అనంతపురం, నవంబర్ 29,
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు డ్రోన్‌లను అస్త్రంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల శివారు ప్రాంతాలపై ఫోకస్ పెట్టారు. తాజాగా అనంతపుం శివారులో పోలీస్ డ్రోన్లను చూసి పేకాటరాయుళ్లు పరుగులు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.అనంతపురం జిల్లా కేంద్రం శివారు ప్రాంతాల్లో అసాంఘీక కార్యకలాపాలు పెరిగిపోయాయి. బ్లేడ్ బ్యాచ్..గంజాయి గ్యాంగ్.. తాగుబోతులు ముఠా.. ఇలా ఎవరైనా సరే.. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఓవరాక్షన్ చేస్తే కుదరదు. పోలీసులు.. డ్రోన్లతో మీ వైపు దూసుకువస్తున్నారు. అక్కడ తప్పించుకున్నా.. విజువల్స్ సాయంతో మిమ్మల్ని పసిగట్టి ఇంటికి వచ్చి మరీ తోలు తీస్తారు.డ్రోన్లతో తాగుబోతులకు, పేకాట రాయుళ్లకు దడ పుట్టిస్తున్నారు పోలీసులు. బహిరంగంగా లిక్కర్ లాగిస్తున్న వారిని హడలెత్తిస్తున్నారు. పేకాట దందాలకు చెక్ పెడుతున్నారు. అనంతపురం శివారు ప్రాంతాల్లో ఆకతాయుల ఆట కట్టించేందుకు డ్రోన్లు వినియోగిస్తున్నారు పోలీసులు.పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో తాగేస్తున్న మందుబాబులకు దడ పుట్టిస్తున్నారు. గంజాయి మత్తులో జోగుతున్న వ్యక్తుల భరతం పడుతున్నారు. తాజాగా ఆకాశంలో నుంచి ఒక్కసారిగా దూసుకువచ్చిన డ్రోన్లను చూసి తాగుబోతులు, పేకాటరాయుళ్లు పరుగులు పెట్టారు. శివారు కాలనీల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న.. నిందితులపై నాలుగు కేసులు నమోదు చేశారు. నేరాల నియంత్రణకు డ్రోన్ల సాయం తీసుకుంటున్నారు ఏపీ పోలీసులు. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతున్నారు. మున్ముందు వణుకుపుట్టించేలా యాక్షన్ ఉంటుందంటున్నారు పోలీసులు.నిర్మానుష్య ప్రదేశాల్లో మద్యం సేవించడం, పేకాట ఆడటం వంటివి చేస్తున్నారు. వీటిపై పోలీసులు నిఘా పెట్టారు. శివారు ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పోలీసుల నిఘా ఉంచారు. తాజాగా.. పోలీసుల డ్రోన్లను చూసి.. మందు బాబులు, పేకాటరాయుళ్లు పరుగులు పెట్టారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై నాలుగు కేసులు నమోదు చేశారు.కేవలం అనంతపురం జిల్లాలోనే కాదు ఇతర జిల్లాల్లోనూ పోలీసులు డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఇటీవల అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం సొలభం పంచాయతీ డేగలరాయి ప్రాంతంలో.. గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్.. సిబ్బందితో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లి తనిఖీ చేశారు. డ్రోన్‌ను ఆకాశంలోకి ఎగరవేసి గంజాయిని సాగు చేస్తున్నట్లు గుర్తించారు. గ్రామ పరిసరాల్లో 5 ఎకరాల్లో సాగు చేస్తున్న వెయ్యి గంజాయి మొక్కలను డ్రోన్ సాయంతో గుర్తించి ధ్వంసం చేశారుఅటు విజయవాడ పోలీసులు కూడా డ్రోన్లను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి రాజశేఖర్ బాబు.. వినూత్నంగా ఆలోచించి ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటున్నారు. లైవ్ డ్రోన్ కెమెరాల (లైవ్ డ్రోన్ ఇంటిగ్రేటెడ్ టు కమాండ్ కంట్రోల్) ద్వారా ట్రాఫిక్ రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అధికారులు పరిశీలించి.. సిబ్బందికి సూచనలు ఇస్తూ ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు.ప్రభుత్వం 2018లో విజయవాడ పోలీసు కమిషనరేట్‌కు పెంటాన్ 4ప్రో మోడల్‌కు చెందిన 9 డ్రోన్లను ఇచ్చింది. వీటి కాలపరిమితి ముగిసింది. దీంతో అప్‌డేట్ వెర్షన్ కలిగిన ఎయిర్3 డ్రోన్లను మూడు విధాలుగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం కమాండ్ విజయవాడ కంట్రోల్ సెంటర్ నుంచి నిత్యం డ్రోన్లను గాల్లోకి పంపుతున్నారు. వీటిని ఆపరేట్ చేయడమే కాకుండా.. వాటికి రిపేర్లు వచ్చినా చేయగలిగేలా మహిళా పోలీసులను తయారు చేయాలని పోలీస్ అధికారులు భావిస్తున్నారు.విజయవాడ వరదల సమయంలో డ్రోన్ సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా వినియోగించుకుంది. హెలికాప్టర్లు, పడవల ద్వారా వెళ్లలేని మారుమూల ప్రాంతానికీ డ్రోన్ ద్వారా ఆహారం, తాగునీరు, మందులు సరఫరా చేశారు. ప్రభుత్వం చేసిన ఈ పనికి ప్రశంసలు వచ్చాయి. కేవలం పోలీసులే కాదు.. దాదాపు అన్ని రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా వ్యవసాయంలో డ్రోన్ల పాత్ర కీలకంగా మారింది. అటు డ్రోన్ల వినియోగానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.