YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పాంచ్ న్యాయ్ తో కాంగ్రెస్

పాంచ్ న్యాయ్ తో కాంగ్రెస్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 5
కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసింది. ఎన్నో రోజులుగా ఊరిస్తూ వచ్చిన పార్టీ మొత్తానికి హామీలను ప్రకటించింది. పాంచ్ న్యాయ్, పచ్చీస్ గ్యారెంటీ పేరుతో ఈ మేనిఫెస్టోని విడుదల చేసింది. మొత్తం 25 హామీలు వెల్లడించింది. 48 పేజీల మేనిఫెస్టోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ విడుదల చేశారు. సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారెంటీలు చేర్చింది. దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 8 కోట్ల కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులు పంపిణీ చేస్తామని వెల్లడించింది. రిజర్వేషన్‌లపై ప్రస్తుతం ఉన్న 50% పరిమితిని తొలగిస్తామని హామీ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని తెలిపింది. వ్యవసాయ పరికరాలకు జీఎస్‌టీ మినహాయింపు ఇస్తామని హామీ ఇచ్చింది. రైల్వేల ప్రైవేటీకరణను నిలిపివేస్తామని స్పష్టం చేసింది. యువతకు 30 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించింది. అగ్నివీర్ స్కీమ్‌ని రద్దు చేస్తామని తెలిపింది. మహాలక్ష్మి పథకం ద్వారా పేద కుటుంబానికి ఏడాదికి రూ.లక్ష నగదు అందిస్తామని హామీ ఇచ్చింది. కనీస మద్దతు ధరకు లీగల్ గ్యారెంటీ కూడా ఈ  హామీల జాబితాలో ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్‌లు కల్పిస్తామని మరో ఆసక్తికర హామీని చేర్చింది. యువకులు, మహిళలతో పాటు రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఈ మేనిఫెస్టోని  రూపొందించింది కాంగ్రెస్. అన్ని వర్గాలకూ సమన్యాయం జరిగేలా చూస్తామన్న సంకేతమిచ్చేలా పాంచ్ న్యాయ్ పేరిట ఈ హామీలను తయారు చేసింది. యువ న్యాయ్, నారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, హిస్సేదారి న్యాయ్‌ పేరిట వీటిని ప్రకటించింది.
పూర్తి హామీల జాబితా ఇదే...
1. దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ డేటా ఆధారంగా ఆయా వర్గాల సంక్షేమానికి సహకరిస్తామని వెల్లడించింది.
2. రిజర్వేషన్‌లపై ఇప్పటి వరకూ ఉన్న 50% పరిమితి తొలగిస్తామని స్పష్టం చేసింది. దీంతో షెడ్యూల్ తెగలు,షెడ్యూల్ కులాలకు మేలు జరుగుతుందని వివరించింది. కులగణన తరవాత ఈ 50% పరిమితిని తొలగించేలా రాజ్యాంగంలో సవరణలు చేస్తామని తెలిపింది.
3. ఆర్థికంగా వెనకబడిన వర్గాలు వర్గానికి చెందిన వాళ్లకి విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్‌లు కల్పిస్తామని వెల్లడించింది.
4. ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాల్ని రెగ్యులరైజ్ చేయడాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ వెల్లడించింది. ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్‌లు ఇస్తామని తెలిపింది.
5. ఎలక్టోరల్ బాండ్స్‌పై విచారణతో పాటు పెగాసస్, రఫేల్ అంశాలపైనా పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని హామీ ఇచ్చింది. అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని స్పష్టం చేసింది. పాతపద్ధతిలోనే ఆర్మీ రిక్రూట్‌మెంట్ చేస్తామని వెల్లడించింది.
6. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు వ్యవసాయ పరికరాలపై జీఎస్‌టీని మినహాయిస్తామని హామీ ఇచ్చింది.
7. మహాలక్ష్మి పథకం ద్వారా పేద కుటుంబాల్లోని మహిళలకు ఏటా రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తామని భరోసా ఇచ్చింది. యువతకు 30 లక్షల ఉద్యోగాల కల్పన, పెట్రోల డీజిల్ ధరల తగ్గింపు, రైల్వే ప్రైవేటీకరణ నిలిపివేత లాంటివీ ఈ మేనిఫెస్టోలో చేర్చింది.

Related Posts