YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వివేక హత్య కేసుకు ఫుల్ స్టాప్ పడేనా

వివేక హత్య కేసుకు ఫుల్ స్టాప్ పడేనా

కడప, జనవరి 27, 
ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి బాబాయ్, మాజీ ఎంపీ, మాజీ మంత్రి ఇలా ఏ రకంగా చూసుకున్నా వీవీఐపీల్లో ఒకరు  వైఎస్ వివేకానందరెడ్డి. ఆయనను సొంత ఇంట్లో అదీ కూడా పులివెందులలో వైఎస్ కుటుంబీకులందరూ నివాసం ఉండే కాలనీలో దారుణంగా హత్య చేయడం.. ఆ కేసు విషయం ఇప్పటికీ తేలకపోవడం కాస్త విచిత్రమే.  ఈ కేసులో ఎన్నో క్లూలు ఉన్నాయని సామాన్య ప్రజలు అనుకుంటూ ఉంటారు. కానీ సీబీఐ అధికారులు ఎందుకు తేల్చలేకపోతున్నారు ? ఈ కేసు రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ? రాజకీయ కారణాలతో నిందితుల్ని కాపాడే ప్రయత్నం జరిగితే  చట్టం ఊరుకుంటుందా ?వైఎస్ వివేకానందరెడ్డి కేసు దాదాపుగా నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పజిల్ గానే ఉండిపోయింది. ఆయన హత్య ఓ సంచలనం. అసలు గుండెపోటు అని ప్రచారం చేశారు. పోస్టుమార్టానికి వెళ్లే వరకూ అదే చెప్పారు. ఆ తర్వాత పోస్టుమార్టానికి పంపిన తర్వాత దారుణ హత్య అని తేలింది. ఆ తర్వాత వివేకా రాసినట్లుగా చెబుతున్న ఓ లేఖ కూడా వెలుగులోకి వచ్చింది. వివేకా  హత్యానంతరం జరిగిన పరిణామాలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాయి. వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని మొదట ప్రచారం జరిగింది.  ఆయన తెల్లవారు జామున అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యారు.  కానీ ఆయనది గుండెపోటు అని ప్రచారం చేశారు. ఎవరికీ అనుమానం రానివ్వలేదు.  హత్య ప్రాంతంలో ఉన్న వారు ఈ సమాచారం ఇచ్చారు. ఇలా దారుణమైన హత్యను గుండెపోటుగా ఎందుకు ప్రచారం చేశారు అనేది ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని విషయం.  గుండె పోటు అని ప్రచారం చేయడం మాత్రమే కాదు.. ..  అలా నమ్మించడానికి సాక్ష్యాలను తుడిచేశారు. రక్తం మడుగు కడిగేశారు.   మృతదేహానికి కట్లు కట్టారు. అంతే కాదు..  అసలు పోస్టు మార్టం అవసరం లేదని పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. అంత్యక్రియలు చేసేయాలనుకున్నారు. వివేకా కుమార్తె  సునీత పోస్టు మార్టం చేయాలని పట్టుబట్టడంతోనే పోస్టుమార్టం జరిగింది. ఆ తర్వాతే  హత్య అనే విషయం  బయటకు తెలిసింది. అప్పటి వరకూ గుండెపోటు అని ప్రచారం చేసిన వారు కూడా హత్య అని చెప్పడం ప్రారంభించారు. సాధారణంగా సాక్ష్యాలు తుడిచేసేవారే ప్రధాన అనుమానితుడు అవుతారు. హత్యను హత్య కాదు అని చెప్పేందుకు.. ప్రయత్నించారు అంటేనే.. అక్కడేం జరగిందో వారికి తెలుసని అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. సాధారణంగా పోలీసులు ఓ చిన్న క్లూ ఆధారంగానే మొత్తం కేసును బయట పెట్టేస్తారు. నిందితులు ఎక్కడ ఉన్నా పట్టేస్తారు. కానీ హై ప్రోఫైల్ కేసు అయిన వివేకా హత్య కేసులో నిందితుల్ని మాత్రం పట్టుకోవడానికి సీబీఐకి చాలా కాలం పట్టింది.  ఇప్పుడు ఈ కేసులో అనుమానితుడిగా కడప ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇవ్వడంతో తదుపరి ఏం జరగబోతోందన్నది చర్చనీయాంశంగా మారింది.వివేకా హత్య జరిగిన రోజున వైఎస్ అవినాష్ రెడ్డి నేతృత్వంలోనే గుండెపోటు అని ప్రచారం చేశారని సీబీఐ గతంలో ఆధారాలు సేకరించింది. అప్పట్లో ఉన్న పోలీసులు ఇచ్చిన వాంగ్మూలం కూడా అలాగే ఉంది. అక్కడి మీడియా ప్రతినిధులు కూడా గుండెపోటు అని చెప్పారనే సీబీఐకి చెప్పారు. అలాగే అవినాష్ రెడ్డి నేతృత్వంలోనే సాక్ష్యాలను తుడిచేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ కారణంగానే అవినాష్ రెడ్డిని అనుమానితుడిగా సీబీఐ పరిగణిస్తున్నట్లుగా భావిస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసు ఏ మలుపు తిరిగినా రాజకీయ సంచలనం ఖాయమని అనుకోవచ్చు.ఎందుకంటే ఈ హత్య రాజకీయ కోణంలోనే జరిగిందన్న అనుమానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ కేసు విషయంలో వైఎస్ కుటుంబసభ్యుల్లోనూ విభేదాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. కారణం ఏదైనా వివేకా హత్య కేసు ముందు ముందు కీలక పరిణామాలకు వేదికయ్యే అవకాశం ఉంది.

Related Posts