YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నాని మాటలకు అర్థాలే... వేరులే

నాని మాటలకు అర్థాలే... వేరులే

విజయవాడ, మే 24, 
విజయవాడ ఎంపీ కేశినేని నాని మాటల వెనుక ఆంతర్యం ఏమిటో తెలియక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉంటూ వైసీపీ నేతల్ని పొగడటం, పార్టీ నేతల్ని ఇరుకున పెట్టేలా కామెంట్లు చేయడం ఆయనకే చెల్లిందని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. వరుసగా రెండుసార్లు విజయవాడ ఎంపీగా గెలిచిన కేశినేని నానికి ముచ్చటగా మూడో సారి టీడీపీ టిక్కెట్ దక్కుతుందో లేదోననే అనుమానం అందరిలోను ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో కేశినేని నానికి ప్రత్యేకంగా ఓ వర్గమంటూ మిగలకుండా పోయింది. నాని తీరుతో విభేదించే వాళ్లు, వ్యతిరేకించే వాళ్లంతా ఏకమై నానిని ఓడించాలని శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టిక్కెట్ కోసం సొంత తమ్ముడి నుంచి కూడా నాని పోటీ ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వైసీపీ నాయకుల్ని పొగుడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.ఎన్టీఆర్‌ జిల్లాలో ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుతో పాటు ఆయన సోదరుడు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్‌లపై టీడీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఎమ్మెల్యే సోదరుల్ని వసూల్ బ్రదర్స్ అంటూ ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో కేశినేని నాని మొండితోక సోదరుల్ని పొగడ్తలతో ముంచెత్తడం చర్చనీయాంశంగా మారింది.వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకపోతే కేశినేని భవన్‌లో కూర్చొని బెజవాడ ప్రజలకు సేవ చేస్తానన్నారు. రాజకీయాల్లో తాను, తన కుటుంబం జీవితాంతం ఉండాలని భావించే వ్యక్తిని కాదని, మంచి పనులు ఎవరు చేస్తే వాళ్ళని అభినందిస్తానని చెప్పుకొచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ నాలుగేళ్లుగా తనకు తెలుసని, మొండితోక సోదరులు మంచి చేస్తున్నారు కాబట్టి ప్రశంసించానని చెప్పారు. తనకు తెలిసి మొండి తోక బ్రదర్స్ మంచి వాళ్ళని పేర్కొన్నారు.ఇంతవరకు బాగానే ఉన్నా ఇసుకలో వాటాలు, మైనింగ్‌లో వాటాలు ఇవ్వకపోతే ధర్నా బ్లాక్ మెయిలింగ్ వంటి రాజకీయాలు తాను చేయనన్నారు. నందిగామ సిట్టింగ్ ఎమ్మెల్యేను ఆయన సోదరుడిని ఎంపీ నాని పొగడటం వెనుక మాజీ మంత్రి దేవినేని ఉమాను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. నందిగామలో దేవినేని ఉమా శిష్యురాలు తంగిరాల సౌమ్య గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఉమా వర్గాన్ని ఇష్టపడటం ఇష్టం లేక వైసీపీ ఎమ్మెల్యేను ఎంపీ నాని పొగిడినట్లు కనిపిస్తోంది.బెజవాడ పార్లమెంట్‌కు ఎవరు మంచి చేస్తే వాళ్ళతో కలుస్తానని, ‘‘తెలంగాణ కోసం గొంగళి పురుగును ముద్దాడుతానని కేసీఆర్ అన్నారని, నేను బెజవాడ పార్లమెంట్ అభివృద్ధి కోసం ముళ్ళ పందితో అయినా కలుస్తానని చెప్పారు. ఎంపీగా పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి చేయాలంటే అధికారులు, స్థానిక ఎమ్మెల్యే లు సహకరించాలని వైసీపీలో ఉన్నా ఎమ్మెల్యేలు ఉదయ భాను , మొండి తోక సమన్వయం చేసుకోవటం వల్ల ఎంపీ ల్యాడ్ నిధులు ఇచ్చి పనులు చేస్తున్నానని తెలిపారు.కేశనేని నానికి 2014ఎన్నికల్లో చివరి నిమిషంలో టీడీపీ టిక్కెట్ లభించింది. అప్పట్లో సుజనా చౌదరి వంటి వారు ఆ‍యనకు సహకరించడంతో పాటు, నాని ఒత్తిళ్లు కూడా ఫలించాయనే ప్రచారం ఉంది. 2019లో అనివార్యంగా ఆయనకు టిక్కెట్ కేటాయించాల్సి వచ్చింది. ఈసారి మాత్రం బెజవాడ ఎంపీ స్థానానికి టీడీపీలో గట్టిపోటీ నెలకొంది. పార్టీ అధిష్టానం కూడా నాని వ్యవహార శైలితో విసిగిపోయి ఉండటంతో పెద్దగా ఖాతరు చేయడం లేదు.రాష్ట్రమంతటా టీడీపీ ఓటమి పాలైనా వ్యక్తిగత ఇమేజ్ వల్ల రెండోసారి గెలిచానని కేశినేని భావిస్తున్నారని సన్నిహితులు చెబుతుంటారు. ఈ క్రమంలోనే పార్టీ పెద్దల్ని సైతం ఖాతరు చేయకుండా బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారని అనుమానిస్తున్నారు. మరోవైపు ఎంపీ కేశనేని నాని తన గెలుపుకు కారణమయ్యారని నందిగామ వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు కేశినేని నాని ఎవరో తనకు తెలియదని, నియోజక వర్గం అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.కేశినేని నాని మాత్రం టీడీపీని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ అధిష్టానం కేశనేని చిన్నికి ప్రోత్సాహం ఇవ్వడం గిట్టకే నాని ఇలా చేస్తున్నట్లు కనిపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్న చోట ఎంపీ నిధుల్ని కేటాయించి సొంత పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.

Related Posts