
గుంటూరు, మార్చి 15,
మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత కొద్ది రోజులుగా యాక్టివ్ గా కనిపించడం లేదు. ఆయన కొన్ని నెలల నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పూర్తిగా వ్యవసాయానికే పరిమితం అయినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయన సైలెంట్ అయినట్లు తెలిసింది. మంగళగిరి నియోజకవర్గంలోనూ ఆయన కార్యకర్తలను కలవడం లేదు. చంద్రబాబు నాయుడుపై న్యాయస్థానాలకు వెళ్లడంతో పాటు అనేక కేసులు వేయడంతో తనకు ఈ పరిస్థితుల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశముందని భావించి ఆళ్ల రామకృష్ణారెడ్డి మౌనాన్నే ఆశ్రయించినట్లు కనపడుతుంది. వైసీపీ అధినేత జగన ను వచ్చి కలిసిన సందర్భం కూడా లేకపోవడం విశేషం.ఆళ్ల రామకృష్ణారెడ్డి వరసగా రెండుసార్లు మంగళగిరి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి గెలిచారు. 2019 ఎన్నికల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై విజయం సాధించారు. అయితే మంత్రివర్గంలో వైఎస్ జగన్ కు ఆయన చోటు కల్పించలేదు. ఎన్నికల ప్రచారంలో నాడు మంత్రి పదవి ఇస్తామనని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని వదిలేశారు. మంత్రి పదవిదక్కలేదన్న అసంతృప్తితో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టి మంగళగిరి టిక్కెట్ ను చిరంజీవికి ఇచ్చారు. దీంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జగన్ ను కూడా నాడు కలిసేందుకు ఇష్టపడలేదు.ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా నియమితులు కావడంతో ఆమె వెంట నడవాలని భావించి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. కానీ తర్వాత మళ్లీ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి తిరిగి వైసీపీ లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జగన్ కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం తరుపునే కాకుండా, పార్టీ విషయాలపై బలమైన గొంతుకగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉండేవారు. మొన్నటి ఎన్నికల్లో మంగళగిరి నుంచి నారా లోకేశ్ విజయం సాధించడంతో పాటు వరసగా వైసీపీ నేతలపై కేసులు నమోదవుతుండటంతో ఆయన కొంత డైలమాలో పడినట్లు సమాచారం.వైసీపీలో మరొక చర్చ జరుగుతుంది. ఆయనకు మంగళగిరి సీటు కాకుండా ఈసారి సత్తెనపల్లి సీటును ఇచ్చేందుకు జగన్ సిద్ధమయినట్లు వార్తలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరిని వదిలి పెట్టి వెళ్లేందుకు ఇష్టపడటం లేదని తెలిసింది. తాను ఓటమి చెందిన మంగళగిరి నుంచే మళ్లీ పోటీ చేయాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి భావిస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆ రకమైన హామీ జగన్ నుంచి లభిస్తే తిరిగి ఆళ్ల రామకృష్ణారెడ్డి యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారట. అయితే జగన్ దీనిపై ఇంత వరకూ క్లారిటీ ఇవ్వకపోవడంతోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజకీయంగా సైలెంట్ గా ఉన్నారని చెబుతున్నారు.