YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బీసీ మంత్రంపైనే బీజేపీ ఆశలు

బీసీ మంత్రంపైనే బీజేపీ ఆశలు

హైదరాబాద్, జనవరి 27, 
సౌత్‌పై పట్టుకోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ సమయంలోనే తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక తెరపైకి వచ్చింది. చాలామంది నేతలు అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. కాషాయ పార్టీ అధిష్టానం మాత్రం ఈటెల రాజేందర్ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.రాజకీయ వ్యూహాలు రచించడం, వాటిని పకడ్బందీగా అమలు చేయడంలో ప్రస్తుత బీజేపీ పెద్దలు ఎక్స్‌పర్ట్స్. బీజేపీ ఓ ప్లాన్ చేస్తుంది.. దానికి కౌంటర్ ఇవ్వాలనే ఆలోచన కూడా రాజకీయ ప్రత్యర్థులకు రాకుండా జాగ్రత్తపడతారు. గతంలో అలా ఎన్నో వ్యూహాలు రచించి అమలు చేశారు. రాజకీయ లబ్ధి పొందారు. వేరే రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా.. ఇప్పుడు బీజేపీ పెద్దల దృష్టి తెలంగాణపై పడింది. రాష్ట్రంలో పట్టుకోసం కమలదళం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే కొత్త అధ్యక్షుడి ఎంపిక అంశం తెరపైకి వచ్చింది.ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నారు. అటు కేంద్రంలోనూ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ రెండు బాధ్యతలతో కిషన్ రెడ్డికి పని భారం పెరుగుతోంది. దీంతో తెలంగాణ బీజేపీ కొత్త సారథిని నియమించాల్సి వస్తోంది. అయితే.. అధ్యక్ష పదవి కోసం చాలామంది నేతలు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నవారు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు ప్రెసిడెంట్ పోస్టు కోసం పోటీ పడుతున్నారు. కానీ.. బీజేపీ పెద్దలు మాత్రం మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ వైపే మొగ్గు చూపుతున్నట్టు పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతోంది.ఈటెల రాజేందర్ తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని నేత. తెలంగాణ ఉద్యమంలో ఈటెల పాత్ర మరువలేనిది. తొలి తెలంగాణ ప్రభుత్వంలో ఈటెల మంత్రిగా పనిచేశారు. రెండోసారి కూడా కేసీఆర్ మంత్రివర్గంలో కీలక శాఖలు నిర్వహించారు. అన్ని పార్టీల నేతలతో ఈటెలకు మంచి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. వివాదాలకు దూరంగా ఉంటారనే పేరుంది. ఏ విషయంపై అయినా జాగ్రత్తగా మాట్లాడతారు. అందుకే బీజేపీ ఈటెల వైపు మొగ్గుచూపుతోందని తెలుస్తోంది.బీజేపీ తెలంగాణలో బీసీ మంత్రాన్ని నమ్ముకున్నట్టు తెలుస్తోంది. అందుకే ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన ఈటెలకు బాధ్యతలు అప్పగిస్తే.. రాజకీయంగా లబ్ధి జరగవచ్చని కమలం పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఈటెల సతీమణిది రెడ్డి సామాజికవర్గం. ఇది కూడా తమకు కలిసొస్తుందని బీజేపీ నమ్ముతున్నట్టు తెలుస్తోంది. అటు ఇతర బీసీ కులాల్లోనూ ఈటెలకు మంచి ఫాలోయింగ్ ఉంది. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని కాషాయదళం భావిస్తున్నట్టు బీజేపీలో చర్చలు జరుగుతున్నాయి.
ఇటీవల కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధ్యక్షుడు కావాలంటే ఆర్ఎస్ఎస్ నేపథ్యం అవసరం లేదని స్పష్టం చేశారు. ఆయన చేసిన ఈ కామెంట్స్‌ చర్చనీయాంశంగా మారాయి. ఈటెలను దృష్టిలో పెట్టుకొనే ఈ వ్యాఖ్యలు చేసినట్టు చర్చ జరిగింది. అటు బీజేపీలో ప్రస్తుతం నంబర్ 2గా ఉన్న అమిత్ షా.. ఈటెల రాజేందర్ పట్ల సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది. వేరే నాయకులతో పోలిస్తే.. ఈటెల కు బాధ్యతలు అప్పగిస్తే లాభం జరగవచ్చని బీజేపీ భావిస్తున్నట్టు చర్చ జరుగుతోంది.తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ముగ్గురు నేతలు ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. షార్ట్‌ లిస్ట్‌లో ఈటెల రాజేందర్, డీకే అరుణ, రామచంద్రరావు పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు.. రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాజాసింగ్, చింతల రామచంద్రారెడ్డి కూడా అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్టు ప్రచారం జరిగింది.

Related Posts