
చెన్నై, ఫిబ్రవరి 13,
తమిళ సూపర్ స్టార్, విలక్షణ నటుడు కమల్ హాసన్ రాజ్యసభలోకి అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ కమల్‌ను రాజ్యసభకు నామినేట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది జులైలో జరిగే రాజసభ్య ఎన్నికల్లో డీఎంకే తమ అభ్యర్థిగా కమల్‌ను ప్రతిపాదించే అవకాశం ఉంది. ఇప్పటికే తమిళనాడు మంత్రి పీకే సేకర్ బాబు కమల్ హాసన్‌తో ఆయన నివాసంలో బుధవారం భేటీ అయ్యారు. రాజ్యసభ అంశం గురించే వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాగా కమల్ హాసన్ మక్కల్ నిధి మయం(ఎంఎన్‌ఎం) పేరుతో రాజకీయ పార్టీ స్థాపించి.. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో డీఎంకేతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పొత్తులో భాగంగానే ఎంఎన్‌ఎంకు ఒక రాజ్యసభ సీటును కేటాయించనుంది డీఎంకే.ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే సమయంలో దేశ భవిష్యత్తు కోసం ఆలోచించి.. కూటమి కడుతున్నట్లు వెల్లడించారు. 2024 సమయంలో డీఎంకేకు మద్దతు ఇచ్చిన కారణంగా కమల్ హాసన్‌కు రాజ్యసభ సీటు ఇచ్చేందుకు గతంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హామీ ఇచ్చినట్లు సమాచారం. జూన్‌లో మొత్తం ఆరు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియనుంది. దీంతో జులైలో డీఎంకే తరఫున కమల్ హాసన్‌ను నామినేట్ చేయాలనే స్టాలిన్ ఆలోచనను మంత్రి సేకర్ బాబు, కమల్‌తో పంచుకున్నట్లు తెలుస్తోంది. మరి అన్ని అనుకున్నట్లు జరిగితే.. కమల్ హాసన్‌ను త్వరలోనే రాజ్యసభ ఎంపీగా చూడొచ్చు. కమల్ అభిమానులు కూడా ఆయనను ఎంపీగా చూడాలని ఆశపడుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. రాజకీయా పార్టీ పెట్టి 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన కమల్ హాసన్ ఆయన పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేదు. అలాగే అర్బన్ లోకల్ ఎలక్షన్స్ బరిలోకి దిగి 140 చోట్లా పోటీ చేస్తే.. ఒక్కచోట కూడా గెలుపొందలేదు. కానీ గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం డీఎంకేకు పూర్తి మద్దతు ఇచ్చిన కమల్.. ఆ పార్టీ విజయం కోసం తీవ్రంగా శ్రమించారు. అనేక ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని దేశం కోసం డీఎంకేను గెలిపించాలని కోరారు. అప్పుడు కమల్ పడిన కష్టానికి ఇప్పుడు రాజ్యసభ సీటు ఇచ్చి గౌరవించాలని డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ భావిస్తున్నట్లు సమాచారం.