YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో పొలిటికల్ హీట్

ఏపీలో  పొలిటికల్ హీట్

విజయవాడ, జూన్ 7, 
ఏపీలో పొలిటికల్ హీటు పెరుగుతోంది. ఎన్నికలకు పది నెలల ముందుగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ప్రచార రథానికి పని పెట్టారు. వారాహిపై ఏపీ వ్యాప్త పర్యటనకు తేదీ ఖరారు చేశారు. జూన్ పద్నాలుగో తేదీన వారాహి రోడ్డెక్కబోతోంది. తనకు కలిసి వచ్చే సామాజిక సమాకరణాలు, అవకాశాలున్నయని భావిస్తున్నందు వల్లే ఉభయ గోదావరి జిల్లాల్లోనే పవన్ కల్యాణ్ తొలి విడత పర్యటనకు దిగుతున్నారు. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో పూజాధికాలు నిర్వహించిన తర్వాత తుని నుంచి వారాహిపై ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టాలని జనసేనాని తీర్మానించారు. రొటీన్ ప్రచారంలా కాకుండా ప్రజలతో మమేకమవుతూ, సాయంత్రాలు స్ట్రీట్ మీటింగుల్లో మాట్లాడుతూ.. అడపాదడపా బహిరంగ సభలను నిర్వహించేలా వారాహి యాత్రను ఖరారు చేశారు. దానికి అనుగుణంగా యాత్రకు ఇంఛార్జీలను నియమించారు. ఇంత ముందుగానే పవన్ కల్యాణ్ ప్రచారాన్ని ప్రారంభించడం వెనుక రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో విస్తృతంగా.. విడతల వారీగా పర్యటించాలన్నది ఒక కారణంగా భావిస్తుండగా.. రెండోది ఏపీలో ముందస్తు ఊహాగానాలు బలంగా వినిపించడమని తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఏపీలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు రావచ్చన్న వార్తలు ఓ మోస్తరుగానే వస్తున్నాయి. జగన్ మదిలో ముందస్తు యోచన వుందని, దాని ప్రకారం 2023 నవంబర్, డిసెంబర్ నెలల్లో జరిగే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటే ఏపీకి అసెంబ్లీకి ఎన్నికలు జరిపితే తమకు అనుకూలంగా ఫలితం వచ్చే అవకాశం వుంటుందని ఆయన భావిస్తున్నారని చెప్పుకుంటున్నారు. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారు ముందస్తు యోచన లేనే లేదని కాస్త గట్టిగానే చెబుతున్నా.. ఈ ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు. ఒక వేళ సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని భావిస్తే దానికి అనుగుణంగా తమ పార్టీ సిద్దంగా వుండాలని భావించడం వల్లనే పవన్ కల్యాణ్ జూన్ నెలలోనే ప్రచార పర్వానికి శ్రీకారం చుడుతున్నారని కొందరు విశ్లేషిస్తున్నారు. కొంత కాలంగా పవన్ కల్యాణ్ ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న అంశాన్ని పదే పదే చెబుతున్నారు. దానికి అనుగుణంగా జనసేన, టీడీపీ, బీజేపీలు కలిసి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటే వైసీపీని ఇంటికి పంపవచ్చన్నది జనసేనాని వ్యూహమని తెలిసిపోతూనే వుంది. తాను బలిపశువు కాబోనంటూనే సీట్ల సర్దుబాటుపై నిక్కచ్చిగా బలాబలాలను పరిగణనలోకి తీసుకోవాలన్న అభిమతాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2014 నాటి అలయెన్స్ రిపీట్ అయితే జగన్‌ను నిలువరించవచ్చని ఆయన భావిస్తున్నారు. అయితే 2014లో జనసేన పార్టీ.. బీజేపీ-టీడీపీ కూటమికి మద్దతు ప్రకటించి, ఎన్నికల్లో పోటీకి దూరంగా వుంది. ఆ తర్వాత 2019 నాటికి ఏపీలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. జనసేన అటు టీడీపీకి, ఇటు బీజేపీకి దూరం జరిగి, వామపక్షాలతో కలిసి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొని చతికిలా పడింది. జనసేనాని పవన్ కల్యాణ్ రెండు నియోజకవర్గాలలో పోటీ చేసినా ఒక్కచోట గెలువలేకపోయారు. మొత్తమ్మీద ఒకే ఒక ఎమ్మెల్యేను జనసేన గెలిపించుకోగలిగింది. ఆ గెలిచిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా జనసేనలో ఎంతో కాలం వుండలేదు. అధికార పార్టీలో దాదాపు చేరిపోయారు. ఇలా ఒక్క ఎమ్మెల్యే కూడా లేని జనసేన పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుంభస్థలాన్ని కొట్టే భారీ లక్ష్యాన్ని పెట్టుకున్నారు. అయితే ప్రస్తుతం కనబరుస్తున్న దూకుడు పవన్ కల్యాణ్‌లో సీట్ల సర్దుబాటు నాటికి వుంటుందా లేదా అన్న ఆసక్తి రేపుతోంది. సీట్ల బేరసారాల్లో చాణక్యనీతిని ప్రదర్శించే చంద్రబాబుతో సమాలోచనలంటే ఆషామాషీ కాదు. 2014 ఎన్నికల్లో మోదీ చరిష్మాను చూపడం ద్వారా 35 సీట్లు పొందాలని భావించిన బీజేపీని చంద్రబాబు కేవలం 16 సీట్లకు పరిమితం చేశారు. గెలిచిన తర్వాత నాలుగు మంత్రి పదవులు ఆశిస్తే కేవలం రెండిచ్చి ఇక చాలని కమలనాథులకు చెప్పేశారు చంద్రబాబు. అలాంటిది ప్రస్తుత అసెంబ్లీలో ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే లేని జనసేనకు చంద్రబాబు ఎన్ని సీట్లు కేటాయిస్తారనేది ఆసక్తి రేపే అంశమే.అకస్మాత్తుగా ఢిల్లీ వెళ్ళి.. చాన్నాళ్ళుగా కలవలేకపోయిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో చంద్రబాబు సమాలోచనలు జరిపారు. ఈ పరిణామం రాజకీయ పక్షాలకు ఒకింత షాకిచ్చిందేనని చెప్పాలి. గత నెలలో పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్ళి, బీజేపీ నేతలతో భేటీ అయ్యారు. చంద్రబాబుతో కలిసి మూడు పార్టీలు మూకుమ్మడిగా ఎన్నికలకు వెళ్ళాల్సిన అవసరాన్ని ఆయన కమలం పార్టీ అధినాయకత్వానికి విడమరిచి చెప్పినట్లున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబుతో భేటీకి బీజేపీ అగ్రనేతలు సిద్దపడినట్లు తెలుస్తోంది. చంద్రబాబు, అమిత్ షా, నడ్డాల భేటీ సారాంశంపై ప్రస్తుతం ఇరు పార్టీలు గుంభనంగానే వ్యవహరిస్తున్నప్పటికీ పార్టీ శ్రేణులతో తాను జరిపిన టెలికాన్ఫరెన్సులో చంద్రబాబు క్లూ ఇచ్చేశారు. ఏపీలో మూడు పార్టీల కూటమికి అడుగులు పడుతున్నాయని సంకేతాల్నిచ్చారు. అయితే, బీజేపీ అధినాయకత్వానికి చంద్రబాబు తెలంగాణ, ఏపీలలో పొత్తు ప్రతిపాదన చేస్తే.. తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం టీడీపీతో ఎలాంటి పొత్తు ఉండబోదని చెబుతున్నారు. తెలంగాణలో ఎలా వున్నా ఏపీలో పొత్తు కోసమే ఎక్కువగా జనసేన, టీడీపీ తాపత్రయపడుతున్నట్లు తెలుస్తోంది. అదేసమయంలో తెలంగాణలోను ఈసారి పోటీకి దిగబోతున్నామని పలు సందర్భాలలో టీడీపీ, జనసేన నేతలు ప్రకటించారు. సో.. ఏపీ మాదిరిగానే తెలంగాణలోను మూడు పార్టీలు కలిసే అవకాశాలు లేకపోలేదు. కర్నాటక ప్రయోగం విఫలం కావడంతో తెలంగాణలో అప్రమత్తంగా వుండాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తూ వుండవచ్చు. ఎంత కాదన్నా తెలంగాణలో టీడీపీకి 15 నుంచి 18 సీట్లలో ఇప్పటికీ ఓటుబ్యాంకు వుంది. ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ సిటీలోని కొన్ని నియోజకవర్గాలలో టీడీపీ అభిమానులున్నారు. అదేసమయంలో పవన్ కల్యాణ్ అభిమానులు తెలంగాణలో కోట్ల సంఖ్యలో వున్నారు. వీరిని కలుపుకుని పోవాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తే టీడీపీ, జనసేనతో తెలంగాణలోను పొత్తు పొడిచే అవకాశాలున్నాయి. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవడం వల్లనే ఏపీలో ప్రచార పర్వాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించాలని జనసేనాని నిర్ణయించి వుండవచ్చు. విడతల వారీగా తన వారాహి పయనాన్ని నిర్వహిస్తూనే పొత్తుల చర్చల్లో పాల్గొనేందుకు వెసులుబాటు కల్పించుకోవాలన్నది పవన్ కల్యాణ్ ఆలోచన కావచ్చని తెలుస్తోంది.

Related Posts