YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

వివేకమే ఆధ్యాత్మిక జీవనాన్ని నడిపిస్తుస్తుంది..

వివేకమే ఆధ్యాత్మిక జీవనాన్ని నడిపిస్తుస్తుంది..

- ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రమాణం ఏమిటి..

- మానసిక ప్రశాంతత సాధించడం..!

భగవానుడి అనుగ్రహానికి సంబంధించి, భారతీయ ధర్మగ్రంథాలు మూడు ముఖ్యాంశాల్ని ప్రస్తావించాయి.  మనిషిగా జన్మించడం, ఆధ్యాత్మిక వికాసాన్ని కాంక్షించడం, అసలైన గురువును పొందగలగడం. ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రమాణం ఏమిటి, దాన్ని ఏ విధంగా తెలుసుకోగలం అనే ప్రశ్నలు సహజంగానే ఎదురవుతాయి. వాటికి సమాధానం ఒక్కటే- మానసిక ప్రశాంతత సాధించడం!ఎటువంటి సమస్యలు, బాధలు లేకుండా పరిపూర్ణమైన ఆనందంతో జీవితాన్ని గడపడమే ఆధ్యాత్మికత కాదు. ఈ ప్రపంచంతో మనిషి ఒక సంబంధం, ప్రత్యక్ష జ్ఞానం ఏర్పరచుకుంటాడు. వాటి ద్వారా స్థిరత్వం పొందడం అతడికి ముఖ్యావసరం. అది బాధ్యతతో పాటు, ఇతరుల పట్ల స్పృహ కలిగి మెలిగే మానసిక స్థితిని మానవుడికి కల్పిస్తుంది. ఆ స్థాయిలోనే అతడి జీవన మార్గంలో సేవ, దానగుణం వంటివి చోటుచేసుకుంటాయి.

ఏ మనిషిలోనైనా సర్వసహజంగా విభిన్న వ్యక్తిత్వ ధోరణులుంటాయి. అవన్నీ సమగ్ర రీతిలో ఏక స్వరం వినిపించడమే ఆధ్యాత్మికత! ఒకే లాంటి కోరికలు, నమ్మకాలు, నియమాలు అతణ్ని ఏకైక లక్ష్యం వైపు నడిపిస్తాయి. అప్పుడే ఆధ్యాత్మికత ఓ సృజనాత్మక ప్రక్రియగా గుర్తింపు అందుకుంటుంది. స్వచ్ఛమైన ప్రేమ, దయ, కరుణ, సమర్పణ భావం, కృతజ్ఞత, నమ్మకం, పవిత్రత- ఇవన్నీ ఆధ్యాత్మిక లక్షణాలే అయినా ఏవీ ఒక్కసారిగా వూడిపడవు. పుట్టుకతో సంక్రమించేవీ కావు. మరొకరి నుంచి ఆశించే బహుమానాలు అంతకన్నా కావు.

ఈ గుణాలు ప్రతి ఒక్కరూ అలవరచుకోవాల్సినవి. ఎంపిక చేసుకోవడం మీదే అంతా ఆధారపడి ఉంటుంది. ఇటువంటి లక్షణాలన్నీ మనిషి లోపల అంతర్గతంగా నిరీక్షిస్తుంటాయి. ఎప్పుడు బయటకు రావాలా అని ఎదురుచూస్తుంటాయి. ఇవి బయటపడటం, పడకపోవడం అనేది మనిషి జీవన వైఖరి అనుసరించి నిర్ణయమవుతుంది. ఉత్తమ గుణాల వెల్లడికి ఏ ఒక్కరూ జీవితాంతం నిరీక్షించాల్సిన పని లేదు. జీవన పరిస్థితి మెరుగుపడ్డాక అలవరచుకోవచ్చని వాయిదా వేసుకోవడమూ సరి కాదు.

క్షమాగుణం క్రమేణా కాలానుగుణంగా వృద్ధి చెందుతుంటుంది. మనిషి చేసే తప్పుడు పనులకు అతడి అజ్ఞానమే కారణమన్నది నిర్వివాదం. అది తెలుసుకోవాలన్నా, అతడిలో ముందుగా అవగాహన పెరగాలి. అనుక్షణం మనిషి తనను తాను సమీక్షించుకోవాలి. భిన్న పరిస్థితులు ఎదురైనప్పుడు, వాటిని తన అవగాహనా శక్తి మేరకు ఎదుర్కొంటూ ముందుకు సాగిపోవాలి.

ఏ పరిస్థితినైనా అధిగమించేందుకు ప్రథమంగా కావాల్సింది- స్థితప్రజ్ఞత. ఆలోచనలకే మానవుడు ప్రాధాన్యమివ్వాలి. అన్నింటికీ అర్థాలు అన్వేషించే పని మానుకోవాలి. స్పృహతో కాలం గడుపుతుంటే సమస్థితి సాధ్యపడుతుంది. ప్రతిదానికీ కారణాలు అన్వేషించడం వల్ల ఉపయోగం ఉండదు. ఎందుకిలా అయింది, అలా ఎందుకు కాలేదు వంటి తర్క వితర్కాలతో మనిషి సాధించేదేదీ లేదు.

జీవితంలో అన్నీ కలిగి ఉంటేనే గుర్తింపు లభిస్తుందన్న ధోరణి నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు, అంతా మంచే జరుగుతున్నప్పుడు మనిషి తనకు దైవానుగ్రహం ఉందనుకుంటాడు. అదే దైవకృప నీడలా తన వెంట వస్తుందన్న వాస్తవాన్ని అతడు గ్రహించగలగాలి. స్వీకరించే మనసు ఉండాలే గాని, ఆధ్యాత్మిక జ్ఞానం సదా సర్వదా మానవుడి కోసమే!

ఒక ఉన్నత మానసిక స్థితికి చేరుకున్నాక, ఆధ్యాత్మిక జీవనాన్ని వివేకమే నడిపిస్తుంది. అదే, సాధకుడికి ప్రశాంతత చేకూరుస్తుంది. అతడి పెదవుల పైకి పసివాడి స్వచ్ఛమైన నవ్వును తెస్తుంది. ఎలాగైనా గమ్యం చేరుకోవాలన్న విపరీత తాపత్రయం లేనప్పుడే, జీవన యానం సుఖంగా సాగుతుంది. అందులోని ఆనందమంతా సాధకుడి సొంతమవుతుంది!

Related Posts