YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

55 లక్షలకు కిడ్ని.... దాతకు 5 లక్షలతో సరి

55 లక్షలకు కిడ్ని.... దాతకు 5 లక్షలతో సరి

హైదరాబాద్, జనవరి 27, 
హైదరాబాద్ కిడ్నీ రాకెట్‌ కేసులో సంచలన విషయాలు నమోదవుతున్నాయి. సరూర్‌నగర్‌లోని అలకనంద ఆసుపత్రిపై ఆకస్మిక దాడి చేసిన పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ముఠాలో కీలకంగా వ్యవహరించి పరారీలో ఉన్న ఇద్దరు వైద్యులు, నలుగురు బ్రోకర్ల కోసం గాలిస్తున్నారు. ఒక కారు, 5 లక్షల నగదు, పది ఫోన్లు, సర్జరీ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిరుపేదలే టార్గెట్‌గా కిడ్నీ కాలాడీలు రెచ్చిపోయినట్లు పోలీసుల ఎంక్వైరీలో తేలింది. 2023 నుంచి ఇప్పటివరకూ దాదాపు 90 కిడ్నీమార్పిడి ఆపరేషన్లు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కిడ్నీదాతలు, గ్రహీతలతోపాటు వైద్యులు, సహాయకులను తీసుకొచ్చి ఈముఠా కిడ్నీ రాకెట్ నడిపినట్లు గుర్తించారు. ఒక్కో ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు 55లక్షలకు పైగా తీసుకున్నట్లు పోలీసుల ఎంక్వైరీలో తేలింది. హైదరాబాద్‌కు జనని ఆస్పత్రికి చెందిన డాక్టర్‌ సిద్ధంశెట్టి అవినాశ్‌ కు విశాఖకు చెందిన లక్ష్మణ్‌ పరిచయమయ్యాడు. కిడ్నీరాకెట్‌కు సహకరిస్తే… ఒక్కో ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు 2.5 లక్షలు ఇస్తామని, దాతలు, గ్రహీతలు, వైద్య బృందాన్ని తామే తీసుకొస్తామని ఆఫర్‌ ఇవ్వడంతో కిడ్నీ రాకెట్‌కు సహకరించాడు. అవినాశ్‌కు చెందిన జనని ఆసుపత్రిలో 2023 ఏప్రిల్‌ నుంచి 2024 జూన్‌ వరకు 40-50 వరకు కిడ్నీమార్పిళ్లు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అయితే పలు సమస్యలతో జనని ఆసుపత్రిని 2024 జూన్‌లో మూసేసిన అవినాశ్‌.. తర్వాత సరూర్‌నగర్‌ లోని అలకనంద ఆసుపత్రి ఎండీ సుమంత్‌తో టైఅప్ పెట్టుకున్నాడు. తర్వాత ఒక్కో ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు అవినాశ్‌ లక్ష, సుమంత్‌ లక్షన్నర చొప్పున పంచుకున్నారు. అలకనంద ఆస్పత్రిలో గతేడాది డిసెంబరులోనే దాదాపు 20కిపైగా కిడ్నీమార్పిడి ఆపరేషన్లు జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాదు నగరంలోని జనని, అలకనంద, అరుణ ఆస్పత్రులతో పాటు పలు ఆస్పత్రుల్లో మొత్తంగా 90 ఆపరేషన్లు చేసిన పోలీసులు నిర్ధారించారు. కిడ్నీల దందాలో ఆరితేరిన విశాఖకు చెందిన పవన్‌, అతడి అనుచురుడు పూర్ణ సహాయంతో వేరు రాష్ట్రాల నుంచి వైద్యులు, సహాయకులను తీసుకొచ్చి కిడ్నీ రాకెట్ నిర్వహించారని పోలీసులు చెబుతున్నారు. ప్రధాన ముద్దాయి పవన్‌ కనుసన్నల్లో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోనూ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్లు చేసినట్లు తేల్చారు. మరోవైపు పవన్‌ ముఠా ఒక్కో మార్పిడికి కిడ్నీ గ్రహీతల నుంచి 55 లక్షలకుపైగా వసూలు చేసి.. దాతకు 5 లక్షలు, జనని ఆస్పత్రి నిర్వాహకుడు అవినాశ్‌కు రెండున్నర లక్ష, ఆపరేషన్‌ చేసిన వైద్యులకు 10 లక్షలు, థియేటర్‌ సహాయకులు ఐదుగురికి 30 వేల చొప్పున పంచేవారని పోలీసులు ఎంక్వైరీలో తేలింది. పరారీలో ఉన్న పవన్‌ కోసం గాలిస్తున్న పోలీసులు కిడ్నీ రాకెట్ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్నారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు స్పెషల్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts