YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆ గ్రామంలో మందు బ్యాన్

ఆ గ్రామంలో మందు బ్యాన్

నిజామాబాద్, జనవరి 27,
"తెలంగాణలో మందు తాగటమంటే.. అదేదో వ్యసనం కాదు.. అలవాటుపడిన సంప్రదాయం.." అని ఓ సినిమాలో హీరో డైలాగ్ చెప్తాడే కానీ.. నిజానికి చాలా ప్రాంతాల్లో మద్యానికి బానిసలై చాలా మంది తమ జీవితాలు నాశనం చేసుకుంటున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. పండుగకో పబ్బానికో ఆనందంగా ఉన్నప్పుడో బాధ పలకరించినప్పుడు.. స్నేహితుడు కలిశాడనో.. ఇలా కొన్ని సందర్భాలున్నప్పుడు తాగితే ఓకే కానీ.. తాగేందుకే సందర్భాలు క్రియేట్ చేసుకుంటుంటారు కొందరు. మరికొందరికైతే.. సందర్భమూ అవసరం లేదు.. సోపతీ అక్కర్లేదు.. మందు తాగాలన్న యావ ఒక్కటే. అలాంటి వాళ్లు ఎంతో మంది.. తాగి తాగి వారి లివర్లను పాడు చేసుకోవటమే కాదు.. జీవితాలను కూడా రోడ్డున పడేస్తున్నారు. ఈ క్రమంలో.. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోతాయిపల్లి గ్రామస్థులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.పోతాయిపల్లి గ్రామస్థులు తమ గ్రామంలో మద్యనిషేధం విధిస్తున్నట్లు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామంలో బెల్టుషాపులు ఎక్కువటం వల్ల యువకులు, రైతుకూలీలు మద్యానికి బానిసలై ఆర్థికంగా నష్టపోతున్నారని.. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్న విషయాలను పరిగణలోకి తీసుకుని.. మద్యనిషేధం విదిస్తున్నట్లు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ప్రకటించారు. ఈ మద్యనిషేధ తీర్మానం.. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుందని తెలిపారు.అయితే.. ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయిస్తే వారికి రూ.60 వేల జరిమానా విధిస్తామని తీర్మానం చేశారు. అంతే కాదండోయ్.. మద్యం విక్రయిస్తున్న వారిని గుర్తించి గ్రామపెద్దలకు సమాచారమిచ్చిన వారికి.. రూ.10 వేల నజరానా కూడా అందించనున్నట్టు ప్రకటించారు. కేవలం తమ గ్రామంలో మద్యనిషేధమే కాదు.. సమీప గ్రామాలకు చెందిన వ్యక్తులు పోతాయిపల్లితో పాటు గ్రామ శివార్లలో మద్యం సేవించటాన్ని కూడా అంగీకరించమని తెలిపారు. అలా ఎవరైనా మద్యం సేవిస్తే వారికి కూడా రూ.5 వేల జరిమానా వేయాలని తీర్మానించారు.తీర్మానం అయితే.. వినేందుకు బాగానే ఉంది కానీ.. అమలు ఎలా జరుగుతుందన్నది చూడాలి. ఇలా గతంలోనూ చాలా గ్రామాల్లో మద్యనిషేధ తీర్మానాలు చేసిన దాఖలాలు ఉన్నాయి. అయితే.. తీర్మానం చేసిన కొన్ని రోజులు చాలా సీరియస్‌గా తీసుకుని ఎవ్వరూ మద్యాన్ని ముట్టకుండా జాగ్రత్తగా ఉంటారు. కానీ.. కొద్దిరోజుల తర్వాత మందుబాబులు మెల్లిగా.. తమ పని తాము కానిచ్చేస్తుంటారు. ఊర్లో అమ్మకుండా అయితే జాగ్రత్తలు తీసుకుంటారు కానీ.. తాగకుండా ఎవరు మాత్రం ఎలా ఆపగలరు. గ్రామపెద్దలో, ఇంకెవరో ఎంత చెప్పినా, ఇంకెంత కట్టడి చేసినా.. మనలో ఆ మార్పు వచ్చే వరకు ఎలాంటి లాభం ఉండదు. పట్టి పట్టి పంగనామాలు పెడితే.. పక్కకుపోయి తుడిచేసుకున్నారన్న సామెతలా మారిపోతుంది.

Related Posts