YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తమ్ముడి కోసం రంగంలోకి అన్నయ్య

తమ్ముడి కోసం రంగంలోకి అన్నయ్య

విజయవాడ, ఏప్రిల్ 26
అన్నయ్య రంగంలోకి దిగుతున్నారు. తమ్ముడి కోసం ప్రచారం చేయాలని డిసైడ్ అయ్యారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కు మద్దతుగా మెగా కాంపౌండ్ వాల్ హీరోలంతా రంగంలోకి దిగనున్నారు. ఈ మేరకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. అయితే అందరికంటే చిరంజీవి ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని తెలియడంతో మెగా అభిమానుల్లో సందడి నెలకొంది. పొలిటికల్ సర్కిల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. అయితే నాడు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి అయిన వంగా గీతకు మద్దతుగా చిరంజీవి పిఠాపురంలో ప్రచారం చేశారు. ఆమె ఎమ్మెల్యేగా కూడా గెలిచింది. ఇప్పుడు అదే వంగా గీతకు వ్యతిరేకంగా, పవన్ కు అనుకూలంగా చిరంజీవి ప్రచారానికి రానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కు నిరాశే ఎదురయ్యింది. ఆయన రెండు చోట్ల ఓడిపోయారు. ఈసారి మాత్రం ఆ పరిస్థితి రాకూడదని గట్టిగానే డిసైడ్ అయ్యారు. తనను ఓడించేందుకు వైసిపి ఎంతకైనా తెగిస్తుందన్న అంచనాకు వచ్చారు. అందుకే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అశేష జనవాహిని నడుమ నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే పవన్ కు మద్దతుగా బుల్లితెర నటులు ప్రచారం చేస్తున్నారు. స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగారు.ఇప్పుడు మెగా హీరోలంతా వస్తుండడంతో పిఠాపురంలో వార్ వన్ సైడ్ అవుతుందని జనసైనికులు భావిస్తున్నారు.కొద్దిరోజుల కిందట చిరంజీవి జనసేనకు ఐదు కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. పవన్ కళ్యాణ్ కు అందజేశారు. జనసేనకు ఓటు వేయాలని మెగా అభిమానులకు స్పష్టమైన సంకేతాలు పంపగలిగారు. అయితే అనకాపల్లి నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్,పెందుర్తి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ బాబు చిరంజీవిని కలిశారు.మద్దతు కోరారు.వారిని ఆశీర్వదించిన చిరంజీవి కూ టమి అభ్యర్థులను గెలిపించాలని ఒక వీడియో బయటకు విడుదల చేశారు. దీనిపై వైసీపీ నేతలు ఎంత రచ్చ చేయాలో.. అంతలా చేశారు.పిఠాపురం నియోజకవర్గానికి, మెగా కుటుంబానికి మంచి సంబంధం ఉంది. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి వంగా గీత పోటీ చేశారు. నాడు ఆమె కోసం చిరంజీవి ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో గీత విజయం సాధించారు. ఇప్పుడు అదే నియోజకవర్గాన్ని పవన్ ఎంచుకున్నారు. వంగా గీత ఇప్పుడు ప్రత్యర్థిగా మారారు. ఇప్పుడు పవన్ కు మద్దతుగా చిరంజీవి ప్రచారం చేయనున్నారు. మే 5 ఇందుకు ముహూర్తం గా నిర్ణయించారు. చిరంజీవితో పాటు మెగా హీరో రామ్ చరణ్ వస్తున్నట్లు తెలుస్తోంది. బాబాయ్ కోసం ఈ కుర్ర హీరో రంగంలో దిగనున్నట్లు సమాచారం.
చిరంజీవితో పాటు నాగబాబు, రామ్ చరణ్ కలిసి పిఠాపురంలో భారీ రోడ్ షో నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత రాజకీయ వేదికలపైకి చిరంజీవి వస్తుండడంతో మెగా ఫాన్స్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్నారు. సమకాలీన రాజకీయ అంశాలపై మాట్లాడతారా? మాట్లాడితే జగన్ పై ఎటువంటి కామెంట్స్ చేస్తారు? చంద్రబాబు గురించి ఏమైనా వ్యాఖ్యానిస్తారా? లేకుంటే పవన్ ను గెలిపించాలని మాత్రమే అడుగుతారా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.

Related Posts