YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం

బొర్రా గుహాల్లో నిఫా భయం

 బొర్రా గుహాల్లో  నిఫా భయం

బొర్రాగుహలు పర్యాటకుల గుండెల్లో టెర్రర్‌ పుట్టిస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ బొర్రా గుహల్లో వేల సంఖ్యలో గబ్బిలాలు ఆవాసాలు ఏర్పరుచుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాలను వణికిస్తున్న ప్రాణాంతక నిపా వైరస్‌కు గబ్బిలాలే కారణమని శాస్త్రవేత్తలు తేల్చిన నేపథ్యంలో ఇప్పుడు బొర్రాగుహల సందర్శనపై పర్యాటకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. బొర్రా గుహలకు రోజుకు సగటున నాలుగు వేల మంది పర్యాటకులు వస్తుంటారు. శని, ఆదివారాల్లో అయితే ఆరు వేల మంది వరకు సందర్శిస్తుంటారు. బొర్రా గుహలకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాదు... విదేశీయుల తాకిడి కూడా అధికంగా ఉంటుంది. బొర్రా గుహలను సందర్శించే వారిలో కేరళ వాసులు కూడా ఉన్నారు. గబ్బిలాల ద్వారా నిపా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఇప్పుడు బొర్రా గుహల సందర్శనకు వెళ్లే పర్యాటకుల్లో అలజడి రేగుతోంది. గబ్బిలాల జాడ అంతగా లేని ప్రదేశాల్లోనే నిపా వైరస్‌పై యంత్రాంగం అప్రమత్తం చేసింది. అలాంటిది వేల సంఖ్యలో గబ్బిలాలుండే బొర్రాగుహల్లోకి వేలాదిగా పర్యాటకులు వెళ్తుండడమే వీరిలో ఆందోళనకు కారణమవుతోంది. గబ్బిలాలు అరటి, మామిడి, నేరేడు, జామ తదితర పండ్లను తింటాయి. తాటి, ఈత, జీలుగు కల్లును కూడా తాగుతాయి. నిపా వైరస్‌ కలిగిన గబ్బిలాలు తిన్న పండ్లను, తాగిన కల్లును ఇతరులు తింటే వారికీ ఈ వైరస్‌ సోకుతుంది. ఈ నేపథ్యంలో బొర్రాగుహల ప్రాంతంలో పక్షులు కొరికిన/గాట్లున్న పండ్లను విక్రయించవద్దని, తినవద్దని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇప్పటికే స్థానికులకు సూచించారు.నిపా వైరస్‌తో కేరళ రాష్ట్రంలో ఇప్పటికే 12 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరెందరో ఈ వ్యాధికి గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా ఈ వైరస్‌కు మందు కనిపెట్టలేదు.ఒక్కసారి ఈ వైరస్‌ సోకినట్టయితే ఆ వ్యక్తికి మరణం ఖాయమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంతటి ప్రమాదకర వైరస్‌కు గబ్బిలాలే మూలమని స్పష్టం కావడంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఎంతో అప్రమత్తంగా ఉంటున్నాయి. మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల యంత్రాంగాలు దీనిపై అలెర్టయ్యాయి. ఈ గబ్బిలాలు గుహలు, మర్రిచెట్లు, రావిచెట్లు, చీకటి ప్రాంతాల్లో జనానికి దూరంగా నివసిస్తాయి.  ఇప్పుడు అందరి కళ్లూ బొర్రా గుహలపైనే పడ్డాయి. ఎంతో విశాలంగా ఉండే బొర్రా గుహల్లో వేలకొద్దీ గబ్బిలాలు వేలాడుతూ ఉంటాయి. పగటి పూట వీటికి కళ్లు కనిపించవు. అందువల్ల రాత్రి వేళ బయటకు వెళ్లి పండ్లను తింటూ పగటి పూట ఈ గుహల్లో సేదతీరుతాయి. పర్యాటకులు బొర్రా గుహల్లోకి వెళ్లినప్పుడు ఇవి స్పష్టంగా కనిపిస్తుంటాయి. వేల సంఖ్యలో ఉండడం వల్ల ఈ గుహల్లో ఎప్పుడూ గబ్బిలాల విసర్జితాలతో ఒకింత దుర్వాసన కూడా వస్తుంది. అయినప్పటికీ గుహల అందాలను ఆస్వాదించడానికి పర్యాటకులు పోటెత్తుతుంటారు. గుహల ప్రవేశ ప్రాంతంకంటే లోపల మరింతగా చిమ్మచీకటి అలముకుంటుంది. దీంతో గబ్బిలాల ఆవాసానికి ఈ బొర్రాగుహలు ఎంతో అనువుగా ఉంటాయి.

Related Posts