
కాకినాడ, మార్చి 17,
తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరు యనమల రామకృష్ణుడు.. తెలుగుదేశం ఆవిర్భావం నాటి నుంచి చట్టసభల్లో ఏదో ఒక పదవిలో కొనసాగుతూ వచ్చిన యనమలకు ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవీకాలం ముగియడంతో ఏ పోస్టు లేకుండా పోయింది.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఆయనకు ఈ సారి ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ చేయలేదు.. దాంతో రాజకీయాల్లో యనమల రామకృష్ణుడి శకం ముగిసిందా అన్న చర్చ మొదలైంది. నాలుగు దశాబ్దాలకు పైబడిన రాజకీయ జీవితంలో తొలిసారి చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకుండాపోయిన యనమల పొలిటికల్ ఫ్యూచర్‌పై పెద్ద చర్చే జరుగుతోందిప్పుడు.టీడీపీలో అత్యంత సీనియర్ నేతలుగా కొనసాగుతున్న నేతల్లో యనమల రామకృష్ణుడు ఒకరు. అశోక్ గజపతి రాజు, యనమల రామకృష్ణుడు, షరీఫ్ వంటి సీనియర్లు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. యనమల రామృకృష్ణుడు తొలిసారి 1983లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఏదో ఒక చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తూనే ఉన్నారు. మంత్రిగా, స్పీకర్‌గా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గా అనేక కీలకపదవులు నిర్వహించారు. 73 ఏళ్ల వయస్సులోనూ రాజకీయాల్లో యాక్టివ్ గానే ఉంటున్నారు.అయితే పార్టీలో యువతను ప్రోత్సహించాలనే కొత్త ఫార్ములాను టిడిపి ఈమధ్య ఆచరణ లో పెడుతోంది. దాని కారణంగా యనమల లాంటి సీనియర్లను పక్కన పెడుతున్నారు అనే ప్రచారం పార్టీలోనే సాగుతోంది. యనమల కుమార్తె దివ్య ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా తుని శాసనసభ్యురాలి గా ఉన్నారు. 1983 నుండి 2004 వరకూ 6 సార్లు ఎమ్మెల్యే గా యనమల రామకృష్ణుడు గెలిచిన నియోజకవర్గం అది. 2009 లో తొలిసారి ఓటమి చెందినా ఆయనకు కీలక పదవులు ఇచ్చి టీడీపీ గౌరవించింది.2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్సీగా ఉన్న యనమలకు చంద్రబాబు మంత్రిపదవి కట్టబెట్టారు. పార్టీ అధికారంలో లేనప్పుడు సైతం పీఏసీ చైర్మన్ వంటి పదవులు ఇచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న యనమల రామకృష్ణుడి పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. అయితే ఈసారి ఆయనకు ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇవ్వకపోవడంతో పొలిటికల్ గా యనమల కెరీర్ కు చెక్ పడినట్టే అని ప్రచారం మొదలైంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో యనమలకు మరోసారి అవకాశం దక్కుతుందని భావించారు.టీడీపీకి దక్కిన మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు బీసీలకు కేటాయించినా యనమలకు మాత్రం ఛాన్స్ దక్కలేదు. బీటీ నాయుడు, బీద రవిచంద్రలను బీసీ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎంపిక చేశారు. యనమల తుని నుంచి 2009 ఎన్నికల్లో తొలి సారి పరాజయం పాలయ్యారు. అప్పుడు కూడా చంద్రబాబు 2013లో ఆయన్ని ఎమ్మెల్సీని చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు యనమల శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు. అదీకాక యనమల బంధుగణానికి కూడా చంద్రబాబు పార్టీలో మంచి ప్రాధాన్యతే ఇచ్చారు. యనమల సన్నిహిత బంధువు , టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ ప్రస్తుతం మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. పుట్టా మహేష్‌కుమార్ ఏలూరు ఎంపీగా గెలిచారు. యనమల కూతురు తుని ఎమ్మెల్యేగా విజయం సాధించారుఅయినా తనకు టికెట్ దక్కకపోవడంపై యనమల ఎలా రియాక్ట్ అవుతారా అన్న అంశంపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వాస్తవానికి చంద్రబాబు తన కేబినెట్ లో యనమలకు అవకాశం ఇవ్వకపోవడంతో.. ఇప్పటికే యనమల ఒకింత అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి కొలువుదీరిన తరువాత కాకినాడ పోర్టు విషయంలో తెలుగుదేశం తీసుకున్న నిర్ణయాన్ని, అనుసరించిన విధానాన్ని వ్యతిరేకిస్తూ యనమల కొన్ని వ్యాఖ్యలు చేయడంతో ఆయన పార్టీకి దూరం జరుగుతున్నారా అన్న అనుమానాలు కూడా అప్పట్లో వ్యక్తం అయ్యాయిపొలిటికల్ గా ఎప్పుడు గుంభనంగా ఉండే యనమల రామకృష్ణుడు కూటమి ప్రభుత్వం ఏర్పాడ్డాక రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయంలో ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేశారు. బీసీ కోటాలో ఆయన ఆ పదవి ఆశించారు. దక్కకపోయేసరికి కొంత అసంతృప్తికి లోనై అధ్యక్షుడికి లేఖ రాశారు.ఇక ఇప్పుడు తాజాగా ఆయనకు ఎమ్మెల్సీగా మరో అవకాశం ఇవ్వకపోవడంతో యనమల ఎలా రియాక్ట్ అవుతారన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు యనమల పార్టీకి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని హై కమాండ్ ఏదో ఒక కీలకపదవి ఇస్తుందని, లేదా 2027 లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సి స్థానాల్లో అయినా ఆయనకు చోటు కల్పిస్తారని యనమల సన్నిహితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి యనమల పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో?