YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రుణమాఫీ రోడ్ మ్యాప్ సిద్ధం...

రుణమాఫీ రోడ్ మ్యాప్ సిద్ధం...

హైదరాబాద్, జూన్ 17,
అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన మరో హామీని నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. రుణమాఫీ  సమర్ధవంతంగా దీనిని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో రుణమాఫీకి సంబంధించిన సకల సమాచారాన్ని ప్రభుత్వం సేకరించటమే గాక దీనిని పలు కోణాల్లో విశ్లేషించింది. ఈ సమాచారాన్ని త్వరలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ రూపంలో ముఖ్యమంత్రికి వివరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. పంద్రాగస్టులోగా ఏ ఒక్క రైతుకూ నష్టం కలగని రీతిలో రుణమాఫీ చేయాలనే దిశలో కసరత్తు చేస్తున్న అధికారులు.. ముందుగానే స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.రుణామాఫీ మీద కసరత్తు చేసే క్రమంలో తెలంగాణ ఆర్థిక శాఖకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు.. జూన్ మొదటి వారంలో మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలలో రెండు రోజులు పర్యటించి, ఇటీవల అక్కడ జరిగిన రుణమాఫీపై అధ్యయనం చేశారు. 2019లో మహారాష్ట్ర ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా పూలే షేట్కారీ ఖర్జ్ ముక్తి యోజన పేరుతో ఏకకాలంలో రూ.2 లక్షల లోపున్న రూ. 20,500 కోట్ల రుణాలను రద్దు చేసింది. అలాగే, 2018లో నాటి కాంగ్రెస్ సర్కారు రూ.18,000 కోట్ల రుణమాఫీ చేసింది. ఈ రెండు రాష్ట్రాలలో సహకార శాఖను నోడల్ ఏజెన్సీగా ప్రకటించి, రుణమాఫీ చేశారు. రైతుల పేరుమీదున్న రుణాలను నోడల్ ఏజెన్సీకి బదిలీ చేసి, దానికి ప్రభుత్వం పూచీ ఇచ్చి, నెలనెలా ప్రభుత్వ ఖజానా నుంచి కొంతమొత్తాన్ని బ్యాంకులకు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక్కడా అదే పద్ధతిని పాటిస్తూ, ఆర్థిక లేదా వ్యవసాయ శాఖను నోడల్ ఏజెన్సీగా ప్రకటించే అవకాశం ఉంది. రుణమాఫీకి సంబంధించి కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్‌ పథకాన్నీ అధికారులు అధ్యయనం చేశారు. తెలంగాణ నుంచి ఆ పథకం లబ్దిదారుల జాబితాలనూ తయారుచేశారు.కష్టాలలో ఉన్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తెచ్చిన ఈ పథకం ద్వారా నిజమైన రైతులకు మేలు జరగాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా లేని, ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న వర్గాలను ఈ పథకం నుంచి మినహాయించాలని అధికారులు సూచిస్తున్నారు. కేంద్రం అమలు చేస్తు్న్న పీఎం కిసాన్ పథకాన్ని దీనికి ఉదాహరణగా వారు చూపుతున్నారు. పీఎం కిసాన్ నియమావళి ప్రకారం.. మాజీ, ప్రస్తుతం రాజ్యాంగ పదవుల్లో కలిగినవారు, మాజీ, ప్రస్తుత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కుటుంబ సభ్యులు, మునిసిపల్ కార్పొరేషన్ మాజీ, ప్రస్తుత మేయర్లు, జిల్లా పరిషత్ మాజీ, ప్రస్తుత ఛైర్మన్ల కుటుంబాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఈ ఉద్యోగాల నుంచి రిటైర్ అయినవారి కుటుంబాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల మాజీ, ప్రస్తుత అధికారులు, నెలకు రూ.10 వేలకు మించి ప్రభుత్వ పెన్షన్ పొందేవారు, ఐటీ చెల్లింపుదారులు, ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్‌లు ఈ పథకం కింద సాయం పొందటం వీలుకాదు. ఈ పథకపు నియమావళిని యధాతథంగా అమలు చేస్తే నిజమైన రైతులకు మేలు చేసినట్లవుతుందని కొందరు అధికారులు సూచించారు.తెలంగాణలో పీఎం కిసాన్ సమ్మాన్ లబ్దిదారుల సంఖ్య 32.68 లక్షలుగా ఉంది. ఇక.. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రూ.2 లక్షల రుణమున్న అందరికీ మాఫీ చేస్తే రూ.33 వేల కోట్ల నుంచి రూ.38 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. అదే.. పీఎం కిసాన్ సమ్మాన్ పథకపు షరతులు విధిస్తే సుమారు రూ. 15 వేల కోట్ల వరకు డబ్బు ఆదా అవుతోందని అధికారులు లెక్క తేల్చారు. మరో నాలుగు రోజుల్లో రుణమాఫీకి సంబంధించి ప్రత్యేకంగా మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో అధికారులు తాము తయారు చేసిన మూడు రకాల రూట్‌మాప్స్‌ను కేబినెట్ ముందు పెట్టనున్నారు. ఈ వివరాలను పలుకోణాల్లో పరిశీలించిన అనంతరం కేబినెట్ రుణమాఫీ విధి విధానాలపై ఒక అవగాహనకు రానుంది.రుణమాఫీకి సంబంధించి వ్యవసాయ, ఆర్థిక శాఖల అధికారులు మూడు రకాల రైతు జాబితాలను రూపొందించినట్లు తెలుస్తోంది. మొదటిదానిలో.. పూర్తిగా వ్యవసాయం మీదనే ఆధారపడి, మరే విధమైన ఆర్థిక వనరులు లేని రైతు కుటుంబాలు, వారికి మాఫీ చేయాల్సిన మొత్తాలను పొందుపరిచినట్లు, రెండవ జాబితాలో పీఎం కిసాన్ నమూనాలో ప్రజా ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులు, వ్యాపారుల వంటి వారిని మినహాయిస్తూ రుణమాఫీ చేస్తే ఎంత భారం పడుతుందనే కోణంలో జాబితాను తయారుచేశారని తెలుస్తోంది. మూడవ దానిలో ఏ షరతులూ లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేస్తే ఏమేర భారం పడుతుందనే వివరాలతో మూడు జాబితాను రూపొందించారు.రుణమాఫీకి ఒక్కో రైతును విడివిడిగా లెక్కలోకి తీసుకుంటే పడే భారం ఎంత? కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుంటే ఏ మేర భారం పడుతుందనే కోణంలోనూ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఫ్యామిలీని యూనిట్‌గా తీసుకుంటే.. ఇంటిలో ఎందరు రుణం తీసుకున్నా ఒకరికే మాఫీ కానుంది. దీనికి రేషన్ కార్డును ప్రమాణంగా తీసుకుంటే ఎలా ఉంటుందనే కోణంలోనూ అధికారులు ఆలోచిస్తున్నారు. అయితే.. గత పదేళ్లలో కొత్త రేషన్ కార్డులు అందరికీ అందలేదు గనుకు కొందరు నష్టపోతారని భావిస్తున్నారు. కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని, ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మంది రుణాలు తీసుకొని ఉంటే, వారి మొత్తం రుణమాఫీ మొత్తాన్ని రూ. 2 లక్షలకే పరిమితం చేస్తే సరిపోతుందనే కోణంలోనూ అధికారులు యోచిస్తున్నారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన డిసెంబరు 7న లేదా సోనియా గాంధీ జన్మదినమైన డిసెంబరు 9వ తేదీని రుణమాఫీకి కటాఫ్ డేట్‌గా తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు భావిస్తున్నట్లు సమాచారం. డిసెంబరు 9 నాడే నాటి హోం మంత్రి హోదాలో చిదంబరం తెలంగాణ ప్రకటన చేసిన కారణంగా డిసెంబరు 9 వ తేదీ వైపే ప్రభుత్వం మొగ్గుచూపే అవకాశముందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.కేంద్రం అమలు చేస్తున్న పంటల బీమా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం కొనసాగించాలని నిర్ణయించింది. ఇందులో చేరాలంటే రైతువాటాగా రూ. 1000 నుంచి రూ. 1500 వరకు చెల్లించాల్సి ఉంది. ఈ ప్రీమియం ఎక్కువగా ఉందనే గతంలో కేసీఆర్ దీనిని తిరస్కరించటంతో పంట నష్టపోయిన కాలంలో రైతుకు నయాపైసా సాయం అందలేదు. కానీ, ఈ రైతుల వాటా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున చెల్లించాలని, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు ఏ ఏ జిల్లాలో ఏ పంటలు, ఎంత విస్తీర్ణంలో వేస్తున్నారనే గణాంకాలతో నివేదికలు తయారు చేస్తున్నారు. దీనివల్ల అకాల వర్షాలు, అనావృష్టి సమయాల్లో పంట నష్టపోతే హెకార్టుకు రూ.35 నుంచి రూ.70 వేల సాయం అందుతుంది. దీనికీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

Related Posts