్ మాసాల్లోనే ఎక్కువ సెలవులు తీసుకుంటుండటం వంటి కారణాల నేపథ్యంలోనూ మార్గశిర మాసంలో పెండ్లిళ్ల్లుఎక్కువగా ఉంటాయని పలు వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ముహూర్తాలు సైతం పెట్టుకోవడం పూర్తికావడంతో ఆయా ఇండ్లల్లో పెళ్లి సందడి నెలకొందిపెండ్లి ముహూర్తాల నేపథ్యంలో నగరంలో ఏ మూలన చూసినా ఫంక్షన్ హాళ్లు కిటకిటలాడనున్నాయి. ఇప్పటికే నగర వ్యాప్తంగా మూడోవంతు కల్యాణ మండపాలు రిజర్వ్‌కాగా.. డెకరేషన్, క్యాటరింగ్‌లకు కూడా అడ్వాన్స్‌లు ఇచ్చారు.