
ఓ కొత్త గ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు కనుగొన్నారు! భూమికి 600 కాంతి సంవత్సరాల దూరంలో... కె2-236 అనే నక్షత్రం చుట్టూ తిరుగుతున్నట్లు గుర్తించారు. భూమితో పోల్చితే ఆరింతల వ్యాసార్థం; 27 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి దీని సొంతమని లెక్కగట్టారు. ఇందులో 60-70% మంచు, సిలికేట్, ఇనుము తదితర పదార్థాలు ఉంటాయని అంచనా వేశారు. తాజా ఆవిష్కరణతో- కొత్తగా గ్రహాలను కనుగొన్న అతికొద్ది దేశాల సరసన భారత్ స్థానం సంపాదించింది.అహ్మదాబాద్‌లోని ఇస్రో భౌతిక పరిశోధన ప్రయోగశాలకు చెందిన ప్రొఫెసర్ అభిజిత్ చక్రవర్తి బృందం ఈ పరిశోధన చేపట్టింది. మౌంట్ అబూ గురుశిఖర్ అబ్జర్వేటరీలోని పారాస్ స్పెక్టోగ్రాఫ్ ద్వారా ఈ గ్రహాన్ని కనుగొన్నారు. నక్షత్రం చుట్టూ తిరిగే గ్రహాల ద్రవ్యరాశిని అంచనా వేయడం దీని ప్రత్యేకత. తన నక్షత్రం చుట్టూ పరిభ్రమించడానికి 19.5 రోజులు పడుతోందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కె2-236(ఎపిక్ 211945201) చుట్టూ తిరుగుతున్నందున దీనికి కె2-236బి అని నామకరణం చేశారు.