YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రేవంత్ పరువు నిలబడుతుందా

రేవంత్ పరువు నిలబడుతుందా

హైదరాబాద్, ఏప్రిల్ 20,
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీలో కుదురుకున్నారు. ఆయనకు ప్రస్తుతం పార్టీలో మరో నేత పోటీలో లేనే లేరు. ఎన్నికలకు ముందు బాహాటంగా విమర్శించిన నేతలు సయితం ఇప్పుడు రేవంత్ పై పదే పదే ప్రశంసలు కురిపిస్తున్నారు. హైకమాండ్ వద్ద మంచి మార్కులే కొట్టేశారు. రేవంత్ సారధ్యంలోనే పార్టీ పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో సహజంగా హైకమాండ్ కూడా ఆయన మాటకు విలువిస్తుంది. అందుకే ఆయన చెప్పిన వాళ్లకే లోక్ సభ టిక్కెట్లు కూడా ఇచ్చారంటారు. పట్టుబట్టి కొన్ని స్థానాలకు ఆయన తాను ప్రతిపాదించిన వారి పేర్లను రేవంత్ రెడ్డి రెడ్డి ఓకే చేయించుకుని వచ్చారంటే నమ్మకం ఆయన అలా సంపాదించుకున్నట్లే లెక్క. అయితే ఇప్పుడే పూర్తి కాలేదు. పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించపెట్టడం కూడా ఆయన భుజస్కంధాలపైనే ఉంది. నేతలందరితో కలుపుకుని పోతూ వారి సహకారంతో అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మంత్రి పదవులు ఇంకా భర్తీ చేయాల్సి ఉంది. లోక్ సభ ఎన్నికల తర్వాత వాటిని భర్తీ చేస్తామని, అందరూ కష్టించి పనిచేయాలని నేతలకు ఎవరికి వారిని ఉత్సాహపరుస్తున్నారు. తెలంగాణ శాసనభ ఎన్నికలు జరిగిన వందరోజుల్లోనే పార్లమెంటు ఎన్నికలు జరుగుతుండటంతో ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు సాధిస్తుందని టెన్ జన్ పథ్ కూడా లెక్కలు వేసుకుంటుందట.  కానీ ఏమాత్రం తేడా వచ్చినా సరే.. రేవంత్ పదవికి ఎసరు వచ్చినా ఆశ్చర్యం లేదన్న ప్రచారాన్ని ఆయన ప్రత్యర్థులు జోరుగా చేస్తున్నారు. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడపాలన్నా, ఇతర పార్టీలలోకినేతలు వెళ్లకుండా చూడాలన్నా రేవంత్ రెడ్డి వంటి లీడర్ అవసరమని పార్టీ కేంద్ర నాయకత్వం భావిస్తుంది. ఏమాత్రం తప్పుడు నిర్ణయం ఢిల్లీ పెద్దలు తీసుకుంటే తెలంగాణలో ప్రభుత్వంపై ప్రభావం చూపే అవకాశముందని కూడా చెబుతున్నారు. ప్రభుత్వాన్ని కూల్చేయడానికి కాచుక్కూర్చున్న వారికి కాంగ్రెస్ అధినాయకత్వం ఆ అవకాశం ఇవ్వదని గట్టిగా రేవంత్ సన్నిహితులు నమ్ముతున్నారు. అందుకే రేవంత్ రెడ్డికి ఫలితాలతో పెద్దగా ఆందోళన చేయాల్సిన అవసరం లేదన్న వాదన కూడా వినిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ ను కదిలస్తే మరొక సమర్థమైన నేత వచ్చి కుదరుకోవడానికి ఇబ్బంది పడతారన్నది అంతే వాస్తవం. ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి పదవికి ముప్పు వచ్చే అవకాశం మాత్రం ఇంచుకూడా లేదన్నది ఆయన సన్నిహితుల వాదనగా వినిపిస్తుంది. కానీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కు తక్కువ స్థానాలు వస్తే మాత్రం రేవంత్ పరపతి ఢిల్లీ స్థాయిలో తగ్గే అవకాశాలున్నాయని, అప్పుడు ఏ విషయంలోనైనా రేవంత్ చెప్పే మాటలకు విలువఉండదన్న అభిప్రాయం మాత్రం ఉంది. అందుకే రేవంత్ రెడ్డి కనీసం పది నుంచి పన్నెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేలా వ్యూహరచన చేస్తున్నారు. అందుకోసం ఆయన ప్రతి నియోజకవర్గానికి తనకు అత్యంత నమ్మకమైన నేతలను నియమించుకుని ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందన్నది జూన్ 4వ తేదీన మాత్రమే చూడాల్సి ఉంటుంది.

Related Posts