YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కోటి దాటేసిన హైదరాబాద్ ఓటర్లు

కోటి దాటేసిన హైదరాబాద్ ఓటర్లు

హైదరాబాద్, ఏప్రిల26 (న్యూస్ పల్స్)
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓటర్ల సంఖ్య కోటి దాటింది. తెలంగాణ మొత్తం ఓటర్లలో ఇది 30 శాతంగా ఉంది. కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓటింగ్ శాతం కనిష్టంగానే నమోదు అవుతుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య కోటి దాటింది. వేగంగా విస్తరిస్తున్న నగరంతో పాటు ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 2019 లోక్ సభ ఎన్నికల నుంచి ప్రస్తుతం జరగనున్న ఎన్నికల వరకు సుమారు 15 లక్షల మందికి పైగా కొత్త ఓటర్లు నమోదు అయినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు.ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం... ప్రస్తుతం గ్రేటర్ లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఓటర్ల సంఖ్య 1.05 కోట్లు దాటింది. మొత్తం తెలంగాణ ఓటర్లలో ఇది 30% ఉంటుందని అంచనా.ప్రధాన పార్టీల గెలుపోటములను ప్రభావితం చేసే ఓటర్ల సంఖ్య ఉన్నప్పటికీ... గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం ఓటింగ్ శాతం మాత్రం సగం దాటి ముందుకు వెళ్లడం లేదు. ఈ క్రమంలోనే నగరంలోని ఓటర్లలో అవగాహన పెంచేందుకు ఎన్నికల కమిషన్ ఇప్పటికే పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ప్రధాన కూడళ్లు, బస్ స్టేషన్ ,రైల్వే స్టేషన్, తదితర ప్రాంతాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు, వీధి నాటకాలు, తదితర కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టింది. మరోవైపు కాలనీ సంక్షేమ సంఘాలు, సీనియర్ సిటిజన్ సంఘాలు, ఫారం ఫర్ గుడ్ గవర్నెన్స్ వంటి ప్రధాన సంస్థలు ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు విశేషంగా కృషి చేస్తున్నాయి. ఎన్నికల గడువు సమీపిస్తున్నప్పటికీ రాజకీయ పార్టీల ప్రచారం మాత్రం ఇంకా జోరు అందుకోలేదు. గత అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజుల ముందు నుంచే ప్రచారాలు మొదలు పెట్టినప్పటికీ......ఈసారి ఎన్నికల్లో మాత్రం అలా కనిపించడం లేదు.ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం... 2019 లోక్ సభ ఎన్నికల నాటికి గ్రేటర్ లో 90.47 లక్షల మంది ఓటర్లు ఉంటే గతేడాది నవంబర్ నాటికి ఆ సంఖ్య 99 లక్షలకు చేరింది. ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 1.05 కోట్లకు చేరింది. అంటే ఈ లోక్ సభ ఎన్నికల్లో 15 లక్షల మంది కొత్తగా తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో 45.7 లక్షలు, రంగారెడ్డి జిల్లాలో 31 లక్షలు, మేడ్చల్ జిల్లాలో 21.78 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.ఈ మొత్తం ఓటర్లలో 54.2 లక్షల మంది పురుషులు ఉండగా...... 51.23 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 7.4 లక్షల మంది ఓటర్లు ఉండగా... చార్మినార్ పరిధిలో అత్యల్పంగా 2.28 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. లోక్ సభ ఎన్నికలు జరగనున్న హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి ,నియోజకవర్గాల్లో ఈ ఓటర్లు ఏ పార్టీకి పట్టం కట్టనున్నారో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. కోటికి పైగా ఓటర్లు ఉన్న గ్రేటర్ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో ఏ పార్టీ ముందంజలో ఉంది? నగర ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా కాంగ్రెస్)ప్రభంజనం కనిపించినా.. హైదరాబాద్ ఓటర్లు మాత్రం బిఆర్ఎస్ కే పట్టం కట్టారు.గ్రేటర్ ఓటర్ల తీరు....పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగానే మారింది. సాధారణంగానే మధ్యతరగతి, ఆపై వర్గాలు ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంటున్నారు. వాసి కంటే రాశి ఎక్కువ అన్నట్టు...ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ ఓటింగ్ లో పాల్గొనేవారు తక్కువ. మరోవైపు ప్రతిసారి ఎన్నికల సందర్భంగా లక్షలాది మంది నగరవాసులు సొంతుల్లకు వెళతారు. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. చాలామందికి హైదరాబాద్ తో పాటు సొంత ఊళ్లలో కూడా ఓటు హక్కు ఉన్నాయి. ఊరిలో ఓటు వేయడం ద్వారా తమ ఉనికిని చాటుకునేందుకు ఎక్కువ మంది నగర వాసులు సొంతూళ్లకు వెళతారు. ఈసారి మే 13న జరిగిన లోక్ సభ ఎన్నికలకు సైతం నగరవాసులు....ఏపీలో సొంతుళ్లకూ పెద్ద సంఖ్యలో తరలి వెళ్లే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ లో ఈసారి మునుపటి కన్నా తక్కువగా నమోదు అయ్యే అవకాశం లేకపోలేదని పలు సంస్థలు చెబుతున్నాయి.

Related Posts