కడప, నవంబర్ 29,
కడప ఎంపీ అవినాష్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చింది కడప న్యాయస్థానం. అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి పై పలు కేసులు నమోదు కాగా, ముందస్తు బెయిల్ కోసం కడప కోర్టును ఆయన ఆశ్రయించారు. వాదన విన్న న్యాయస్థానం ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. ఏపీలో సోషల్ మీడియా వేదికగా మహిళల వ్యక్తిగత హననానికి దారి తీసేలా పోస్ట్ ఇచ్చి చేసిన వారిని అరెస్టు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కడపకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి పై పలు కేసులు నమోదు చేసిన పోలీసులు, ఇప్పటికే రవీంద్రారెడ్డిని రిమాండ్ కు సైతం తరలించారు. రవీంద్రారెడ్డి అరెస్టుపై సాక్షాత్తు మాజీ సీఎం జగన్ సైతం స్పందించి.. కక్షపూరితంగా కూటమి ప్రభుత్వం తమ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తుందని విమర్శించారు. ఇతర పార్టీలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు కూడా మహిళల వ్యక్తిగత హననానికి దెబ్బతీసేలా పోస్టులు పెడుతున్నా, పోలీసులు ఫిర్యాదులు తీసుకొని పరిస్థితి కూడా ఏపీలో ఉందంటూ జగన్ కామెంట్ చేశారు. అయితే వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్ పై స్పందించిన వైయస్ షర్మిళ కూటమి ప్రభుత్వాన్ని సమర్థించారు. వర్రా రవీంద్రారెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు.వైయస్ షర్మిళ, సునీత, విజయమ్మలపై వర్రా తో అసభ్యకరమైన పోస్టులు పెట్టించారని రాఘవరెడ్డి పై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేయగా, గత 16 రోజులుగా రాఘవరెడ్డి పరారీలో ఉన్నారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కడప న్యాయస్థానాన్ని రాఘవరెడ్డి ఆశ్రయించారు. విచారణకు వచ్చిన బెయిల్ పిటిషన్ పై ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. తన పీఏకు సంబంధించి న్యాయస్థానం ముందస్తు బెయిల్ పిటీషన్ కొట్టివేయడంతో ఎంపీ అవినాష్ రెడ్డికి షాక్ తగిలినట్లుగానే భావించవచ్చు.