YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రిటైర్మెంట్ మళ్లీ.... పెంచుడేనా

రిటైర్మెంట్  మళ్లీ.... పెంచుడేనా

హైదరాబాద్, జనవరి 27, 
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. ప్రభుత్వం రిటైర్‌మెంట్ వయస్సును మళ్లీ పెంచే ఆలోచన చేస్తుందనే టాక్ ప్రభుత్వ ఆఫీసుల్లో బిగ్ సౌండ్ చేస్తుంది. పరిస్థితి చూస్తుంటే నిజమే కావొచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి.రిటైర్డ్ ఉద్యోగుల అంశం తెలంగాణ ప్రభుత్వానికి భారంగా మారిపోయింది. ఇప్పటికే రేవంత్ సర్కార్.. ఆర్థిక కష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆరు గ్యారెంటీలకు, సంక్షేమ పథకాలకు నిధుల కొరత వేధిస్తోంది. వీటికి తోడు అప్పులకు చెల్లిస్తున్న వడ్డీలు తడిసి మోపెడు అవుతున్నాయట.మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు ఇప్పుడు ఉద్యోగుల రిటైర్మెంట్ అంశం కూడా సర్కార్‌కు సవాల్‌గా మారిందని తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి సుమారు 8వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ కాబోతున్నారు. అంతే కాదు వచ్చే నాలుగేళ్లలో సుమారు 38 వేల మందిపైగా ఉద్యోగ విరమణ స్టేజ్‌లో ఉన్నారట. అయితే వీరందరికి బెనిఫిట్స్ చెల్లించడం సర్కార్‌కు పెను భారమనే చర్చ జరుగుతోంది..ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్‌మెంట్ తర్వాత సర్కార్ చెల్లించాల్సిన బెనిఫిట్స్‌ చాలానే ఉంటాయి. వారి మూల వేతనం ప్రకారం HRA, CCA, DAలను కలుపుకొని మొత్తం వేతనానికి 10 రెట్లు లీవ్‌ శాలరీ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఒక్కొక్కరికి సగటున 30 నుంచి 50 లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్చి చివరి నాటికి 8 వేల మంది ఉద్యోగులు రిటైర్ కానున్నారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. 2025 డిసెంబర్ నాటికి సుమారు 10 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నట్లు తెలుస్తోంది.ఇదే క్రమంలో 2026, 2027 లోనూ దాదాపు 10 వేల మంది చొప్పున ఉద్యోగులు రిటైర్ కానున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2028లో మరో 8 వేల మంది విరమణ చేస్తారు. వీరందరికి బెనిఫెట్స్ చెల్లించాలంటే ప్రభుత్వానికి అదనంగా ప్రతి ఏడాది సుమారు 5వేల కోట్ల రూపాయలు ఖచ్చితంగా అవసరమవుతాయి. అంటే నెలకు తక్కువలో తక్కువ 400 కోట్లు ఉద్యోగ విరమణ చేసే ఉద్యోగులకే కేటాయించాలన్నమాట.గత ఏడాది రిటైర్‌మెంట్ అయిన ఉద్యోగులతో పాటు, ఈ ఏడాది రిటైర్ అవుతున్న ఉద్యోగులకు దాదాపు 3వేల 200 కోట్ల రూపాయల వరకు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు అధికారులు. అసలే ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రభుత్వం రిటైర్ ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించే పరిస్థితుల్లో లేదని సచివాలయ వర్గాలు చెబుతున్నాయిఐతే ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే అని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఉద్యోగుల ఏజ్ లిమిట్‌ను గత ప్రభుత్వం పెంచింది. ప్రభుత్వ ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచారు. 2021లో తీసుకున్న ఈ నిర్ణయంతో 2024 మార్చి 31 వరకు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్‌మెంట్లు దాదాపు జరగలేదు.దీంతో గత ప్రభుత్వం వీరికి ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం రాలేదు. ఇక రేవంత్ సర్కార్ వచ్చిన 3 నెలల నుంచే పదవీ విరమణలు మొదలవ్వడంతో ఒక్కసారిగా భారం పడుతోంది. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్‌ పే చేయడం సర్కార్‌కు సవాల్‌గా మారిందట.రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ కోసం వచ్చే నాలుగేళ్ల కాలంలో 20వేల కోట్ల రూపాయల భారం పడొచ్చని అంచనా వేస్తోంది ఆర్థిక శాఖ. ఈ భారం నుంచి తప్పించుకునేందుకు ఈ ప్రభుత్వం కూడా రిటైర్‌మెంట్ ఏజ్‌ను పెంచే ఆలోచన చేస్తోందని టాక్ వినిపిస్తోంది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల రిటైర్మెంట్‌ ఏజ్‌ 62 ఏళ్లుంటే.. తెలంగాణలో 61 ఏళ్లుగా ఉంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచితే ఎలా ఉంటుందనే ప్రతిపాదినను పరిశీలిస్తోందటఐతే పదవీ విరమణ వయస్సు పెంపుతో ఉద్యోగుల్లోనూ పని చేసే శక్తి ఉండదని టాక్‌ కూడా వినిపిస్తోంది. ఆరుపదుల వయస్సు దాటినా.. సేవలు అందించడం కష్టమే అంటున్నారు. ఇటు ప్రభుత్వ ఆలోచనను నిరుద్యోగులు, ప్రతిపక్షాలు సైతం తప్పుబడుతున్నాయి. దీంతో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను బాండ్స్ లేదా మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ రూపంలో చెల్సించే అవకాశాలను సైతం తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఉద్యోగ విరమణ వయస్సుపై సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది అటు ఉద్యోగుల్లో, ఇటు నిరుద్యోగుల్లో ఉత్కంఠగా మారింది.

Related Posts