YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో తీరం అల్లకల్లోలం

ఏపీలో  తీరం అల్లకల్లోలం

విశాఖపట్టణం, నవంబర్ 21, 
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోన్న తీవ్ర అల్పపీడనం ఆదివారం నాటికి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ.. అదే రోజు రాత్రి చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ వాయుగుండం రానున్న 24 గంటల్లో ఉత్తర తమిళనాడు-దక్షిణ కోస్తాంద్ర తీరాల వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అనంతరం అది క్రమంగా అల్పపీడనంగా బలహీనపడుతుందని అంచనా వేసింది. దీని ప్రభావంతో సోమవారం, మంగళవారాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో.. రాయలసీమలోని చిత్తూరు, వైఎస్‌ఆర్ జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే రెండు రోజులు దక్షిణ కోస్తాంద్ర, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులు కూడా సంభవించవచ్చునని వివరించింది.మరోవైపు దక్షిణ కోస్తా, తమిళనాడు తీరం వెంబడి 45-55 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఆదివారం తిరుపతి జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో చిల్లకూరు, కోట, వాకాడు, సూళ్లూరుపేట, తడ మండలాల తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ రెండు రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఆదేశాలు జారీ చేసింది. కాగా, వాయుగుండం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో చలి తీవ్రత బాగా పెరిగింది. ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో దట్టంగా పొగమంచు కురుస్తోంది. అరకు, పాడేరు, చింతపల్లిలో 17 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అల్లూరి జిల్లా మినుములూరులో 10, పాడేరులో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

Related Posts