YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రామేశ్వరం నిందితుల వెనుక ఐసీస్

రామేశ్వరం నిందితుల వెనుక ఐసీస్

బెంగళూరు, ఏప్రిల్ 16,
బెంగళూరు రామేశ్వరం కేఫ్ లో జరిగిన బాంబు దాడి జస్ట్ శాంపిల్ మాత్రమేనా? నిందితుల అసలు లక్ష్యం వేరే ఉందా? దీని వెనుక నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసిస్ హస్తం ఉందా? ఈ ప్రశ్నలకు ఔననే సమాధానాలు వినిపిస్తున్నాయి.. రామేశ్వరం దాడిలో కీలక నిందితుడు అబ్దుల్ మతిన్ అహ్మద్ తాహా అని ఇప్పటికే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు ప్రకటించారు. దేశంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు కీలకంగా వ్యవహరించాడని అనుమానిస్తున్నారు. ఈ కేసులో నిందితులను పశ్చిమ బెంగాల్లో అరెస్టు చేశారు. శుక్రవారం బెంగళూరు ప్రాంతానికి తీసుకొచ్చారు. వారిని రామేశ్వరం కేఫ్ లోకి తీసుకెళ్లి విచారణ సాగించారు. కోరమంగళ ప్రాంతంలోని తాహా నివాసానికి వెళ్లి పోలీసులు తనిఖీలు చేశారు.తాహా గతంలో 2022 నవంబర్ లో మంగళూరు ప్రాంతంలో కుక్కర్ బాంబు కేసులో కీలక నిందితుడు. ఇతడికి ఐసిస్ నగదు సమకూర్చినట్టు దర్యాప్తు సంస్థ అధికారులు అనుమానిస్తున్నారు. ఇక ఇదే ఏడాది శివమొగ్గ ప్రాంతంలో జరిగిన పేలుళ్ల కేసు లోనూ ఇతడి హస్తం ఉందని తెలుస్తోంది. అంతకుముందు 2020లో ఆల్ హిందూ మాడ్యూల్ కేసులో కూడా ఇతడు ఉన్నాడు. తాహాకు దక్షిణ మధ్య భారత్ లో జరిగిన అనేక ఉగ్రవాద కేసులతో ఇతడికి సంబంధం ఉన్నట్టు, దక్షిణ మధ్య భారత్ లో జరిగిన అనేక ఉగ్రవాద కేసులతో సంబంధం ఉన్న “కర్నల్” అనే ఉగ్రవాదితో నిత్యం టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తాహాతో కలిపి బాంబర్ షాజిబ్ ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు “కర్నల్” వివరాలపై విచారణ సాగించనున్నట్టు తెలుస్తోంది. బెంగళూరులోని రామేశ్వరం కెఫెలో దాడికి ముందు వారం పాటు తాహా రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తోంది. ఇక్కడ బ్లైండ్ స్పాట్లు (సీసీ కెమెరాలు చిత్రీకరించలేని ప్రాంతాలు) గుర్తించడమే లక్ష్యంగా అతడు రెక్కీ నిర్వహించాడు. అంతేకాదు కెఫేలోకి బాంబర్ ఎలా వెళ్లాలి? ఎలా వెళ్లిపోవాలి? అనే వాటిని తాహానే నిర్ణయించాడు. పేలుడు తర్వాత తమిళనాడు నుంచి తాహా.. షాజీబ్ బెంగళూరు నుంచి పరారయ్యేందుకు మార్గాలు కూడా ముందుగానే ఎంపిక చేసుకున్నారు.తాహా, షాజిబ్ కు పశ్చిమ బెంగాల్లో ఒక వ్యక్తి సాయం చేసినట్టు తెలుస్తోంది. రామేశ్వరం కేఫ్ ఘటనలో చెన్నైలో అరెస్టయిన ముజమ్మిల్ షరీఫ్ నిందితులకు పలు విధాలుగా సహకారం అందించినట్లు తెలుస్తోంది. కేఫ్ లో పేలుడు అనంతరం నిందితులు ఝార్ఖండ్ రాజధాని రాంచీలో వారం పాటు ఉన్నారు. ఆ తర్వాత కోల్ కతా వెళ్లిపోయారు. అక్కడ షరీఫ్ వారిని కలిశాడు. నగదు అందించాడు. దీంతో వారు హోటళ్లు మారుతూ కోల్ కతా లోనే ఉన్నారు. దాడి అనంతరం కొద్ది రోజులు దర్యాప్తు పేరుతో హడావిడి జరిగినప్పుడు నిందితులు భయపడ్డారు. షరీఫ్ నగదు ఇవ్వడంతో తాహా, షాజిబ్ కోల్ కతా, డార్జిలింగ్, పురులియా ఇతర ప్రాంతాల్లో తిరిగారు. వాటికోసం చెల్లింపులను పూర్తిగా నగదు రూపంలోనే చేశారు. దర్యాప్తు సంస్థల అధికారులు ఒకవేళ వస్తే కోల్ కతా మీదుగా బంగ్లాదేశ్ వెళ్లిపోయేందుకు నిందితులు ప్రణాళిక రూపొందించుకున్నట్టు తెలుస్తోంది.ఇదే సమయంలో 35 సిమ్ లు, తప్పుడు ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ తో దర్యాప్తు సంస్థల అధికారులను తికమక పెట్టడానికి ప్రయత్నించారు. కోల్ కతా లోని ఎస్ – ప్లనేడ్ ప్రాంతంలో కొద్దిరోజుల పాటు ఉన్నారు. ఈ క్రమంలో ఆ ఇద్దరిలో ఓ నిందితుడి ఫోన్ లో సమస్య ఎదురయింది. దీంతో ఆ ఫోన్ ను చాందిని చౌక్ మార్కెట్ లోని ఓ దుకాణంలో రిపేర్ కు ఇచ్చారు. ఫోన్ లో ఉన్న మైక్రోఫోన్ లో ఏదైనా సమస్య ఉందా? అని తెలుసుకునేందుకు సెల్ ఫోన్ షాప్ ఓనర్ తన దగ్గరున్న ఫోన్ లో సిమ్ కార్డు పెట్టి చూసాడు. అప్పటికే ఆ ఫోన్ ను ట్రాక్ చేస్తున్న పోలీసులు.. సిమ్ కార్డ్ నుంచి సిగ్నల్స్ రావడంతో వెంటనే అప్రమత్తమయ్యారు. సిగ్నల్స్ ఆధారంగా మొబైల్ షాప్ నకు చేరుకున్నారు. ఆ షాపు యజమాని నుంచి సమాచారం సేకరించారు. చివరికి కోల్ కతా నగర శివారు ప్రాంతంలోని దిఘా అనే ఏరియాలో హోటల్ లో ఉన్న నిందితులను అరెస్టు చేశారు.

Related Posts