YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం

ఎక్కువ ఫ్యాట్‌తో ఎక్కువ ఆరోగ్యం..

ఎక్కువ ఫ్యాట్‌తో ఎక్కువ ఆరోగ్యం..

- అన్నం, చపాతీలు, పండ్లు, స్వీట్లు నిషేధం

- డ్రైఫ్రూట్స్‌, గింజలు, కొబ్బరి నూనె మేలు

- మంచినీళ్లు, ఉప్పులేని నీళ్ల మజ్జిగ..

- తెలుగు రాష్ట్రాల్లో విస్తృత ప్రచారం

- అనుసరిస్తున్న వేలాదిమంది ప్రజలు

- అధిక బరువు నుంచి విముక్తి

- బీపీ, షుగర్‌, ఇతర జీవన శైలి రుగ్మతలకు చెక్‌

- షుగర్‌ను తరిమేస్తానంటున్న కొత్త ‘డైట్‌’ సృష్టించిన బెజవాడ వాసి

 ఆయన డాక్టర్‌ కాదు! పోషకాహార నిపుణుడూ కాదు! లెక్కలతో కుస్తీ పట్టే చార్టెర్డ్‌ అకౌంటెంట్‌! కానీ... ఆయన వేలాదిమంది జీవితాల ‘తిండీ-తిప్పల’ను మార్చేస్తున్నారు. చర్చలు, సమావేశాలు, యూట్యూబ్‌ వీడియోలతో హల్‌చల్‌ సృష్టిస్తున్నారు. ‘‘ఇది వినండి.. ఇలా తినండి.. రోగాలు మీ దరి చేరవు. బరువు దించేసుకుంటారు. షుగర్‌ పరార్‌. జీవన శైలి రోగాలన్నీ గాయబ్‌’’ అని తేల్చి చెబుతున్నారు. సామాన్యులే కాదు... ఎంతో మంది వైద్యులు కూడా ఆయన చెప్పింది వింటున్నారు, తింటున్నారు. ఈ డైట్‌ పేరు... ‘లో కార్బ్‌- హై ఫ్యాట్‌’! అంటే... కార్బొహైడ్రేట్లు తక్కువగా తీసుకోవడం. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినడం! మీరు చదివింది నిజమే... కొవ్వు పదార్థాలను ఎక్కువగా తినడమే! తన సొంత సమస్యకోసం పరిష్కారాలు వెదికి... సరికొత్త డైట్‌ సూత్రాన్ని కనిపెట్టిన ఆయన పేరు వీరమాచినేని రామకృష్ణారావు! ఊరు విజయవాడ! ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఆహార నియమాలపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. అది కూడా సొంత ఖర్చుతో! అసలేమిటి ‘హై ఫ్యాట్‌ ఫుడ్‌’! మీరే చూడండి! 

‘‘ఇక బేరియాట్రిక్‌ సర్జరీల అవసరం ఉండదు. మధుమేహం, బీపీ, థైరాయిడ్‌, స్పాండిలైటిస్‌, ఆర్థరైటిస్‌ వంటి వ్యాధులకు మందులు వాడాల్సిన పనిలేదు. గంటల తరబడి పనిచేసినా మానసిక ఒత్తిడి దరిచేరదు. అయితే.. ఆహారం తీసుకోవడంలో చేస్తున్న పొరపాట్లకు స్వస్తిచెప్పాలి’’.. ఇది వీరమాచినేని మాట! ఆహార విధానంలో కొద్దిమార్పులతో జీవనశైలి సంబంధిత వ్యాధులన్నీ తగ్గిపోతాయని చెబుతున్నారు. ఈ పద్ధతిలో పొద్దున్నే టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం, రాత్రి మళ్లీ భోజనం లేదా చపాతీలు తినడం కుదరదు. అలాగని నోరు కట్టేసుకోవాల్సిన పని లేదు. మాంసాహారం తినేయవచ్చు. మీగడ, నెయ్యి వాడొచ్చు. ఈ ‘హై ఫ్యాట్‌’ డైట్‌ను ఆర్నెళ్లపాటు అనుసరిస్తే.. కొద్దిపాటి నియంత్రణతో ఆరోగ్యంగా ఉండొచ్చునని రామకృష్ణారావు చెబుతున్నారు.

ఇలా మొదలైంది...

ఒకప్పుడు రామకృష్ణారావు బరువు 123 కిలోలు! భారీ కాయాన్ని తగ్గించుకోవడానికి శరీరాన్ని చాలా కష్టపెట్టేవారు. ఉదయాన్నే సైకిల్‌ తొక్కడం.. ఇతరత్రా వ్యాయామాలు చేసేవారు. అదే సమయంలో... ఊబకాయం, మధుమేహం, ఇతర జీవన శైలి సంబంధిత సమస్యలకు పరిష్కారాన్ని శోధించడం మొదలుపెట్టారు. చైనా సంతతికి చెందిన కెనడా నెఫ్రాలజిస్టు జీసన్‌ఫెంగ్‌ పరిశోధనలు ఆయన కంట పడ్డాయి. దీని ఆధారంగా... కొవ్వుకు కొవ్వవుతోనే చెక్‌ చెప్పే ఆహార నియమావళిని రూపొందించారు. ఈ ప్రయోగాన్ని తొలుత తనపైనే చేసుకున్నారు. ఆయన బరువు 60 రోజుల్లోనే 123 కిలోల నుంచి 93 కిలోలకు తగ్గింది. తర్వాత... మధుమేహంతో బాధపడుతున్న ఓ స్నేహితుడిని ఒప్పించి, ఈ ఆహార నియమాలను పాటించేలా చేశారు. ఆయన షుగర్‌ లెవెల్‌ తగ్గినట్లు గమనించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలు, ఆస్ట్రేలియా, అమెరికా, లండన్‌, దుబాయి దేశాల్లోని తెలుగు వారు ఈ డైట్‌ పాటిస్తున్నారు.

ఏం తినాలి.. ఎలా తినాలి?

‘హై ఫ్యాట్‌’ డైట్‌ను వ్యక్తుల అవసరాలను బట్టి రెండు నెలల నుంచి నాలుగు నెలలు అనుసరించాలి. లక్ష్యం సాధించాక ఈ ప్రోగ్రామ్‌ నుంచి బయటికి వచ్చి.. కొద్దిపాటి నియంత్రణతో ముందులాగే ఆహారం తీసుకోవచ్చు. ఆయిల్‌ ఫ్యాట్‌, నిమ్మకాయలు, మంచినీళ్లు, పల్చటి మజ్జిగ, మల్టీ విటమిన్‌ టాబ్లెట్లు.. కొత్త ఆహారంలో ఇవే కీలకం. బాదం, పిస్తా, వాల్‌నట్‌, గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు, పుచ్చ, అవిసె గింజలు, తెల్ల నువ్వులు తినవచ్చు. రోజుకు ఆరు వరకు కోడిగుడ్లు (పచ్చసొనతో సహా) తినొచ్చు. పావు కిలో మటన్‌, చికెన్‌, ఫిష్‌, రొయ్యలను నిర్దిష్ట విధానంలో వండుకుని తీసుకోవచ్చు. స్వీట్లు, పండ్లు, పాలు, పాల పదార్థాలు, చక్కెర, బెల్లం, తేనె, కూల్‌డ్రింక్స్‌, కొబ్బరినీళ్లు, కాఫీ, టీ, మద్యం, ధూమపానం, గుట్కాలు పూర్తిగా నిషిద్ధం. గ్రీన్‌ టీ, షుగర్‌ లెస్‌ లెమన్‌ టీ తీసుకోవచ్చు.

అన్నం, చపాతి, పుల్కా, బొంబాయి రవ్వ ఉప్మా, ఇడ్లీ, దోసె, పూరీ వంటివి తినకూడదు. మొక్కజొన్న, సజ్జలు, జొన్న, రాగులు, కొర్రలు వంటి చిరుధాన్యాలూ తినొద్దు. రిఫైన్డ్‌ ఆయిల్స్‌ అస్సలు వాడొద్దు. కురుడీకాయల నుంచి తీసిన కొబ్బరి నూనె, ఆవు, గేదె నెయ్యి, ఆలివ్‌ ఆయిల్‌, మీగడ, వెన్న మాత్రమే వంటల్లో వాడాలి. రోజూ నాలుగైదు లీటర్ల మంచినీళ్లు తాగాలి. ఉప్పు లేకుండా.. పల్చటి మజ్జిగలో నిమ్మరసం కలిపి తాగాలి. వంటల్లో సముద్రపు ఉప్పు మాత్రమే వాడాలి. బంగాళ దుంప, చేమ, కంద, పెండలం, చిలగడ దుంపలు, బీట్‌రూట్‌, కూర అరటికాయ, నాటు చిక్కుడు, బఠానీ, గోరు చిక్కుడు (బీన్స్‌) పూర్తి నిషేధం. సొరకాయ, తోటకూరకాడలు, బీరకాయలను పాలతో కలపి వండుకోవచ్చు. పాల మీద మీగడతో కూరలు వండుకోవచ్చు. నేరుగా పాల మీద మీగడ తినకూడదు.

మేలు చేసే ఆహార విధానం

‘‘థైరాయిడ్‌, బీపీ, ఫ్యాటీలివర్‌, పీసీవోడీ, స్పాండిలైటిస్‌, ఆర్థ్రరైటిస్‌, మైగ్రెయిన్‌, వెన్నునొప్పి, కాళ్ల నొప్పి, రుతుచక్రంలో అసమతుల్యత, సంతాన సాఫల్యత.. ఇలా వేర్వేరు సమస్యల నివారణకు వైద్యులను సంప్రదిస్తే ముందు బరువు తగ్గాలని అంటుంటారు. ఎలా తగ్గాలని ఎవరూ చెప్పరు. కొత్త విధానంతో బరువు తగ్గడం సులువు. నా స్నేహితుడు డయాబెటిక్‌ పేషెంట్‌. ఆయనకు 58 సంవత్సరాలు. తొలి ఐదురోజులు పూటకు నాలుగు స్పూన్‌లు చొప్పున ఆయనకు కొబ్బరి నూనె ఇచ్చాం. మిగతాది అంతా మంచినీళ్లు తాగడమే. కొంచెం నిమ్మకాయ ఇచ్చేవాళ్లం. వారం రోజుల్లో బరువు తగ్గారు. మధుమేహానికి మందులు వాడాల్సిన అవసరం రాలేదు. తెలుగు రాష్ట్రాల నుంచి మధుమేహాన్ని ఏడాదిలో తరిమికొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాను.’’ - వీరమాచినేని రామకృష్ణా రావు

కొవ్వు తింటూనే కొవ్వు తగ్గించుకోవచ్చు

‘‘రామకృష్ణ సూచించిన డైట్‌ ఫార్ములాతో డయాబెటిస్‌ రహిత ప్రపంచం సాధ్యమనే నమ్ముతాను. వైద్య పరంగా పరిశోధనలు చేసిన తర్వాత ఇవన్నీ నిజాలని తేలుతాయి. స్వయంగా నేను 81 నుంచి 75 కేజీలకు తగ్గాను. నాలో షుగర్‌ లెవెల్స్‌ 250 నుంచి 110కి తగ్గాయి. ఎక్కువ తింటున్నా షుగర్‌ కంట్రోల్‌లో ఉంటోంది. ఎక్కువ ఫ్యాట్‌ తింటూనే ఫ్యాట్‌ తగ్గించుకోవడం ఈ విధానంలో ప్రత్యేకత’’ - డాక్టర్‌ హరిశ్చంద్ర, సీనియర్‌ హోమియో ఫిజిషియన్‌, విజయవాడ

థైరాయిడ్‌ తగ్గుముఖం 

‘‘రామకృష్ణ ప్రతిపాదించిన నూతన ఆహార పద్ధతిలో ఒబేసిటీ తగ్గుతోంది. బరువు తగ్గితే సహజంగానే థైరాయిడ్‌ సమస్యకు దారితీసే స్థాయులు తగ్గుతాయి. ఈ డైట్‌ తీసుకుంటే టైప్‌-2 మధుమేహం అదుపులో ఉంటుంది’’ - డాక్టర్‌ ఎస్‌.జయదేవ్‌, ఎండోక్రిౖనాలజిస్ట్‌, విజయవాడ

మోకాలి నొప్పికి విముక్తి

‘‘నాలుగడుగులు వేయాలంటే కాలు విపరీతంగా నొప్పి పుట్టేది. మెట్లు ఎక్కడమంటే భయమేసేది. గతంలో తిండి తగ్గించినా బరువు తగ్గలేదు. హై ఫ్యాట్‌ డైట్‌తో నెలరోజుల్లో ఆరు కిలోలు తగ్గా. మోకాలి నొప్పి తగ్గింది’’- డాక్టర్‌ యు.శ్రీలక్ష్మి, నాగార్జున ఆసుపత్రి, విజయవాడ

షుగర్‌ మందులు మానేశా!

‘‘ఏడు నెలల క్రితం హై ఫ్యాట్‌ ఆహారంలోకి వచ్చా. ఐదోరోజు నుంచే షుగర్‌కు మందులు ఆపేశా. షుగర్‌ కంట్రోల్‌లో ఉంది. మూణ్నెళ్ల పాటు నూతన విధానంలో ఆహారం స్వీకరించా. వంద నుంచి 77 కిలోలకు బరువు తగ్గా. ప్రస్తుతం ఏది తిన్నా మధుమేహం పెరగడం లేదు’’- కేవీ సాంబశివారెడ్డి, విజయవాడ

స్పాండిలైటిస్‌ 60% తగ్గింది

‘‘గత ఆరేళ్లుగా స్పాండిలైటిస్‌ నుంచి బాధపడుతున్నా. ప్రస్తుతం అరవై శాతం మార్పు వచ్చింది. గతంలో తలతిప్పలేకపోయేవాడిని. గతంలో 118 కిలోలు ఉండేవాడిని ప్రస్తుతం 91 కేజీలకు తగ్గాను’’ - కె.లోకేష్‌, టీచర్స్‌ కాలనీ, విజయవాడ

 

Related Posts