YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గుంతకల్లు టీడీపీ నుంచి జయరామ్...?

గుంతకల్లు టీడీపీ నుంచి జయరామ్...?

అనంతపురం, ఫిబ్రవరి 23
అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిపై ఎడతెగని సస్పెన్స్ కొనసాగుతుంది. కొద్ది రోజుల క్రితం ఓ పోలీస్ అధికారి గుంతకల్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా ఉంటాడంటూ ప్రచారం జోరుగా సాగింది. తాజాగా వైసీపీ మంత్రి గుమ్మనూరు జయరాం గుంతకల్లు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో నిలుస్తారు అని ప్రచారం ఊపందుకుంది. అంతే కాకుండా తనకు ఆలూరు వైసీపీ టికెట్ రాకుండా చేసిన నలుగురు బ్రదర్స్‎ను ఖచ్చితంగా ఓడించి తీరుతానని.. అందులో ఒకరు గుంతకల్లు ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి కూడా ఉండడంతో గుమ్మనూరు శపథం చేసినట్టు కూడా ప్రచారం సాగింది.గత వారం, పది రోజుల నుంచి అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం టిడిపి అభ్యర్థి రేసులో గుమ్మనూరు జయరాం పేరు ప్రధానంగా వినిపిస్తుంది. కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ టికెట్ లేదని అధిష్టానం చెప్పడంతో సైలెంట్‎గా ఉన్న గుమ్మనూరు జయరాం చాప కింది నీరులా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఆలూరు నియోజకవర్గానికి ఆనుకునే ఉన్న గుంతకల్‎పై గుమ్మనూరు జయరాం కన్నేసినట్లు తెలుస్తోంది. గుమ్మనూరు జయరాం గుంతకల్లు నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకున్నారంటే, సరిహద్దులో ఉన్న బళ్లారిలో గుమ్మనూరు జయరాం సోదరుడు మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా కాస్తో.. కూస్తో బళ్ళారి అదేవిధంగా గుంతకల్లులో ఆయన బంధు వర్గం, సామాజిక వర్గం బలంగా ఉంది. దీంతో మంత్రి గుమ్మనూరు జయరాం గుంతకల్లు టిడిపి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గత కొద్ది రోజులుగా గుమ్మనూరు జయరాం కుమారుడు ఈశ్వర్ గుంతకల్లు టిడిపి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగితే.. గడిచిన వారం, పది రోజులుగా ఏకంగా మంత్రి గుమ్మనూరు జయరాం గుంతకల్లుకు వస్తున్నారని ప్రచారం జోరందుకుంది.గుంతకల్లు నియోజకవర్గంలో గెలుపోటములు నిర్ణయించేది బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే. అందులో కూడా ప్రధానంగా 25% ఓటు బ్యాంకు బోయ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. గుమ్మనూరు జయరాం గుంతకల్లు నుండి పోటీ చేస్తే తనకు కలిసి వస్తుంది అన్న కోణంలో పోటీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ప్రచారానికి బలం చేకూర్చే విధంగా అటు గుమ్మనూరు జయరాం సోదరుడు నారాయణ రెండు రోజుల క్రితం గుంతకల్లు వచ్చి కొంతమంది సన్నిహితులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. గుమ్మనూరు జయరాం త్వరలోనే గుంతకల్లులో పోటీ చేయబోతున్నారని ఆయన సోదరుడు నారాయణ గుంతకల్లులో ఉన్న బంధువులు, సన్నిహితులకు సంకేతాలు కూడా ఇచ్చారట. అదేవిధంగా గుంతకల్లు నియోజకవర్గానికి ప్రక్కనే ఆలూరు నియోజకవర్గం ఉండడం.. ఆలూరు నియోజకవర్గానికి చెందిన నాయకులు, ప్రజలు గుంతకల్లుతో ఎక్కువగా సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండడం కూడా గుమ్మనూరు జయరాంను గుంతకల్లు వైపు చూసేలా చేస్తుంది. అంతే కాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంతపురంలో ఏర్పాటు చేసిన సిద్ధం సభకు.. అంతకుముందు ఉరవకొండలో ఏర్పాటు చేసిన సభకు కూడా గుమ్మనూరు జయరాం గైర్హాజరవడం చూస్తుంటే జయరాం టిడిపి తీర్థం పుచ్చుకోవడం దాదాపుగా ఫిక్స్ అయినట్టే తెలుస్తోంది.

Related Posts