YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చట్టంలో లొసుగులతో వ్యాపారుల ఇష్టారాజ్యం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

 చట్టంలో లొసుగులతో వ్యాపారుల ఇష్టారాజ్యం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
 ఎమ్మార్పీని నియంత్రించే చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు. నాణ్యమైన ఆహారం అందేలా ఫుడ్ కంట్రోల్ బోర్డును పౌర సరఫరాల శాఖ క్వాలిటీ, కంట్రోల్ కిందకు తీసుకొస్తున్నామన్నారు. ప్రతిభ కనబర్చే వినియోగదారుల రక్షణ మండలి సభ్యులకు వచ్చే డిసెంబర్ లో అవార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. సచివాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరేళ్ల తరవాత తొలిసారిగా తన హయాంలో వినియోగదారుల రక్షణ మండలి సమావేశం జరిగినట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున భూమి కేటాయిస్తే, కేంద్ర ప్రభుత్వమే రూ.50 లక్షల వ్యయంతో ల్యాబ్ నిర్మిస్తుందన్నారు. ల్యాబ్ ల ఏర్పాటుతో సరుకుల నాణ్యతపై తక్షణమే పరీక్షలు నిర్వహించడానికి వీలుకలుగుతుందన్నారు.పుట్టగొడుగుల్లా గుర్తింపుల్లేని వాటర్ ప్లాంట్లు నెలకొల్పుతున్నారని, వాటిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పండగ రోజుల్లో ఆర్.టి.సి యాజమాన్యం ప్రయాణికుల అదనపు ఛార్జీలు వసూలు చేస్తోందని, దీనివల్ల పేదలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండలి సమావేశం దృష్టికి సభ్యులు తీసుకొచ్చారన్నారు. విజయవాడ ఆర్.టి.సి బస్టాండ్ లో టాయ్ లెట్ వినియోగానికి రూ.5లు వసూలు చేస్తున్నారని చెప్పగా, వెంటనే సంబంధిత మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో మాట్లాడి, రూపాయి నుంచి రూ.2లు వసూలు చేయాలని కోరామన్నారు. దీనికి ఆయన సరేనన్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మధ్యాహ్న భోజనం పథకం అమలులో భాగంగా అక్షయపాత్ర సంస్థ విద్యార్థులకు కోడిగుడ్లు పంపిణీ చేయడంలేదని సభ్యులు తెలిపారన్నారు. దీనిపై విద్యాశాఖాధికారులు స్పందిస్తూ, ఆయా విద్యా సంస్థ యాజమన్యాలకు కోడిగుడ్డుకు రూ.1 చొప్పున చెల్లిస్తున్నామని వారు చెప్పారన్నారు. చంద్రన్న విలేజ్ మాల్స్ లో ప్యాక్ ల పేరుతో అధిక ధరలకు కొన్ని రకాల వస్తువులు విక్రయిస్తున్నారని సభ్యులు తెలిపారన్నారు. ఆయా వస్తువుల ధరల అదుపునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చామని మంత్రి తెలిపారు. బస్ పాస్ లు ఇస్తూ, బస్సులు నడపడంలేదన్నారు. పట్టణాల్లో జనరిక్ మందులు కొనుగోలు చేసి, ఆర్.ఎం.పిలు, మెడికల్ షాపుల యజమానులు గ్రామాల్లో సాధారణ ధరలకు విక్రయిస్తున్నారని సభ్యులు ఫిర్యాదు చేశారన్నారు. నాణ్యమైన ఆహారం అందేలా ఫుడ్ కంట్రోల్ బోర్డును పౌర సరఫరాల శాఖ క్వాలిటీ, కంట్రోల్ కిందకు తీసుకొస్తున్నామన్నారు. ఆయిల్ బంక్ లో ఇంధనం నింపుకునే సయమంలో క్రెడిట్ కార్డు వినియోగిస్తే 2 శాతం చార్జి వసూలు చేస్తున్నారన్నారు. కొన్ని మల్టీప్లక్స్ థియేటర్లు, షాపింగ్ మాల్స్ లో ఎమ్మార్పీ ధరలకంటే అధికంగా విక్రయిస్తున్నారన్నారు. ఇటీవల పీవీపీ షాపింగ్ మాల్ లో తనిఖీలు నిర్వహిస్తుండగా, బ్రాండెడ్ కాకుండా స్థానికంగా తయారైన వాటర్ బాటిల్ ను రూ.100లకు విక్రయించడం గుర్తించామన్నారు. చట్టంలో ఉన్న లొసుగులను తమకనుకూలంగా కొందరు వ్యాపారులు వినియోగించకుంటున్నారన్నారు. ఎమ్మార్పీపై తమ కంట్రోల్ లేదని, దీనివల్ల వినియోగదారులు మోసపోయే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. దేశ వ్యాప్తంగా ఎమ్మార్పీని నియంత్రించే విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎప్పటికప్పుడు దాడులు చేయడం ద్వారా ఎమ్మార్పీ కంటే అధిక ధరల విక్రయాలను అడ్డుకుంటున్నామని మంత్రి పుల్లారావు తెలిపారు. ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల  జాయింట్ కలెక్టర్లను ఆదేశించామన్నారు. కొందరు వ్యాపారులు ఎమ్మార్పీతో పాటు జీఎస్టీని కూడా వేస్తున్నారన్నారు. ఎమ్మార్పీలోనే జీఎస్టీ ఉంటుందని, అదనంగా ఏమీ చెల్లించనక్కర్లేదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. నర్సరీలలో నకిలీ మొక్కలు అమ్ముతున్నారని, దీనివల్ల రైతులు నష్టపోతున్నారని తెలిపారు. నర్సీరీలను నియంత్రణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే సమావేశం నాటికి ఆయా శాఖలు తమకొచ్చిన ఫిర్యాదులపై పరిష్కారాలు చూపి, ఒక నివేదిక రూపొందించాలని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.

Related Posts