YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

భూ హక్కు సర్వేల్లో అవకతవకలు

భూ హక్కు సర్వేల్లో అవకతవకలు

విజయవాడ, నవంబర్ 23,
భూహక్కు, భూరక్ష పథకం కింద నిర్వహిస్తున్న సర్వేలో పెద్దఎత్తున అవకతవకలు చోటుచేసుకుంటు న్నాయి. భూ రికార్డులను డిజిటలైజ్‌ చేయాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకం రైతులకు శాపంగా మారుతోంది. రాష్ట్రంలో కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం షేర్‌మహ్మద్‌పేటలో ప్రయోగాత్మకంగా చేసిన ఈ పథకంలో అనేక లోపాలు వెలుగులోకి వచ్చాయి. వీటిని ఏమాత్రం సవరించకుండానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కనీసం నాలుగు మండలాల్లో మండలానికి ఒక గ్రామం చొప్పున ప్రయోగాత్మకంగా సర్వే నిర్వహించారు. రోవర్లు, డ్రోన్లు ఇలా ఆధునిక పద్దతుల్లో చేపట్టిన ఈ సర్వేలోనూ అనేక లోపాలను గుర్తించారు. అయినా, వీటిని సరిచేయలేదు. ఆంధ్రప్రదేశ్‌ సర్వే మరియు సరిహద్దు చట్టం 1923 సెక్షన్‌ 13 ప్రకారం సర్వే విజయవంతంగా పూర్తయిందని ప్రకటించి తహశీల్దార్లకు టార్గెట్లు పెట్టారు. దీంతో తహశీల్దార్లు, సర్వే అధికారులు ఎక్కడికక్కడ సర్వేలు నిర్వహించి ఫైనల్‌ నోటిఫికేషన్లు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ సర్వే మరియు సరిహద్దు చట్టం 1923 సెక్షన్‌ 14 ప్రకారం ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే సివిల్‌ కోర్టుల ద్వారా తేల్చుకోవాలని ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లలోనే పేర్కొన్నారు. అయితే ఎక్కువ గ్రామాల్లో భూ కమతాల్లో భూములు వారి దగ్గర ఉన్న రికార్డులకంటే తక్కువగా ఉన్నట్లు చూపెడుతున్నారు. బ్రిటీష్‌కాలంలో సర్వే నిర్వహించారని, మరలా ఇప్పుడు నిర్వహిస్తున్నారని సరిహద్దులు స్వల్పంగా మారే అవకాశం ఉంటుందని వ్యవసాయశాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు గతంలోనే తెలిపారు. సర్వే అనంతరం రికార్డుల్లో తక్కువ చూపించిన రైతులతో సంప్రదించి మార్పులు చేర్పులు చేసిన తరువాత ఫైనల్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలని వ్యవసాయ రంగ నిపుణులు ఎర్నేని నాగేంధ్రనాథ్‌ సూచించారు. ఒక గ్రామంలో 23 ఎకరాల భూమి ఉంటే 13 సెంట్లు చూపించారని, దీనిపై కనీస వివరణ ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. విజయనగరం జిల్లా మర్రివలస మండల పరిధిలోని ఓ గ్రామంలోనూ ఇదే సమస్య వచ్చిందని, అక్కడి రైతు తెలిపారని వివరించారు. దీనిపై సిసిఎల్‌ను కలవగా ఫైనల్‌ నోటిఫికేషన్‌ ఇచ్చే ముందు రైతులతో సంప్రదింపులు జరపాలని సూచిస్తూ సర్క్యులర్‌ ఇచ్చారని, అదే సమయంలో టార్గెట్‌ పెట్టారని చెప్పారని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై రైతులు ఆగ్రహంగా ఉన్నారు. ఒక్కసారి ఫైనల్‌ నోటిఫికేషన్‌ ఇస్తే కోర్టు ద్వారా తేల్చుకోవాల్సి ఉంటుందని, అది ఇప్పట్లో తేలే అవకాశం ఉండదని అంటున్నారు. దీనిపై సిపిఎల్‌ఏను కలిసి వినతిపత్రం ఇద్దామని, సమస్యను వివరిద్దామని అనుకున్నా అపాయింట్‌మెంట్‌ దొరకడం లేదని రైతు నాయకులు చెబుతున్నారు. దీనిపై చర్చించుకుని త్వరలోనే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు. ఈ సర్వేలో అన్నీ అక్రమాలు జరుగుతున్నాయని మొత్తం గ్రామంలో 600 ఎకరాలు ఉన్నాయనుకుంటే లెక్కలు మారినా అంతే విస్తీర్ణాన్ని చూపించాలని, కానీ తక్కువ చేసి చూపిస్తున్నారనిఅంటున్నారు. దీనివెనుక మోసం ఉందని, దీనిపైనా తేల్చాల్సి ఉంటుందని భూ యజమానులు డిమాండు చేస్తున్నారు. 2023 జనవరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే పూర్తిచేసి మ్యాపులు ఇస్తారని, అనంతరం అంతకుముందున్న రికార్డున్నీ తొలగిస్తారని, దీనివల్ల రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని రైతు సంఘం రాష్ట్ర సీనియర్‌ నాయకులు వై.కేశవరావు తెలిపారు. సర్వే సక్రమంగా జరగడం లేదని, అధికారులు ఇష్టం వచ్చినట్లు చేసుకుపోతున్నారని పేర్కొన్నారు. సర్వే సమయంలో రైతులతో చర్చించి రికార్డులు పరిశీలించి సర్వే చేయాలని చట్టంలో ఉందని, అలా కాకుండా తాము సర్వే చేశామని చెబుతూ నేరుగా బోర్డులు పెట్టేస్తున్నా రని వివరించారు. ప్రస్తుతం 1500 గ్రామాల్లో సర్వే జరుగుతోందని, పూర్తయితే గానీ మరిన్ని విషయాలు వెలుగులోకి రావని ఆయన చెప్పారు.

Related Posts