
విజయవాడ, జూలై 23,
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాలకు గుడ్ చై చెప్పే ఆలోచనలో ఉన్నారు. ఆయన ఇక రాజకీయాల్లో పూర్తి కాలం కొనసాగేందుకే నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అందుకే నిన్న హరిహరవీరమల్లు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో గాని, మీడియా సమావేశంలో కాని ఇకపై తాను సినిమాలు చేయకపోవచ్చని చెప్పారు. పవన్ ఫ్యాన్స్ కు నిజంగా నిరాశ పర్చే వార్తే. ఎందుకంటే అతి తక్కువ సినిమాలు చేసి ఎక్కువ అభిమానులను సంపాదించుకున్న పవన్ కల్యాణ్ కు నిజజీవితంలో సినిమాలపై ఆసక్తి లేదు. ఆయన ఎక్కువ కాలం ప్రజాసేవ చేయాలని నిర్ణయించుకుని జనసేన పార్టీ 2014లో ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల్లో దారుణ ఓటమికి గురి కావడంతో ఆయన మనసును మళ్లించుకోవడానికి కొంత కాలం సినిమాల వైపు మళ్లించారు. 2019 ఎన్నికల ఫలితాల వెంటనే... 2019 ఎన్నికలు జరిగిన తర్వాత వెనువెంటనే రాజకీయాల్లో తన పరిస్థితి ఏంటో పవన్ కల్యాణ్ తాను తెలుసుకున్నారు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులోనూ కమల్ హాసన్ వంటి స్టార్లు రాజకీయాల్లో రాణించలేకపోవడం, రాజకీయాల్లోకి వచ్చేందుకు అన్నీ సిద్ధం చేసుకుని వెనక్కు తగ్గిన రజనీకాంత్ ను చూసిన తర్వాత పవన్ కల్యాణ్ ఆలోచనల్లో మార్పు వచ్చిందని చెబుతున్నారు. తాను కీలక పదవిలో లేకపోయినా ఏపీ రాజకీయాల్లో ముఖ్య భూమిక పోషించాలన్న భావనతో ఆయన 2019 ఎన్నికల తర్వాత ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో జత కట్టారు. అయితే ఏపీలో బీజేపీకి పెద్దగా ఓటు బ్యాంకు లేకపోవడంతో ఆయన టీడీపీతో సన్నిహితంగా మెలగాలని కోరుకున్నారు. జగన్ ను ఓడించాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్నా పార్టీ మద్దతు అవసరం. ఓటు బ్యాంకు లేకపోయినా ఎలక్షనీరింగ్ చేయాలంటే బీజేపీ సహకారం అవసరమవుతుందని గ్రహించారు. ఇక టీడీపీ విషయానికి వస్తే క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న పార్టీ, ఓటు బ్యాంకు భారీగా కలిగిన పార్టీగా, యాభై వసంతాల చరిత్ర కలిగిన పార్టీగా దానిని కూడా కూటమిలో కలుపుకుంటే జగన్ ను కొట్టేయవచ్చన్న నమ్మకంతోనే కూటమిని ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యారు. ఇక రానున్న కాలంలోనూ కూటమికి తిరుగులేదని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. తాను ముఖ్యమంత్రిగా కాకపోయినా సరే.. చంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కీలకంగా మారాలన్నది మాత్రం పవన్ ఆలోచనగా ఉంది. అందుకే పవన్ కల్యాణ్ కూటమిని సజావుగా వచ్చే ఎన్నికల వరకూ మనస్పర్థలు తలెత్తకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక సినిమాలకు స్వస్తి చెప్పి ఫుల్ టైం రాజకీయాల్లోనే ఉంటారట.
మళ్లీ చేయాలంటున్న ఫ్యాన్స్
వర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ దాదాపుగా అన్ని ప్రాంతాల్లో మొదలయ్యాయి. ప్రీమియర్ షోస్ బుకింగ్స్ కూడా ఒక్క నైజాం ప్రాంతం లో తప్ప అన్ని ప్రాంతాల్లో బుకింగ్స్ ని మొదలు పెడుతున్నారు. మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న చిత్రం, అది కూడా డైరెక్ట్ సినిమా, అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆయన్ని వెండితెర పై చూడాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రొమోషన్స్ లో చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు. ఈరోజు మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు నాన్ స్టాప్ గా అన్ని నేషనల్ మీడియా చానెల్స్ కి ఆయన ఇంటర్వ్యూస్ ఇచ్చాడు.లోకల్ గా ఉండే ఒక పాపులర్ న్యూస్ ఛానల్ కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ లో అభిమానులకు నచ్చని కొన్ని కామెంట్స్ చేశాడు. అదేంటో ఒకసారి చూద్దాం. ఆయన మాట్లాడుతూ ‘ప్రస్తుతానికి అయితే చేతిలో ఉన్న ఈ మూడు సినిమాలను పూర్తి చేసేసాను. ఉస్తాద్ భగత్ సింగ్ మరో ఆరు రోజులు షూటింగ్ చేస్తే అయిపోతుంది. ఓజీ చిత్రం ఇప్పటికే పూర్తి అయ్యింది. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలను నా సమయం కేటాయించాలని అనుకుంటున్నాను. పార్టీ ని క్షేత్ర స్థాయి నుండి బలోపేతం చెయ్యాలి. అదే నా ప్రధాన లక్ష్యం. అయితే సినిమా నా జీవనాధారం. ప్రస్తుతానికి నా వద్ద కథలు ఏమి లేవు. భవిష్యత్తులో నా రాజకీయ కార్యక్రమాలకు క్లాష్ రాకుండా ఉండే పని అయితే సినిమాల్లో నటిస్తాను. లేదంటే నా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ని రీ యాక్టీవ్ చేసి సినిమాలను నిర్మిస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్.
ఆయన మాట్లాడిన ఈ మాటలు అభిమానులను తీవ్రంగా నిరాశకు గురి చేస్తున్నాయి. సమయం తీసుకొని అయినా సినిమా చెయ్యండి అన్నా అంటూ అభిమానులు బ్రతిమిలాడుతున్నారు. కానీ అభిమానులు అర్థం చేసుకోవాల్సినది ఒకటి ఉంది. ఆయన సినిమాలకు దూరం అవుతానని చెప్తాడు కానీ, డబ్బు అవసరం ఆయన్ని సినిమాలు కచ్చితంగా చేయిస్తుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వెంటనే ఆయన సినిమాలు చెయ్యకపోవచ్చు గాక, కానీ 2027 లేదా 2028 లో ఆయన కచ్చితంగా సినిమా చేయొచ్చు. అభిమానులు అధైర్యపడొద్దు అంటూ సోషల్ మీడియా లో పలువురు విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రెడీ అంటే సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ సిద్ధంగా ఉంది. మరి దీన్ని ఆయన ఎప్పుడు సెట్స్ మీదకు తీసుకెళ్తాడో చూడాలి.