హైదరాబాద్, నవంబర్ 4,
అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం మారిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తేలిపోయింది. తెలంగాణలో ప్రధాన పార్టీలు ఇప్పుడు మరో అగ్నిపరీక్షకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల జాతరకు.. త్వరలోనే తెరలేవబోతోంది. కొత్త సంవత్సరంలోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. సర్పంచ్ ఎన్నికలకు డిసెంబర్ నెలలోనే ముహూర్తం ఫిక్స్ చేసినట్లు స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. 2025 జనవరి నెలలో గ్రామాలకు కొత్త సర్పంచ్‌లు వస్తారంటూ మీడియా చిట్‌చాట్‌లో స్పష్టం చేశారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంకావాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని, తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని ఎస్‌ఈసీ స్పష్టం చేశారు.తెలంగాణ రాష్ట్రంలోని 12 వేల 751 గ్రామ పంచాయతీల పదవీకాలం ఈ ఏడాది జనవరిలోనే ముగిసింది. అప్పటి నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన నడుస్తోంది. పంచాయతీ ఎలక్షన్లు నిర్వహించకపోవటంతో రాష్ట్రానికి రావాల్సిన రూ.1,800 కోట్ల నిధులు కేంద్రవద్దే ఉండిపోయాయి. దీంతో సత్వరమే ఎన్నికలను నిర్వహించి, ఆ నిధులను తెచ్చుకోవాలని భావిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ. 2025లో నిర్వహించబోయే అన్ని ఎన్నికలకు ఓటర్ల ముసాయిదా జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే రూపొందించింది. మరోవైపు ఈనెల ఆరు నుంచి సమగ్ర కుల గణన ప్రారంభం కానుంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులను త్వరలోనే ఎంపిక చేస్తామని ప్రకటించారు మంత్రి పొంగులేటి. దీన్నిబట్టి పంచాయతీ నగరాకు అధికార పార్టీ ఇప్పటికే సన్నద్ధమయినట్టు కనిపిస్తోంది.రాష్ట్రంలో బీసీల లెక్క తేలాల్సిందే.. వాళ్లకు దక్కాల్సిన వాటా దక్కాల్సిందే అని ఎన్నికలకు ముందునుంచీ చెబుతూ వస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఆ దిశగానే సమగ్ర కులగణన చేపట్టింది. ప్రభుత్వం చేపట్టిన కులగణన నవంబర్ 30తో ముగియనుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా స్థానిక ఎన్నికల రిజర్వేషన్లను ఖరారు చేసి స్థానిక ఎన్నికలను నిర్వహించనుంది రేవంత్ రెడ్డి సర్కార్. అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే కావడంతో వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికలకు ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న అధికార పార్టీ..భారీ సంఖ్యలో తన మద్దతుదారులను గెలిపించుకునే వ్యూహంలో ఉంది.రుణమాఫీ కార్యక్రమంతో పాటు సంక్షేమ పథకాలు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పంచాయతీ ఎన్నికల్లో కలిసొస్తాయన్న ధీమాతో ఉంది అధికారపార్టీ. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటిన బీఆర్‌ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లోనూ పట్టు నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్‌లో సత్తాచాటిన కారుపార్టీ.. పంచాయతీ ఎన్నికల్లో విజయంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ తమ బలం తగ్గలేదని నిరూపించుకోవాలనుకుంటోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి భారాన్ని ఈ ఎన్నికల్లో దించుకోవాలన్న వ్యూహంతో ఉంది ప్రతిపక్ష బీఆర్‌ఎస్.అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బలం పుంజుకున్న బీజేపీకి కూడా పంచాయతీ, స్థానిక సంస్థలు సవాలుగా మారబోతున్నాయి. క్షేత్రస్థాయిలోనూ బలం ఉందని నిరూపించుకోవాలంటే స్థానిక సంస్థల్లో కూడా సత్తా చాటాల్సి ఉంటుంది. ఒకరికిద్దరు కేంద్రమంత్రులున్నా పార్టీ రాష్ట్ర సారథిపై నాయకత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలు కావటంతో త్వరగా కొత్త అధ్యక్షుడెవరో తేలిస్తే ఎన్నికలకు సిద్ధంకావచ్చంటోంది ఆ పార్టీ కేడర్. మొత్తానికి 11 నెలల గ్యాప్ తర్వాత మళ్లీ తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలుకాబోతోంది. గల్లీదాకా పార్టీజెండా ఎగిరే ఎన్నికలు కావటంతో మూడు ప్రధానపార్టీలకూ అత్యంత కీలకం కాబోతున్నాయి.