లక్నో, మే 16,
ఆ రాష్ట్రం దేశానికి అనేక మంది ప్రధాన మంత్రులను అందజేసింది. అసలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ముందు ఆ రాష్ట్రంలో గెలవాలి అంటారు. అదే ఉత్తర్ ప్రదేశ్. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, అతిపెద్ద రాష్ట్రంలో పెద్ద ప్రాంతీయ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సహా పలువురు కీలక నేతలు ఈ రాష్ట్రం నుంచే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అందుకే వారు పోటీ చేసే నియోజకవర్గాలు దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు, ఆసక్తికి కారణమయ్యాయి. మొత్తం 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్‌లో ముఖ్యనేతలు పోటీ చేస్తున్న ఆ 8 నియోజకవర్గాలపై ఓ ఫోకస్.
వారణాసి..
భారత ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న నియోజకవర్గం వారణాసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందూ మతంలో అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటిగానే కాదు, భూమ్మీద వేల ఏళ్లుగా మనుగడలో ఉన్న చారిత్రక నగరంగానూ వారణాసి ప్రసిద్ధిగాంచింది. 2014లో మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్‌లోని వడోదర లోక్‌సభ నియోజకవర్గంతో పాటు వ్యూహాత్మకంగా వారణాసిలోనూ పోటీ చేశారు. ఈ చర్య ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధిక సీట్లు గెలుపొంది కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు దోహదపడింది. 2019లో మరోసారి పోటీ చేసి గెలుపొందగా, ఇప్పుడు మూడోసారి మోదీ మళ్లీ పోటీ చేస్తున్నారు. జూన్ 1న చివరి విడతలో భాగంగా పోలింగ్ జరుపుకోనున్న ఈ నియోజకవర్గంలో మోదీని మరింత భారీ మెజారిటీతో గెలిపించడం కోసం పార్టీ శ్రేణులు శ్రమిస్తున్నాయి. మోదీని ఓడించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా జట్టుకట్టిన విపక్షాలు.. ఈ నియోజకవర్గంలోనూ ఐక్య పోరాటం చేస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌ను గెలిపించడం కోసం ఆ పార్టీతో పాటు రాష్ట్రంలో బలమైన ప్రాంతీయ పార్టీ సమాజ్‌వాదీ కూడా శ్రమిస్తోంది. అజయ్ రాయ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగానూ ఉన్న విషయం గమనార్హం. “అబ్‌కీ బార్ దస్ లాఖ్ పార్” అంటూ మొత్తం 10 లక్షల ఓట్లు దాటి మోదీకి పోలయ్యేలా రాజకీయ నినాదంతో బీజేపీ కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తద్వారా 7 లక్షలకు పైగా మెజారిటీ సాధించవచ్చన్నది వారి ఆలోచనగా కనిపిస్తోంది. 1991 నుంచి ఈ స్థానంలో బీజేపీయే గెలుపొందుతూ వస్తున్నప్పటికీ 2004లో మాత్రం ఓటమిపాలైంది. మోదీ హయంలో కాశీలో జరిగిన అభివృద్ధి, కాశీ విశ్వనాథ్ కారిడార్ ఏర్పాటు, నగరంలో మౌలిక వసతులు, విమానాశ్రయం, రైల్వే స్టేషన్ల అభివృద్ధి, ఆధునీకరణతో పాటు నగరంలో ఎక్కడికక్కడ వంతెనల నిర్మాణం గురించి కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. అలాగే నిర్మాణంలో ఉన్న క్యాన్సర్ ఆస్పత్రి, క్రికెట్ స్టేడియం, నగరంలో అమలు చేస్తున్న పరిశుభ్రత వంటివి కూడా కలిసొచ్చే అంశాలు. కొన్ని దశాబ్దాలుగా ఈ నగరాన్ని సందర్శిస్తున్న దేశ, విదేశీ యాత్రికులు నగరంలో చోటుచేసుకుంటున్న మార్పులు, జరుగుతున్న అభివృద్ధి, పెరిగిన మౌలిక వసతులను ప్రత్యక్షంగా గమనిస్తున్నారు.
అమేధీ..
కాంగ్రెస్ యువరాజుగా పేరొందిన రాహుల్ గాంధీ గత 2 దశాబ్దాలుగా పోటీ చేస్తూ వచ్చిన నియోజకవర్గమే అమేధీ. రాయ్‌బరేలికి ఆనుకుని ఉన్న ఈ నియోజకవర్గంలో ఆయన 2004 నుంచి పోటీ చేస్తూ వరుసగా 3 పర్యాయాలు గెలుపొందారు. అయితే 2019లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఆయన ఓడిపోయి పరాభవాన్ని ఎదుర్కొన్నారు. అయితే ఆయన కేరళలోని వాయనాడ్ స్థానం నుంచి కూడా పోటీ చేయడం, అక్కణ్ణుంచి గెలుపొందడంతో కొంత ఊరట లభించింది. ఈసారి అమేధీలో రాహుల్ గాంధీ మరోసారి పోటీ చేస్తారా లేదా అన్న ఉత్కంఠ నిన్నమొన్నటి వరకు నెలకొంది. చివరకు అమేధీ నుంచి తప్పుకుని, కిశోరీలాల్ శర్మకు చోటిచ్చారు. నాలుగు దశాబ్దాల తర్వాత గాంధీ-నెహ్రూ కుటుంబానికి చెందని వ్యక్తి కాంగ్రెస్ తరఫున తొలిసారిగా పోటీ చేస్తున్నారు. రాహుల్ గాంధీ తనను 2019లో గెలిపించిన వాయనాడ్‌తో పాటు తన తల్లి సోనియా గాంధీ వదిలిపెట్టిన రాయ్‌బరేలి నుంచి కూడా బరిలోకి దిగారు. ప్రధాన మంత్రులను అందిస్తూ, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రంలో రాహుల్ గాంధీ పోటీకి విముఖత వ్యక్తం చేసినప్పటికీ.. పార్టీలో ఇతర సీనియర్ నేతల ఒత్తిడి, మిత్రపక్షాల ఒత్తిడితో సేఫ్ సీటుగా పరిగణిస్తున్న రాయ్‌బరేలిని ఆయన ఎంచుకున్నారు. నిజానికి రాహుల్ గాంధీతో పాటు ఆయన సోదరి ప్రియాంక వాద్రా కూడా పోటీ చేయాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేశాయి. తల్లి వదిలిపెట్టిన రాయ్‌బరేలి నుంచి ప్రియాంక, తన పాత స్థానం అమేఠీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారని ఊహాగానాలు కూడా చెలరేగాయి. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. తమ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కిశోరీలాల్ శర్మ (కేఎల్ శర్మ)ను అమేధీ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. జన్మతః పంజాబీ అయిన కేఎల్ శర్మ.. రాహుల్ గాంధీ జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న అమేఠీ నియోజకవర్గంలో రాహుల్ గాంధీకి ప్రతినిధిగా పనిచేశారు. అలా నియోజకవర్గ ప్రజలతో 2 దశాబ్దాల అనుబంధం ఆయనకు ఉంది. అది కలిసొచ్చి స్మృతి ఇరానీని ఓడిస్తుందా లేక రాహుల్ గాంధీకి జరిగిన పరాభవమే ఆయన కూడా ఎదుర్కోవాల్సి వస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
రాయ్ బరేలి..
దేశంలోని హై-ప్రొఫైల్ నియోజకవర్గాల్లో రాయ్ బరేలి ఒకటి. యూపీఏ చైర్‌పర్సన్‌గా ప్రధాని కార్యాలయాన్ని సైతం తన గుప్పిట్లో పెట్టుకుని చక్రం తిప్పిన సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గమే రాయ్ బరేలి. వయోభారం దృష్ట్యా ప్రత్యక్ష ఎన్నికలకు దూరమై, ఆమె రాజస్థాన్ నుంచి పెద్దల సభ రాజ్యసభకు ఎన్నికయ్యారు. అందుకే ఈసారి రాయ్‌బరేలి నుంచి ఎవరు పోటీ చేస్తారా అన్న ఉత్కంఠ నెలకొనగా.. గాంధీ-నెహ్రూ కుటుంబ కంచుకోటగా పేరొందిన ఈ స్థానం నుంచి రాహుల్ గాంధీనే అభ్యర్థిగా ప్రకటిస్తూ ఏఐసీసీ ఉత్కఠకు తెరదించింది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీన ఆయన తన నామినేషన్ పత్రాలను అందజేశారు. 2019లో సోనియా గాంధీపై పోటీ చేసి, గట్టి పోటీనిచ్చిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దినేశ్ ప్రతాప్‌కే ఈసారి కూడా టికెట్ లభించింది. అమేఠీలో 2019లో రాహుల్ గాంధీని స్మృతి ఇరానీ ఓడించినట్టుగా ఈసారి తాను రాయ్‌బరేలీలో ఓడించి సరికొత్త రికార్డు సృష్టించాలని దినేశ్ ప్రయత్నిస్తున్నారు. అమేఠీలో సాధ్యపడిన విజయం ఇక్కడెందుకు సాధ్యపడదు అన్న ఆత్మవిశ్వాసంతో ఆయన వడివడిగా ముందుకు సాగుతున్నారు. అయితే తన సోదరుడి విజయం కోసం ప్రియాంక వాద్రా ఈ నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టి ప్రచారం చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
లఖ్‌నవూ..
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని లఖ్‌నవూ సైతం దేశంలోని హై-ప్రొఫైల్ నియోజకవర్గాల్లో ఒకటి. ప్రస్తుతం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గం సుదీర్ఘకాలంగా బీజేపీకి కంచుకోటగా మారింది. 1991 నుంచి వరుసగా బీజేపీయే ఇక్కడ గెలుపొందుతూ వస్తోంది. 1991, 1996, 1998, 1999, 2004 ఎన్నికల్లో బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్‌పేయి వరుసగా గెలుపొందుతూ వచ్చారు. అలా దేశానికి ప్రధానిని అందించిన నియోజకవర్గాల్లో ఒకటిగా నిలిచిన ఈ స్థానంలో 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలుపొందిన రాజ్‌నాథ్ సింగ్, మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు. ప్రస్తుతానికి దేశవ్యాప్త ప్రచారంలో రాజ్‌నాథ్ సింగ్ బిజీగా ఉన్న నేపథ్యంలో ఆయన బృందం స్థానికంగా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో ఉండడం, లఖ్‌నవూ నగరాభివృద్ధిలో రాజ్‌నాథ్ సింగ్ కీలక పాత్ర పోషించడం బీజేపీకి కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి. ఆయనపై సమాజ్‌వాదీ పార్టీ నుంచి రవిదాస్ మెహ్రోత్రా పోటీ చేస్తున్నారు. 2014 కంటే 2019లో మెజారిటీని మరింత పెంచుకున్న రాజ్‌నాథ్ సింగ్ ఈ ఎన్నికల్లో ఎంత మెజారిటీ సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
కన్నౌజ్..
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పోటీ చేస్తున్న కన్నౌజ్ నియోజకవర్గం కూడా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. మే 13న జరగనున్న నాలుగవ విడత పోలింగ్‌లో ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగాయి. తొలుత ఈ నియోజకవర్గం నుంచి ములాయం పరివారానికి చెందిన తేజ్ ప్రతాప్ యాదవ్ పేరును అభ్యర్థిగా ప్రకటించారు. అయితే నామినేషన్ల దాఖలుకు తేదీ సమీపించిన తర్వాత అకస్మాత్తుగా అఖిలేశ్ తెరపైకి వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ ఇక్కడ సుబ్రతా పాఠక్‌ను అభ్యర్థిగా బరిలోకి దించింది. సుబ్రతా పాఠక్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో అఖిలేశ్ సతీమణి డింపుల్ యాదవ్‌ను 12,353 ఓట్ల స్వల్ప తేడాతో ఓడించగలిగారు. ఇప్పుడు అఖిలేశ్ స్వయంగా రంగంలోకి దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది.
మైన్‌పురి..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మైన్‌పురి లోక్‌సభ స్థానం యావద్దేశం దృష్టిని ఆకర్షించడానికి కారణం ఒక్కటే.. అది సమాజ్‌వాదీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ రెండున్నర దశాబ్దాలకు పైగా ప్రాతినిథ్యం వహించడంతో పాటు ఇప్పుడు ఆయన కోడలు డింపుల్ యాదవ్ పోటీ చేస్తుండడమే. మే 7న జరగనున్న 3వ విడత పోలింగ్‌లో ఈ నియోజకవర్గం ఉంది. గత 26 ఏళ్లుగా యాదవ్ పరివార్ (ములాయం సింగ్ యాదవ్ కుటుంబం) ఇక్కడ అధికారంలో ఉంది. 2022లో ములాయం మరణించిన తర్వాత ఆ స్థానానికి జరిగిన ఉప-ఎన్నికల్లో ములాయం కోడలు (అఖిలేశ్ యాదవ్ సతీమణి) డింపుల్ యాదవ్ పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆమె మరోసారి పోటీ చేస్తున్నారు. ఆమెకు ప్రత్యర్థిగా భారతీయ జనతా పార్టీ (BJP) నుంచి జైవీర్ సింగ్ బరిలో నిలిచారు. ఆయన ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు. మైన్‌పురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈసారి గెలుపు ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
సుల్తాన్‌పూర్..
గాంధీ-నెహ్రూ కుటుంబంలో మనేకా గాంధీ పోటీ చేస్తుండడంతో సుల్తాన్‌పూర్ నియోజకవర్గం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సోనియా గాంధీకి తోడికోడలైన మనేకా గాంధీ మోదీ సర్కారులో కేంద్ర మంత్రిగానూ పనిచేసిన విషయం తెలిసిందే. 2014లో పీలీభీత్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందిన మనేకా గాంధీ, 2019లో సుల్తాన్‌పూర్‌కు మారారు. అప్పటి వరకు ఈ నియోజకవర్గ ఎంపీగా ఉన్న మనేకా కుమారుడు వరుణ్ గాంధీ, పీలీభీత్ నుంచి 2019లో ఎన్నికయ్యారు. అంటే తల్లీకొడుకులు తమ నియోజకవర్గాలను మార్చుకున్నారు. కానీ వరుణ్ గాంధీ వ్యవహారశైలి, సొంతపార్టీ అగ్రనాయకత్వంపై చేసిన విమర్శల కారణంగా బీజేపీ అధిష్టానం ఈసారి ఆయనకు టికెట్ నిరాకరించింది. ఈ పరిస్థితుల్లో సుల్తాన్‌పూర్‌లో మరోసారి పోటీ చేస్తున్న మనేకా గాంధీపై సమాజ్‌వాదీ పార్టీ నుంచి రాంభువల్ నిషాద్, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఉదయ్ రాజ్ వర్మ పోటీ చేస్తున్నారు.
గోరఖ్‌పూర్..
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సుదీర్ఘకాలం ప్రాతినిథ్యం వహించిన ఈ నియోజకవర్గం కూడా దేశవ్యాప్తంగా ఉన్న హై-ప్రొఫైల్ నియోజకవర్గాల్లో ఒకటి. జూన్ 1న జరగనున్న చివరి విడత పోలింగ్‌లో ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. యోగీ ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆయన ఈ స్థానం నుంచి వరుసగా 5 పర్యాయాలు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఈ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నది భోజ్‌పురి సూపర్‌స్టార్ రవి కిషన్. తెలుగువారికి “రేసు గుర్రం” సినిమాలో విలన్ క్యారెక్టర్ మద్దాలి శివారెడ్డిగా సుపరిచితుడు. ఆయనపై పోటీగా సమాజ్‌వాదీ పార్టీ కాజల్ నిషాద్‌ను బరిలోకి దించింది.