YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కళ తప్పినట్టేనా...

కళ తప్పినట్టేనా...

శ్రీకాకుళం, మార్చి 22
సీనియర్ నేత కళా వెంకట్రావుకు పొమ్మనలేక పొగ పెడుతున్నారా? ఆయన కుటుంబాన్ని సైతం పక్కన పెట్టారా? జిల్లాలో సీనియర్లకు టికెట్లు ఇచ్చి.. కళాకు ఇవ్వక పోవడానికి కారణం ఏంటి? కళా ఆశిస్తున్న స్థానం విషయంలో బిజెపి పట్టుబడుతోందా? అందుకే చంద్రబాబు పెండింగ్ లో పెట్టారా? ఇలా రకరకాలుగా చర్చ నడుస్తోంది. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ రెండు జాబితాలను ప్రకటించింది. తొలి జాబితాలో 94 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. రెండో జాబితాలో మరో 34 మందిని ప్రకటించింది. ఈ లెక్కన 128 మందిని ప్రకటించినట్టు అయింది. తెలుగుదేశం పార్టీకి మిగిలింది కేవలం 16 స్థానాలు మాత్రమే. దీంతో ఫైనల్ జాబితాలోనైనా కళా వెంకట్రావుకు చోటు దక్కుతుందా? లేదా? అన్న అనుమానాలు ఉన్నాయి.ఎచ్చెర్ల టికెట్ కచ్చితంగా కళా వెంకట్రావుకు దక్కుతుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఎన్నో రకాల వ్యూహాలు తెరపైకి రావడం వల్లే కళా వెంకట్రావు పేరు ప్రకటించలేదని.. విజయనగరం పార్లమెంట్ స్థానంతో పాటు కొన్ని అసెంబ్లీ సీట్లు ముడిపడి ఉండడం వల్లే కళా పేరు ప్రకటించలేదని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో కళా వెంకట్రావు సీనియర్. పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా. తూర్పు కాపు సామాజిక వర్గంలో పట్టున్న నాయకుడు కూడా.2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి తొలిసారిగా కళా వెంకట్రావు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. దీంతో తెలుగుదేశం పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో మరోసారి పోటీ చేశారు. ఎమ్మెల్యేగా గెలుపొందారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు తో పాటు మంత్రి పదవిని దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మరోసారి పోటీ చేయాలని భావించినా.. తొలి రెండు జాబితాల్లో మాత్రం ఆయనకు చోటు దక్కలేదు. పార్టీలో సీనియర్ అయినా కళాకు ఇదొక అవమానకర పరిణామం.ఎచ్చెర్ల నియోజకవర్గంలో సొంత పార్టీలోనే కళా వెంకట్రావు అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. ఈయన నాయకత్వాన్ని జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, బాబ్జి దంపతులు వ్యతిరేకిస్తున్నారు. మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు కలిశెట్టి అప్పలనాయుడు సైతం టికెట్ను ఆశిస్తున్నారు. దీంతోపార్టీ సర్వేలో కళా వెంకట్రావు వెనుకబడ్డారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ కారణం తోనే కళా వెంకట్రావు పేరు ప్రకటించలేదని తెలుస్తోంది. ముఖ్యంగా విజయనగరం ఎంపీ స్థానంతో పాటు చీపురుపల్లి అసెంబ్లీ స్థానం నుంచి కళాతో పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అయితే కళా వెంకట్రావు మాత్రం ఎచ్చెర్ల అసెంబ్లీ సీటును అడుగుతున్నట్లు తెలుస్తోంది.మరోవైపు ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానాన్ని బిజెపి సైతం ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఇక్కడ బిజెపికి నడికుదిటి ఈశ్వరరావు రూపంలో బలమైన నాయకుడు ఉన్నాడు.పూర్వాశ్రమంలో ఈయన టిడిపికి చెందిన వారే. పైగా కళా వెంకట్రావుకు శిష్యుడు కూడా. ఆర్థికంగా బలమైన నేత. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తరువాత.. బిజెపిలో చేరారు. బిజెపి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి గౌరవప్రదమైన స్థానాలు దక్కించుకోవడంలో ఎన్ఈఆర్ కృషి ఉంది. ప్రస్తుతం ఆయన విజయనగరం జిల్లా బిజెపి అధ్యక్షుడిగా ఉన్నారు. రాష్ట్ర నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అటు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో.. ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కళా వెంకట్రావును తప్పించి విజయనగరం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే అదే పార్లమెంట్ స్థానం పరిధిలోని ఎచ్చెర్ల నుంచి బిజెపి అభ్యర్థిగా నడికుదిటి ఈశ్వరరావు బరిలో దిగడం ఖాయంగా తెలుస్తోంది. మొత్తానికైతే కళాకు ఇదో ఇబ్బందికర పరిణామమే.

Related Posts