YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

30 లక్షలకు నీట్ అమ్మేశారు

30 లక్షలకు నీట్ అమ్మేశారు

న్యూఢిల్లీ, జూన్ 17,
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నీట్ యూజీ పేపర్ లీక్ అంశంలో తవ్వేకొద్దీ విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. బిహార్ కేంద్రంగా పేపర్ లీకేజీ జరిగినట్లు సిట్ విచారణలో తేలినట్లు జాతీయమీడియాలో కథనాలు వస్తున్నాయి. నీట్ ప్రశ్నపత్రం లీకైనట్లు వదంతులు రాగా.. కేంద్రం, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(NTA) వాటిని తోసిపుచ్చింది. అయితే, నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలపై దర్యాప్తునకు బిహార్‌ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేసింది. సిట్ చేపట్టిన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నీట్‌ పేపర్‌ లీక్‌  చేసినందుకు కొందరు అభ్యర్థులు రూ.30 లక్షల చొప్పున చెల్లించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి బిహార్‌లో ఇప్పటివరకు 14 మందిని సిట్ అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకున్నవారిలో బిహార్‌ ప్రభుత్వ విభాగంలో పనిచేసే ఓ జూనియర్‌ ఇంజినీర్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పేపర్‌ లీక్‌ గ్యాంగ్‌తో కలిసి అక్రమాలకు పాల్పడినట్లు, కొందరు నీట్ అభ్యర్థుల కుటుంబసభ్యులతోనూ టచ్‌లో ఉన్నట్లు.. ఆ జూనియర్‌ ఇంజినీర్‌ విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోందిమే 4న బిహార్‌లోని రామకృష్ణనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ పాఠశాలలో ఈ ముఠా నకిలీ పరీక్ష సెషన్‌ను నిర్వహించింది. ఇక్కడ సమాధానాలతో కూడిన నీట్ ప్రశ్నపత్రాలను అభ్యర్ధులకు పంపిణీ చేసింది. ఈ పేపర్‌ కోసం కొంతరు అభ్యర్థులు రూ.30 లక్షల నుంచి రూ.32 లక్షల వరకు ముడుపులు ఇచ్చారు. మొత్తం 35 మంది అభ్యర్ధులకు ఈ ప్రశ్నాపత్రాలు అందాయి. అనంతరం ఆ ప్రశ్నాపత్రాలను అదే పాఠశాలలో కాల్చివేసినట్లు విచారణలో వెల్లడైందని జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి. విచారణలో భాగంగా నీట్ పేపర్ లీక్ అయినట్లు భావిస్తోన్న పాఠశాల నుంచి కాలిపోయిన ప్రశ్నపత్రం అవశేషాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. కేసుకు సంబంధించి విచారణ ముమ్మరంగా సాగుతోంది. మొత్తం 13 మంది నీట్‌ అభ్యర్థులు ఈ పేపర్‌ లీక్‌లో భాగస్వాములైనట్లు అధికారులు గుర్తించారు. ఇందులో నలుగురిని ఇప్పటికే అరెస్టు చేయగా.. మరో 9 మందికి తాజాగా నోటీసులు జారీ చేశారు. వీరు జూన్ 17, 18 తేదీల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. నీట్ పరీక్ష జరిగినప్పటి నుంచి అన్ని వివాదాలే కనిపిస్తున్నాయి. ఒకవైపు పేపర్ లీక్, మరోవైపు గ్రేస్ మార్కులు ఇవ్వడం, మరో కేంద్రంలో ఒక మీడియం బదులు మరో మీడియం ప్రశ్నపత్రం ఇవ్వడం ఇలా పరీక్ష రోజు నుంచి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. పేపర్ లీక్ వార్తలు కొట్టిపడేసిన కేంద్రం, ఎన్టీఏ.. వివాదం సుప్రీంకోర్టుకు చేరడంతో 1563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు రద్దు చేసింది. నీట్ ఫలితాల్లో అక్రమాలపై ఆరోపణలు రావడంతో.. స్పందించిన కేంద్రం వెంటనే నలుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని వేసింది. ఈ కమిటీ విచారణ జరిపి కేంద్రానికి నివేదిక సమర్పించింది. కమిటీ ఇచ్చిన నివేదికలోని నిర్ణయాలను కేంద్రం జూన్ 13న సుప్రీంకోర్టుకు వివరించింది. పరీక్ష సమయంలో కోల్పోయిన సమయానికి పరిహారంగా గ్రేస్ మార్కులు పొందిన ఆ 1563 మంది విద్యార్థుల స్కోర్ కార్డులను రద్దు చేస్తున్నట్లు కోర్టుకు వెల్లడించింది. యూజీ పరీక్షను రద్దు చేయాలని, పరీక్ష నిర్వహణలో చోటు చేసుకున్న అవకతవకలపై న్యాయస్థానం పర్యవేక్షణలో సీబీఐ లేదా ఇతర స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. నీట్ పరీక్ష రాసినవారిలో 20 మంది విద్యార్థులు ఈ పిటిషన్ వేశారు. ఇప్పటికే నీట్ పరీక్షలో అక్రమాలపై సుప్రీంకోర్టుతో పాటు.. వివిధ హైకోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే.
సాల్వార్ గ్యాంగ్ పనే
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ కావడం.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీహార్ రాజధాని పాట్నా కేంద్రంగా ఈ పేపర్ లీకేజీ జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని జాతీయ మీడియా సంస్థలు పరిశోధనాత్మక కథనాలను ప్రసారం చేస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంలో సాల్వర్ గ్యాంగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సాల్వర్ గ్యాంగ్ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ అంటే రాష్ట్రాలలో పోటీ పరీక్షల సమయంలో పేపర్ లీ కేజీలకు యత్నిస్తుంటాయి. అభ్యర్థుల వద్ద డబ్బులు వసూలు చేసి.. వారికి ఈ పేపర్లను అమ్ముతుంటాయి. రహస్య ప్రాంతాలలో ప్రశ్నలకు సమాధానాలు ఎప్పటికప్పుడు వల్లె వేయిస్తూ ఉంటాయి. తీరా పరీక్ష సమయానికి పరీక్ష కేంద్రానికి తీసుకెళ్తుంటాయి. ఈ వ్యవహారాన్ని రెండవ కంటికి తెలియకుండా జరుపుతుంటాయి. ఈ గ్యాంగ్ కు జాతీయస్థాయిలో నెట్వర్క్ ఉంది.. ఉదాహరణకు నీట్ పరీక్షనే తీసుకుంటే.. పాట్నా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల వద్ద సూపరింటెండెంట్ లకు భారీగా డబ్బు ఆశ చూపించారు. వారిని తమ వలలో వేసుకున్నారు. సూపరింటెండెంట్ లకు ప్రశ్న పత్రాలు చేతికి రాగానే వారు సాల్వర్ గ్యాంగ్ కు చేరవేశారు. ఆ ప్రశ్న పత్రాలను వివిధ సబ్జెక్టుల్లో నిపుణులైన వారితో పరిష్కరించి.. ఆ సమాధానాలను విద్యార్థులతో బట్టి కొట్టించారు. ఆ తర్వాత ఆ విద్యార్థులను నేరుగా పరీక్షా కేంద్రాల వద్దకు తీసుకెళ్లి, పరీక్ష రాయించారు. హర్యానా లో ఒకే పరీక్ష కేంద్రంలో ఏడుగురు విద్యార్థులకు జాతీయస్థాయి ర్యాంకులు రావడం విశేషం. ఇందులో కొంతమంది విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 717, 719 మార్కులు వేయడం అనుమానాలకు తావిస్తున్నది.ఈ సాల్వర్ గ్యాంగ్ ఇప్పుడు మాత్రమే కాదు, గతంలో బిహార్ టీచర్ రిక్రూట్ మెంట్ లోనూ ఇదే తీరుగా పని చేసింది. ఈ గ్యాంగ్ లో నితీష్ కుమార్ అనే వ్యక్తిని బీహార్ పోలీసులు పట్టుకున్నారు. అయితే అతడిని విచారిస్తే.. నీట్ వ్యవహారం బయటపడింది. అయితే ఇందులో ఇంకా ఎన్ని పెద్ద తలకాయలు ఉన్నాయో అంతు పట్టడం లేదని బీహార్ పోలీసులు అంటున్నారు. మరోవైపు నీట్ పరీక్ష రద్దుచేసి, కొత్తగా నిర్వహించాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కి ఆదేశాలు ఇవ్వాలని.. 20 మంది విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. అంతేకాదు ఈ పరీక్షలో 620 కి మించి మార్కులు సాధించిన విద్యార్థుల నేపథ్యాన్ని పరిశీలించేందుకు ఒక స్వతంత్ర సంస్థతో పోస్ట్ ఎగ్జామ్ అనాలసిస్ నిర్వహించాలని వారు సుప్రీంకోర్టుకు విన్నవించారు..నీట్ పరీక్షలో అక్రమాల నేపథ్యంలో జూన్ 19, 20 తేదీలలో దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించేందుకు ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ పిలుపునివ్వడం విశేషం.

Related Posts