
మెదక్, మార్చి 13,
తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీల ఎంపిక కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా పరిస్థితి మారిందట. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎంపికలో అధిష్టానం ఒకటి తలిస్తే..జరుగుతున్నది మాత్రం మరొకటి అన్నట్లుగా ఉందట. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాస్త బలహీనంగా కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథెన్ చేసేందుకు విజయశాంతికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిందట కాంగ్రెస్ పార్టీ.గత అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ జిల్లాలో బీఆర్ఎస్‌కు ఏడు స్థానాలు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పర్ఫామెన్స్ చాలా వీక్‌గా అనిపించిందట. దీంతో అక్కడ పార్టీని బలోపేతం చేయడం కోసమే..గతంలో మెదక్ ఎంపీగా పనిచేసిన విజయశాంతిని శాసనమండలికి సెలెక్ట్ చేశారట కాంగ్రెస్ పెద్దలు.ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీ బలోపేతం కోసం విజయశాంతిని ఎమ్మెల్సీగా సెలెక్ట్ చేస్తే..అక్కడ పార్టీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారిందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మెదక్ జిల్లాలోని పటాన్‌చెరు నియోజకవర్గంలో గ్రూపు తగాదాలు పీక్ లెవల్‌కు చేరాయి. ఇక ఇప్పుడు విజయశాంతి ఎంట్రీతో కొత్త గ్రూపు ఫామ్ అయ్యిందనే చర్చ జరుగుతోంది.విజయశాంతి పేరు ప్రకటన వెలువడగానే మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా చూసి షాక్ కు గురయ్యానని కామెంట్స్ చేశారు. అయితే విజయశాంతి అంటే ఉమ్మడి మెదక్ జిల్లాలోని సీనియర్లకు ఏమాత్రం గిట్టదట. మంత్రి దామోదర రాజనర్సింహాకు విజయశాంతికి మధ్య ఏమాత్రం పొసగదట. ఇక జగ్గారెడ్డి, విజయశాంతి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుందనే టాక్ ఉంది.ఎమ్మెల్సీగా విజయశాంతి ఎంపికే చర్చకు దారితీస్తుంటే..మరో ప్రచారం ఆసక్తి రేపుతోంది. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో విజయశాంతికి ఛాన్స్ ఉంటుందనే టాక్ నడుస్తోంది. ఇదే గనుక జరిగితే పరిస్థితి మరింత క్లిష్టంగా మారేలా ఉందట. ఉమ్మడి మెదక్ జిల్లాలో సీనియర్ నేత దామోదర రాజనర్సింహకు.. విజయశాంతికి మధ్య గ్యాప్ ఉందట.ఇక విజయశాంతికి మంత్రిగా అవకాశం ఇస్తే.. దామోదర రాజనర్సింహ హవా తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నారట. విజయశాంతి కేంద్రంగా కొత్త గ్రూప్ ఏర్పడి మరింత రచ్చ జరిగే అవకాశం లేకపోలేదనే చర్చ జరుగుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లా విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఒకటి తలిచి రాములమ్మకు అవకాశం ఇస్తే.. భవిష్యత్‌లో జరిగేది మాత్రం అందుకు భిన్నంగా ఉండబోతుందట.మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయోగం.. బూమరాంగ్ అవుతోందన్న టాక్ వినిపిస్తోంది. రాములమ్మ రాకతో మెదక్ జిల్లా కాంగ్రెస్‌లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో చూడాలి మరి.